భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో ఈ నెల 16న బతుకమ్మ ఫ్యామిలీ డే వేడుకలను నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. కృష్ణ కాలనీలోని మినీ ఫంక్షన్ హాల్లో జరిగే వేడుకలకు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, సేవా సమితి అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి
భూపాలపల్లి: జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తిచేయడంతో పాటు, పిల్లలకు నిర్దేశిత వయస్సులో తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఆధార్ నమోదు పురోగతి, ఆధార్ సేవల విస్తరణ, బయోమెట్రిక్ అప్డేట్లు, ఆధార్‌కు సంబంధించిన సమస్యలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు.
ఎన్హెచ్ఎం
ఉద్యోగుల సమ్మె
భూపాలపల్లి అర్బన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్ర ఎన్హెచ్ఎం జేఏసీ ఆదేశాల మేరకు జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు బురుగు రవికుమార్‌లు మద్దతు తెలిపి మాట్లాడారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం నిధులు కేటాయించడంతోపాటు, 8 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. ప్రతీ ఉద్యోగికి హెల్త్ కార్డులు జారీ చేసి ఈహెచ్ఎస్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న 9 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వెంకటేష్, రఘురామ్, జగదీష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి అమ్మవారికి
సింహ, గజవాహన సేవలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవీశరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం అమ్మవారిని శ్రీగాయత్రీ మాతగా అలంకరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం చంద్రఘంటా క్రమంలో దుర్గార్చన చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై ఊరేగించారు. సాయంత్రం మహిషామర్ధిని క్రమంలో దుర్గార్చన జరిపి గజవాహనంపై ఊరేగించారు. సేవా సమితి కన్వీనర్ అయిత గోపీనాథ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం, రాత్రి భక్తులకు అన్నప్రసాదాల వితరణ జరిగింది. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ దేవాలయాన్ని సందర్శించి మాడవీధుల నిర్మాణ పురోగతిని, నూతనంగా తయారు చేస్తున్న దారురథాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట కుడా, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు.


