
కలెక్టర్ ఆకస్మిక పర్యటన
వెంకటాపురం(కె): మండల కేంద్రంలో కలెక్టర్ దివాకర మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావాణిలో తమకు ఇంటిస్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేయాలని మండల కేంద్రానికి చెందిన వెంకటలక్ష్మి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. సాధ్యాసాధ్యాల మేరకు స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నూగూరు(జి)లో చేపట్టిన డ్రోన్ సర్వేను పరిశీలించారు. సర్వే వివరాలను రెవెన్యూ అధికారులను ఆడిగి తెలుసు కున్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
అరవింద్‌కుమార్‌ను
కలిసిన కలెక్టర్ దివాకర
ములుగు రూరల్: జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను మంగళవారం కలెక్టర్ దివాకర మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. మాన్‌సూన్ అప్రమత్తత చర్యల నేపథ్యంలో జిల్లా పరిధిలో చేపడుతున్న విధానాలను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కోటకాల్వ పూడికతీత
పనులు చేపట్టాలి
గోవిందరావుపేట: లక్నవరం చెరువు పరిధిలోని కోటకాల్వ పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ఆదిరెడ్డి అన్నారు. తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కోట కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ కోటకాల్వ మొత్తం గడ్డి, చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. దీంతో రైతుల పొలాలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని వివరించారు. కోటకాల్వ కింద సుమారు 2500 ఎకరాలు కాస్తులో ఉందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కాల్వలోని పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే పూడికతీత పనులను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం జిల్లా నాయకులు సోమ మల్లారెడ్డి, పొదిల్ల చిట్టిబాబు, ఆదిరెడ్డి, ధర్మారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ ఆకస్మిక పర్యటన