ములుగు: జిల్లాలో భూముల రీసర్వే నిర్వహణకు 19 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మిగిలిన గ్రామాల్లో వేగంగా పూర్తిచేసి డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్ జీ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన రీ సర్వే బృందాల సిబ్బంది శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రీ సర్వే విధివిధానాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, బృందాల మధ్య సమన్వయంపై సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత రీ సర్వే కోసం 70 గ్రామాలను ఎంపిక చేయగా, ఇప్పటివరకు 21 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన 49 గ్రామాల్లో పనులను ప్రణాళికతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల వారీగా రీ సర్వే పురోగతిని పర్యవేక్షిస్తూ, మిగిలిన పనుల్లో వేగం పెంచి డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి అల్లం రాజ్కుమార్, పర్యవేక్షకుడు మహేశ్, డివిజనల్ సర్వే పరిశీలకుడు సతీశ్ చంద్ర, ములుగు తహసీల్దార్ విజయభాస్కర్, నాయబ్ తహసీల్దార్లు మల్లేశ్, నితీశ్, అన్ని మండలాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు సిబ్బంది తమ విధులపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, సాంకేతిక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. జనగణన కార్యనిర్వాహక సిబ్బంది, సాంకేతిక సహాయకులకు కలెక్టరేట్లో రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.గతంలో కాగితాలపై నమోదు చేసిన జనగణన వివరాలను ఈసారి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయనున్నట్లు వివరించారు. అందుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుని సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
అదనపు కలెక్టర్ మహేందర్జీ


