తొలిగురువు నాన్నే.. | - | Sakshi
Sakshi News home page

తొలిగురువు నాన్నే..

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

● రేడియోలో వచ్చే కార్యక్రమాలతో చదువుపై ఆసక్తి

● ‘సాక్షి’తో బాల సాహితీవేత్త అమ్మిన శ్రీనివాసరాజు

ప్రశ్న: ఈ స్థాయికి చేరడానికి స్ఫూర్తి ఎవరు?

జవాబు: మానాన్న అమ్మిన నూకరాజు నా తొలి గురువు. 1975–85 దశకంలో మా గ్రామంలో పాఠశాల, విద్యుత్‌ సౌకర్యం వంటి మౌలిక వసతులు లేవు. ఈ క్రమంలోనే 5వ తరగతి వరకు నాన్న వద్ద విద్యనభ్యసించాను. ఆ కాలంలో సమాచార సాధనమైన రేడియోలో వచ్చే కార్యక్రమాల ద్వారా చదువుపై ఆసక్తి పెరిగింది. మా నాన్నగారి స్ఫూర్తి, పట్టుదలతో చదవి ఉన్నత స్థాయికి చేరుకున్నాను.

ప్రశ్న: చదువు ఎలా కొనసాగింది?

జవాబు: ఆ కాలంలో దూరం వెళ్లి చదువుకోవడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో మూడేళ్లు ఖాళీగానే ఉన్నాను. మా గ్రామంలోని పాఠశాలకు కొత్తగా వచ్చిన మాష్టారు గురువయ్య సూచన మేరకు పేరూరు ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి ప్రైవేట్‌గా చదివి భద్రాచలంలో పరీక్షలు రాసి పాసయ్యాను. ఆ ఉత్సాహంతో పేరూరులో 8 నుంచి 10 వరకు చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. అనంతరం చర్లలో ఇంటర్‌, భద్రాచలంలో డిగ్రీ పూర్తి చేశాను. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశాను. పీజీ పూర్తి చేసే వరకు పత్రికలకు వ్యాసాలు, కథలు రాశాను. తెలుగు ఉపన్యాసకులుగా చర్ల, కూనవరం, వాజేడులో పనిచేస్తూ ఇష్టమైన బాల సాహిత్యంలో ఎంఫిల్‌, నాటక సాహిత్యంలో పీహెచ్‌డీని నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి తొలి రచయితగా డాక్టరేట్‌ సాధించాను.

ప్రశ్న: ఇప్పటి వరకు రాసిన రచనలు ఏంటి?

జవాబు: న్యాయపతిరాఖ రావు కథలు, డాక్టర్‌ మంతెన దృశ్య రూప కావ్యశీలన, బాల సాహిత్యంలో రసగుల్లలు, చంద్రవంకలు, జలగం వెంగళరావు జీవిత చరిత్ర, పీసు మిఠాయి, ఫ్రౌడ సాహిత్యంలో గ్రీష్మంలో వసంతం, అక్షరాభిషేకం, అక్షర ప్రస్థానం, సంపాదకీయాలు అక్షర దక్షిణ, పయనం, హృదయాంజలి రచించాను. కొత్తగూడెం, వరంగంల్‌ కేంద్రాల్లో 119 రేడియో ప్రసంగాలతో పాటు పత్రికల్లో 925 వ్యాసాలు, సమీక్షలు ప్రచురిత మయ్యాయి. అడవిలో అందాల పోటీ కథను మహారాష్ట్ర ప్రభుత్వం 7వ తరగతి తెలుగు వాచకం(సరళ భారతిలో)లో చేర్చింది.

ప్రశ్న: లభించిన పురస్కారాలు, అవార్డులు ఎంటి?

జవాబు: ఎర్రాప్రగడ బాల సాహిత్యంలో పురస్కారం, అద్దంకి జానకిలో శ్రీశ్రీ పురస్కారం, విశ్వ సాహితీ పురస్కారం, ఖమ్మం జిల్లా సాంస్కృతిక శాఖ పురస్కారం, తెలుగు రక్షణ శాఖ వేదిక, తెలుగు భాషా పురస్కారం, బాసర మూడ నాగభూషణం, సాహితీ పురస్కారం వంటి అనేక పురస్కారాలు వచ్చాయి.

ప్రశ్న: యువతకు మీరిచ్చే సందేశం?

జవాబు: ఇష్టం, పట్టుదలతో చేసే పని వల్ల సాధ్యం కానిది అంటూ లేదు, గ్రామీణ వాతావరణం, పేదరికం ఎదుగు దలకు ఆటంకాలు కావు.

రవాణా, విద్యుత్‌ సౌకర్యం లేని రోజుల్లో పట్టుదలతో రేడియోలో వచ్చే కార్యక్రమాలు వింటూ చదువుపై ఆసక్తి పెంచుకున్నాను. తొలిగురువు మా నాన్న వద్దే పాఠాలు నేర్చుకున్నాను.. ఎన్నో ఒడిదొడుకులు

ఎదుర్కొని పత్రికల్లో కథలు, వ్యాసాలు రాస్తూ తెలుగు ఉపన్యాసకులుగా

నిలదొక్కుకున్నాను. మండల పరిధిలోని చింతూరు గ్రామానికి చెందిన అమ్మిన శ్రీనివాసరాజు శనివారం తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – వాజేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement