ఏటూరునాగారం: నేడు ఎంగిలిపూల బతుకమ్మ కావడంతో మహిళలు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మండలకేంద్రాలకు చేరుకొని పండుగకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేయడంతో శుక్రవారం ప్రధాన రోడ్లు, షాపులు, పూల దుకాణాలు రద్దీగా కనిపించాయి. స్థానికంగా ఉన్న హాస్టల్స్, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు మండలకేంద్రాలకు చేరుకొని ప్రైవేటు వాహనాల్లో వారి సామగ్రితో వారి స్వగ్రామాలకు ప్రయాణం అయ్యారు. దీంతో ప్రైవేట్ వాహనాల్లో విద్యార్థుల రద్దీ కనిపించింది. తంగేడు పువ్వు లభించకపోవడంతో బంతి, గునుగు పువ్వులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. బస్సులు ఎక్కువ మొత్తంలో లేకపోవడంతో బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూశారు. దీంతో బస్సులు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.


