
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
ఏటూరునాగారం: విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో కలిసి మంగళవారం సందర్శించారు. వంటశాల, భోజనం నాణ్యత, స్టోర్ రూము, కూరగాయల నిల్వలు, హాజరు పట్టికపై విద్యార్థులు రాసిన ఫీడ్ బ్యాక్, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రణాళికతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. ఉదయం చేసిన టిఫిన్ బాగుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో కలిసి వెళ్లి వైటీసీలో ఉన్న 25మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం పరికరాలను పరిశీలించారు. వాటి పనితీరును ఎన్‌డీఆర్‌ఎఫ్‌లు సీఎస్‌కు వివరించారు. ఆపదలో ఉన్న సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, మండల ప్రత్యేకాధికారి రాంపతి, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్

విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి