బీ ఫారాలు ఎవరికో?
చైర్‌పర్సన్ పీఠంపై కన్ను
అభ్యర్థిత్వం ఖరారు చేయని ప్రధాన పార్టీలు
ములుగు: రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతో కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు ప్రతీ వార్డుకు పోటీలో నిలవడంతో బీ ఫామ్‌లపై ఆసక్తి నెలకొంది. పార్టీల అభ్యున్నతికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డామని కొందరు, పైసలు ఎన్ని అయినా పెట్టి గెలిచి వస్తామని మరి కొందరు ప్రధాన పార్టీల ముఖ్య నేతల వద్ద బీ ఫారాల కోసం క్యూ కడుతుండడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోపు బీ ఫారాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి బీ ఫారాలు ఇవ్వకుండా వెయిట్ అండ్ సీ అంటూ అధిష్టానాలు దాటవేస్తున్నాయని పోటీదారులు వాపోతున్నారు.
బీ ఫామ్ రాకపోతే జంప్ కాకుండా..
మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి ఇద్దరి కంటే ఎక్కువగా నామినేషన్లు వేసిన వారిలో ఒకరికి బీ ఫామ్ ఇస్తే మిగిలినవారు ఇతర పార్టీకి జంపయ్యే అవకాశం ఉందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మున్సిపల్ వార్డుల పరిధిలో గెలుపోటములపై సర్వే నిర్వహిస్తున్నామని చెబుతూ బీ ఫారాలు ఇవ్వకుండా దాటవేస్తుండడంతో ఆశావహులు నిరుత్సాహపడుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయాలు ప్రతిరోజూ ఖర్చు చేస్తున్నా బీఫాంపై స్పష్టత లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక ఆయోమయానికి గురవుతున్నారు. బీఫాం కేటాయిస్తే రెబెల్స్‌ను బుజ్జగించి ఓటర్లను మెప్పించేందుకు వారం రోజులు కూడా ఓటింగ్‌కు సమయం లేదని వాపోతున్నారు. నామినేషన్లు వేసినప్పుడే బీఫారాలు అందిస్తే ప్రచారం నిర్వహించుకునేలా, ప్రతీ ఓటరును కలిసే అవకాశాలు ఉండేవని వారు అభిప్రాయపడుతున్నారు.
159 మంది అభ్యర్థులు.. 176 నామినేషన్లు
ములుగు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 159 మంది అభ్యర్థులు 192 నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే పార్టీ అభ్యర్థిగా రెండు నామినేషన్లు వేస్తే ఒక నామినేషన్‌ను పరిగణలోకి తీసుకున్నారు. పార్టీ అభ్యర్థిగా ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొకటి, ఇతర పార్టీ పేర్ల మీద మరో నామినేషన్ వేస్తే మూడింటిని ఆమోదించారు. 192 నామినేషన్లలో ఒకే పార్టీ అభ్యర్థిగా రెండు నామినేషన్లు వేసినా 32 నామినేషన్లలో 16 నామినేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకోగా 176 నామినేషన్లు వాలిడ్ నామినేషన్లుగా గుర్తించారు. 176 నామినేషన్లలో కాంగ్రెస్ నుంచి 66 మంది, బీఆర్‌ఎస్ నుంచి 52, బీజేపీ నుంచి 29 మంది, సీపీఎం నుంచి 3, ఇతర రిజిస్టర్ పార్టీల నుంచి ఏడుగురు, ఇండిపెండెంట్లు 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో చైర్‌పర్సన్ పీఠంపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. చైర్‌పర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతో అధికార పార్టీలో ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి మాజీ జెడ్పీటీసీ సకినాల భవాని, మాజీ ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి నామినేషన్లు వేయకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీలో చైర్‌పర్సన్ అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొంది. బీజేపీ నుంచిఇ సిరికొండ సునీత బలరాం పేరు వినిపిస్తుంది. బీజేపీ అధిష్టానం కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేడు(సోమవారం) బీఫారాలను అందయనుండగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు సర్వేల పేరుతో నామినేషన్ విత్‌డ్రా రోజు చివరి క్షణాల్లో అందజేయనున్నట్లు సమాచారం.
రేపటితో ఉపసంహరణకు గడువు
బీఫాం కోసం పోటీదారుల్లో టెన్షన్
చైర్‌పర్సన్ పదవిపై పలువురి ఆశలు
బీ ఫారాలు ఎవరికో?


