వాళ్ళు అడిగేది ‘జీతాలు’ పెంచమని! ‘లాభాలు’ పంచమని కాదు! | Writer Ranganayakamma Opinion On Tollywood Workers Strike For Wages Hike, More Details Inside | Sakshi
Sakshi News home page

వాళ్ళు అడిగేది ‘జీతాలు’ పెంచమని! ‘లాభాలు’ పంచమని కాదు!

Aug 13 2025 11:07 AM | Updated on Aug 13 2025 12:59 PM

Writer Ranganayakamma Opinion On Tollywood Workers Strike

ఒక వారం రోజులుగా, తెలుగు సినిమారంగంలో పనిచేస్తున్న కార్మికులు ‘మా జీతాలు 30 శాతం పెంచాలి’! అనే డిమాండుతో సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్న వేలాదిమంది కార్మికులలో, వేరు వేరు శాఖల్లో, రకరకాల శ్రమలు చేసే వాళ్ళున్నారు. మేధా శ్రమలు చేసేవారూ, శారీరక శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే నైపుణ్యంగల శ్రమలు చేసేవారూ, నైపుణ్యం లేని శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే మురికిని శుభ్రం చేసే శ్రమలు చేసే వారూ... ఇలా! రకరకాల శ్రమలు చేసే వారిని ఏ పేర్లతో పిలుస్తారో, వాళ్ళకి జీతాలు ఎంత తేడాగా ఉంటాయో– అటువంటి వివరాలన్నీ ఇక్కడ అనవసరం. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవలసింది, సమ్మె చేస్తున్న కార్మికులు అడుగుతున్న ‘జీతాల పెంపు’ గురించి! జీతాలు పెంచాలి– అనేవాళ్ళ డిమాండ్‌ న్యాయమా, కాదా అన్నది తేలాలంటే, ‘జీతం’అంటే ఏమిటో తెలుసుకోవాలి.

అసలు ‘జీతం’అనేది ఒక మాయ తెర! దాని వెనక ఒక రహస్యం వుంది. ఈ సంగతి సమ్మె చేస్తున్న కార్మికులకూ తెలియదు, వాళ్ళకి జీతాలు ఇచ్చే యజమానులకూ తెలియదు. ‘జీతం’ అనేది, కార్మికులు చేసే ‘శ్రమ మొత్తానికి’ కాక, వాళ్ళు కేవలం శ్రమ చేసేవారిగా జీవించడానికి సరిపడేది మాత్రమే– అనేదే ఆ రహస్యం! అసలు విషయం, ‘జీతంగా వచ్చేది ఏమిటీ’ అన్నది తెలియాలి! విషయాలు తేలిగ్గా అర్థం కావడానికి ఒక్క కార్మికుణ్ణే తీసుకుందాం.

మన ఉదాహరణలో, ‘కాల్షీట్‌’ అనే పేరుతో నడిచే ‘పనిదినం’ లో, కార్మికుడు 12 గంటలు పని చేసినందుకు, నిర్మాత 1,200 జీతం ఇస్తాడనుకుందాం. కానీ, కార్మికుడు చేసే శ్రమ, యజమానికి ఎంత విలువని ఇస్తుందంటే, ఉదాహరణ తేలిగ్గా వుండడం కోసం 2,400 విలువని ఇస్తుంది. అంటే, కార్మికుడు ఏ రోజు పనిచేసినా ఆ రోజున, యజమానికి 1,200 విలువ గల శ్రమని ‘ఉచితంగా’ ఇస్తున్నాడన్నమాట! జీతాన్ని 30 శాతంగా పెంచినా, అది మొత్తం శ్రమ విలువ అవదు! అదీ తక్కువే! అప్పుడు కూడా, తీసుకునే జీతం కన్నా అదనంగా ఇచ్చే శ్రమ విలువే ‘అదనపు విలువ’. ఇది ‘శ్రమ దోపిడీ’! కానీ, ఈ విషయం, ఇటు కార్మికులకూ తెలియదు; అటు యజమానులకూ తెలియదు! 

