ములుగు: జిల్లా కేంద్రంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో సోమవారం నుంచి జరుగుతున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో జోరుగా వసూళ్ల పర్వం కొనసాగుతోంది. 2026 ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తుండగా, జెడ్పీహెచ్ఎస్ బాలుర స్కూల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్లో 88 మంది విద్యార్థులకు మంగళవారం 52 మంది విద్యార్థులు హాజరు కాగా టెన్త్లో 61 మంది విద్యార్థులకు 39 మంది హాజరయ్యారు. సరైన ఉత్తీర్ణత లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, మహిళా సంఘాల సభ్యులు చదువును మధ్యలో ఆపేసినవారు ఓపెన్ పరీక్షలు రాస్తూ ఉంటారు.
మాస్ కాపీయింగ్..
ఇదే అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న పరీక్ష కేంద్రాల అధికారులు ప్రతీ సబ్జెక్టుకు రూ.500 చొప్పున పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల దగ్గర వసూలు చేస్తూ మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి. పరీక్షలకు హాజరుకాని అభ్యర్థుల నుంచి సబ్జెక్టుకు రూ.2వేలు వసూలు చేస్తూ ఇతరులచే పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత లేని మహిళను అటెండర్గా పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని సహచర ఉపాధ్యాయులే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఒకరికి బదులు మరొకరు సుమారు 8 మంది పరీక్షలు రాసినట్లు వినికిడి. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల స్థానాలలో ఇతర అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని, వారికి పరీక్ష కేంద్రాల అధికారులే సహకరిస్తున్నారని స్థానిక ఉపాధ్యాయులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ సిద్ధార్థరెడ్డిని వివరణ కోరగా.. డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని బుధవారం నుంచి ప్రతీ అభ్యర్థిని తనిఖీ చేసి లోపలికి పంపిస్తామన్నారు. ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామని డీఈఓ వెల్లడించారు.
ఒకరికి బదులు మరొకరు
పరీక్షలు రాస్తున్నట్లు ఆరోపణలు


