‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యష్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి నాడియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ, గంగ పాత్ర చేస్తున్న నయనతార, హూమా ఖురేషి నటిస్తున్న ఎలిజిబెత్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ని విడుదల చేశారు. తాజాగా తారా సుతారియా చేస్తున్న రెబెకా పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ–‘‘తారా సుతారియా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’. ఆమె కెరీర్‌లో ఇదొక కొత్త అధ్యాయం. తను ప్రతి విషయాన్ని సునిశితంగా గమనించేది. రెబెకా పాత్రలో తను జీవించింది. తన నటన నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులనూ ఆశ్చర్యపరుస్తుందనటంలో సందేహం లేదు’’ అని చెప్పారు.