ఇప్పుడు వచ్చిన సమస్య కార్మికుడు యజమానితో అనేది: ‘ఒక రోజుకి నువ్విచ్చే 1,200, మా కుటుంబ పోషణకి చాలడం లేదు. ఇంకో 30 శాతం పెంచు! ఇక నించీ 1,200 కాకుండా, 1,360 ఇవ్వు!’ అని కార్మికుడు అనడం. ‘అలా వీల్లేదు. నాకు అసలే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. (హీరో గారికి కోట్లలో ఇవ్వాలి మరి!)’ అంటాడు నిర్మాత! నిజం చెప్పాలంటే, నిర్మాత కార్మికుడికి జీతం 30 శాతం పెంచి, 1,360 ఇచ్చినా, ఆ కార్మికుడి నించీ 70 శాతం విలువ గల శ్రమని ‘ఉచితంగానే’ లాగుతాడు! ఉచితంగా లాగే ఈ అదనపు విలువను, పెట్టుబడిదారీ యజమానులూ, వారి ఆర్థిక శాస్త్రవేత్తలూ ‘లాభం’ అని ముద్దుగా పిల్చుకుంటారు. కార్మికులు ఇచ్చే అదనపు విలువ నించే, సినిమా తీయడానికి ఖర్చు పెట్టిన డబ్బుకి వడ్డీ, షూటింగు చేసే స్టూడియోకి అద్దే, సినిమాని ప్రదర్శించే సినిమా హాళ్ళకి అద్దే, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులూ, చివరికి తనకి మిగిలే ‘లాభమూ’– అన్నీ... కార్మికుల అదనపు విలువనించీ వచ్చేవే!

ఈ సమ్మె సందర్భంగా కొందరు మధ్యవర్తులు, ‘నిర్మాత కూడా బాగుండాలి గదా? అతన్ని ఇబ్బంది పెడితే ఎలా? నిర్మాతలుంటేనే గదా, కార్మికులకి పనులు దొరికేది?’ అంటూ, కార్మికులకు సర్ది చెపుతూ, జీతం మరీ అంతగా పెంచమని ఒత్తిడి చెయ్యవద్దని హితవు పలుకుతున్నారు. మన అమాయక సమ్మెకారులు కూడా, 

‘అవును! నిర్మాతలు బాగుంటేనే కదా, మాకు పనులు దొరికేది. కాకపోతే, మా బాగు కూడా కొంచెం ఆలోచించమంటున్నాం’ అని అంటారు. అసలు ఆలోచించవలసింది – నిర్మాతలకి పెట్టుబడికి, ఆ మొదటి డబ్బు ఎక్కడిది?– అని! వాళ్ళ తండ్రులదీ, తాతలదీ అంటారా? ఆ తాతలకి అంత డబ్బు కూడటానికి కారణం – ఈనాటి కార్మికుల తాతల్నించీ ఆనాడు లాగిన అదనపు విలువే! (‘‘అదనపు విలువలో ఒక భాగాన్ని ఆదాయంగా పెట్టుబడిదారుడే తన కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటాడు. ఇంకో భాగాన్ని కొత్త పెట్టుబడిగా ఉపయోగించుకుంటాడు’’ అనే విషయాన్ని, మార్క్స్‌ తన ‘పెట్టుబడి’ అనే పరిశోధనా గ్రంథంలో – రుజువు చేశాడు.) 

ఇంతకీ, సమ్మె చేస్తున్న, సినిమా రంగంలోని, మన పిచ్చి కార్మికులు ఏ మడుగుతున్నారు? వాళ్ళు అడిగేది జీతాలు పెంచమని! లాభాలు పంచమని కాదు! ఎంత అల్ప సంతోషులు మన కార్మిక జనాలు!


వ్యాసకర్త: ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement