● ఉద్యమానికి నడుంకట్టిన
మానవ హక్కుల వేదిక
● మద్దతు ప్రకటించిన
రామప్ప పరిరక్షణ సమితి
వెంకటాపురం(ఎం): ఓ వైపు ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం.. మరోవైపు వేలాది ఎకరాలకు సాగునీరు అందించే రామప్ప చెరువు.. వీటి సమీపంలో బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి ప్రతిపాదించిన ఓపెన్‌న్ కాస్ట్ ప్రాజెక్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమారు 300 మీటర్ల లోతులో తవ్వకాలు, పేలుళ్లతో భూమి అంతర్గత పొరల్లో మార్పులు సంభవిస్తే రామప్ప ఆలయంతో పాటు చెరువు భద్రతపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ విధ్వంసం, భూసేకరణ, స్థానికుల జీవనోపాధి, రామప్ప పర్యాటక ప్రాధాన్యతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ మానవ హక్కుల వేదిక ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ప్రమాదం లేదన్న సింగరేణి భరోసా కంటే ప్రజల సందేహాలకు శాసీ్త్రయ అధ్యయనాలతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ శనివారం జంగాలపల్లి క్రాస్ నుంచి వెంకటాపురం మండల కేంద్రం మీదుగా రామప్ప ఆలయం వరకు చైతన్య ర్యాలీ నిర్వహించింది. మానవ హక్కుల వేదికకు రామప్ప పరిరక్షణ సమితి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొంది. ఈ చైతన్య ర్యాలీలో జిల్లా జేఏసీ కన్వీనర్ ముంజాల భిక్షపతి, మానవ హక్కుల వేదిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాదావత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ, నాయకులు యాదగిరి, దిలీప్, పద్మజ, శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వారసత్వ సంపదకు ముప్పు పొంచి ఉందా?
కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు 2021 జూలై 25న లభించింది. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడం అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆలయం, చెరువు, పరిసర ప్రకృతి వ్యవస్థ ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇలాంటి ప్రాంతానికి సమీపంలో భారీ స్థాయి బొగ్గు తవ్వకాలు చేపట్టే ముందు ప్రకంపనలు, భూగర్భ జలాలు, నీటి వనరులు, జీవవైవిధ్యం, పర్యావరణంపై ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలని మానవ హక్కుల వేదిక కోరుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే రామప్ప పర్యాటక ప్రాధాన్యతపైనా ప్రభావం పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అలాగే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు కోసం సుమారు మూడు వేల ఎకరాల భూమిని సింగరేణి సేకరించే ప్రతిపాదన ఉందని మానవ హక్కుల వేదిక తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో భూసేకరణ జరిగితే భూములపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడిస్తుంది.
●
చెరువు భద్రతపై ఆందోళన
జిల్లాలోని నాలుగు మండలాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందించడమే కాకుండా సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టుకు రామప్ప చెరువు నీటిని అందిస్తున్నారు. అలాగే చెరువు దిగువన సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఓపెన్‌న్‌కాస్ట్ ప్రాజెక్టును సింగరేణి సంస్థ ప్రతిపాదించినట్లు మానవ హక్కుల వేదిక పేర్కొంది. సుమారు మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రామప్ప చెరువు ఈ ప్రాంత వ్యవసాయానికి కీలకమైన నీటి వనరుగా ఉందని చెబుతున్నారు. గనుల్లో జరిగే భారీ పేలుళ్ల వల్ల భూమి అంతర్గత పొరల్లో మార్పులు సంభవించి చెరువులో నీటి నిల్వలు పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అలాగే చెరువు కట్ట పరిస్థితి.. నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలపై ఎంత ప్రభావం పడుతుందనే అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరమని పర్యావరణ పరిరక్షణ వాదులు కోరుతున్నారు.


