తుల్డా వెదురు.. ఆదాయం ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

తుల్డా వెదురు.. ఆదాయం ఫుల్‌

Aug 5 2025 8:12 AM | Updated on Aug 5 2025 8:12 AM

తుల్డ

తుల్డా వెదురు.. ఆదాయం ఫుల్‌

ఏటూరునాగారం: వ్యవసాయంలో మహిళా రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ మేరకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి జాబ్‌ కార్డు ఉండి 15 గుంటల స్థలం ఉన్న రైతులను గుర్తించి వారికి ఉచితంగా 60 వెదురు మొక్కలను అందజేసి సాగు చేయించనున్నాయి. దీంతో వారు నాలుగేళ్ల పాటు మొక్కలు పెంచినందుకు, ఆ తర్వాత ప్రతీ ఏడాది దిగుబడి కింద లక్షలాది రూపాయలు వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించాయి. జిల్లాలోని తుల్డా వెదురు మొక్కల పెంపకానికి ఏటూరునాగారం, కన్నాయిగూడెం, ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైలట్‌ మండలాలుగా గుర్తించాయి. ప్రతీ మండలంలో 350 మంది రైతుల చొప్పున మొత్తం మూడు మండలాల్లో 1050 మంది రైతులకు ఈ వెదురు రకం మొక్కలను అధికారులు అందించనున్నారు. ఇప్పటికే ఈజీఎస్‌ ద్వారా మణిపూర్‌ నుంచి తుల్డా రకానికి చెందిన 60వేల మొక్కలను అధికారులు దిగుబడి చేసుకొని నిల్వ చేశారు. అంతేకాకుండా ఈ మొక్క దాదాపు వ్యాధులు, తెగులు లేని గడ్డి రకం, చావు అనేది కూడా లేని మొక్క. అటవీశాఖ అధికారులు సైతం వెదురు మొక్కల పెంపకానికి ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు. ఆ మొక్కలను ఎంతైనా ఎక్కడికై నా రవాణా చేసుకునే వెసులుబాటును రైతులకు కల్పించింది.

ఉపయోగాలు..

వెదురు సాగు వల్ల అత్యధికంగా ఆక్సిజన్‌ లెవల్స్‌ పెరగడంతో పాటు అగర్‌బత్తులు, గృహ ఉపకార వస్తువులు, ఇస్తారాకులు, ప్లేట్లతో పాటు ఇతర ఆయుర్వేద మందుల్లో కూడా దీనిని ఉపయోగించనున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీలతో పాటు స్వచ్చంధ సంస్థలు సైతం రైతులను ఎంపిక చేసుకొని వారే స్వయంగా సాగు చేయించే పద్ధతిని కూడా అమలు చేస్తున్నాయి.

పర్యవేక్షణ

సెర్ప్‌ పరిధిలోని గ్రామైక్య సంఘాల సభ్యులకు ఈ వెదరు మొక్కల సాగు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. వీటికి తోడు గ్రూపు, బ్యాంకుల నుంచి రు ణ సదుపాయంతో పాటు పర్యవేక్షణ, మార్కెటింగ్‌, ఇతర సలహాలు, సూచనలతో పాటు సంఘ సభ్యులకు సెర్ప్‌ అధికారులు చేదోడు వాదోడుగా ఉంటారు. ఇటు ఈజీఎస్‌, అటు సెర్ప్‌ ఉండడం వల్ల మహిళా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఒక్కో మహిళా రైతుకు 60 మొక్కలు

నెలనెలా ఆదాయం,

నాలుగేళ్ల తర్వాత దిగుబడి

జిల్లాలో మూడు పైలట్‌ మండలాలుగా గుర్తింపు

అమలు ఇలా..

ఒక్కో మహిళా రైతుకు గ్రామైక్య సంఘం ద్వారా ఈ మొక్కలను అందజేసి ఒక మొక్క నాటినందుకు నెలకు రూ.119లు, మొక్కకు నీరు పోసి కాపాడినందుకు రూ.12లు, ఇతర మెంటనెన్స్‌కు రూ. 1.50ల చొప్పున అందజేస్తారు. ఒక్కో రైతుకు 30 నెలల పాటు ఈ పై డబ్బులను క్రమం తప్పకుండా చెల్లిస్తారు. అలాగే ఒక మహిళా రైతుకు కేవలం వెదురు మొక్కలను పెంచినందుకు రూ.27 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత దిగుబడి వచ్చిన వెదురు కర్రను విక్రయిస్తే మార్కెట్‌లో టన్నుకు వచ్చి రూ.1.50లక్షల వరకు ఆదాయం రానుంది. ఈ ఆదాయం సుమారుగా 25 సంవత్సరాలు నిర్వీరామంగా రావడంతో పేద మహిళా రైతులు కేవలం నాలుగైదు సంవత్సరాల్లో లక్షాధికారి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తుల్డా వెదురు సాగుతో అధిక లాభాలు..

తుల్డా వెదురు సాగుతో అధిక లాభాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వెదురు సాగుకు శ్రీకారం చుట్టాయి. ఇందులో ఈజీఎస్‌, సెర్ప్‌తో పాటు స్వచ్చంధ సంస్థలను కూడా భాగస్వాములను చేస్తున్నాయి. ఆక్సిజన్‌తో పాటు మంచి దిగుబడిని ఇచ్చే పంట, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి.

– చరణ్‌రాజ్‌, ఏపీఓ, ఏటూరునాగారం

తుల్డా వెదురు.. ఆదాయం ఫుల్‌1
1/1

తుల్డా వెదురు.. ఆదాయం ఫుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement