
సమష్టి కృషితోనే రాష్ట్రస్థాయి అవార్డు
ములుగు రూరల్: సమష్టి కృషితోనే సంపూర్ణతా అభియాన్‌లో రాష్ట్రస్థాయి అవార్డును సాధించినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. సెర్ప్ ఆధ్వర్యంలో శనివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర గవర్నర్ జిష్ణుదేవ్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమష్టి కృషి ఫలితంగానే జిల్లాకు అవార్డు దక్కిందన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. తంగేడు మైదానంలో పంద్రాగస్టు వేడుకలకు స్టేజీ ఏర్పాటు ప్రొటోకాల్ ప్రకారం కూర్చునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.
వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని సూపరింటెండెంట్‌తో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలో రిజిస్టర్లు, ఓపీ రికార్డులను పరిశీలించి మాట్లాడారు. వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. నిత్యం ఓపీ 150 నుంచి 200 మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఆస్పత్రులో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నులిపురుగుల నివారణ దినోత్సవంపై జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర

సమష్టి కృషితోనే రాష్ట్రస్థాయి అవార్డు