
న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి
వెంకటాపురం(కె): భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏటూరునగారం ఏపీవో వసంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ పొంది వీరయ్య మాట్లాడారు. ఆదివాసీల చైతన్యమే లక్ష్యంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ పనిచేస్తుందన్నారు. భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయటం వల్ల ఆదివాసీలకు న్యాయం చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తం
వెంకటాపురం(కె): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీపీఎంవో సత్యనారాయణ అన్నారు. మండల పరిఽధిలోని రామాంజపురం గ్రామంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహంచి మందులను పంపిణీ చేశారు. గ్రామంలో నలుగురు జ్వరపీడితులను గుర్తించి వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. గ్రామస్తులకు సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు కృష్ణకుమారి, లక్ష్మి, రాంబాబు, ఆశ వర్కర్లు రజిని, గంగా భవాని, బీర భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
సర్క్యులర్ జారీ చేయాలి
భూపాలపల్లి రూరల్: స్ట్రక్చర్ మీటింగ్‌లో జరిగిన ఒప్పందాలపై సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీచేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని కొమురయ్య భవన్‌లో సోమవారం సంఘం సమావేశం రాంచందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సంక్షేమం, ప్రయోజనాల కోసం ఏఐటీయూసీ నిరంతరం పాటుపడుతుందన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం బాగా పెరిగి పోయిందన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు శ్రీనివాస్, విజేందర్ పాల్గొన్నారు.

న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి