
మలయాళంలో ప్రముఖ ర్యాపర్ వేదన్ (Vedan)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యంగ్ వైద్యురాలి ఫిర్యాదు మేరకు తాజాగా కేసు నమోదుచేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2021 ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు వివిధ ప్రదేశాలలో తనను లైంగికంగా ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకు వేదన్ పరిచయం అయ్యాడని ఆమె చెప్పింది. త్రిక్కకర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో మాదకద్రవ్యాల కేసులో వేదన్ అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలయిన విషయం తెలిసిందే.

అతని అపార్ట్‌మెంట్‌లో గంజాయి, రూ.9 లక్షల నగదును గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై చిరుత దంతాలతో తయారైన గొలుసు కూడా అతని వద్ద ఉండటంతో అటవీ శాఖ అధికారుల నుంచి విచారణ ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఇన్ని కేసులు ఉండగా ఒక వైద్యురాలు అతని ట్రాప్లో ఎలా చిక్కుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2019లో “Voice of the Voiceless” అనే ఆల్బమ్‌తో కేరళలో బాగా ప్రాచుర్యం పొందాడు. సామాజిక అంశాలపై గళమెత్తిన వ్యక్తిగా గుర్తింపు పొందిన అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు.