విసుగెత్తిస్తున్న 'వాయిదాలు'.. దీనికి పరిష్కారం లేదా? | Why Telugu Movies Postponed In Recenet Times | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ వాయిదా.. ఆడియెన్స్ సహనానికి పరీక్ష

May 1 2026 2:31 PM | Updated on May 1 2026 2:39 PM

Why Telugu Movies Postponed In Recenet Times

ఏదైనా పని ఫలానా సమయానికల్లా పూర్తి చేస్తానని చెప్పి.. చేయకపోతే ఎలా ఉంటుంది? కచ్చితంగా కోపం వస్తుంది. ఒకవేళ ఇలా రెండు మూడుసార్లు జరిగితే నిజంగా పని పూర్తయినా సరే చేయలేదేమో అనే అనుమానం కలుగుతుంది. అలానే పని ఫెర్ఫెక్ట్‌గా చేసినా ఇంప్రెసివ్‌గా అనిపించకపోవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తెలుగులో కొన్ని సినిమాల పరిస్థితి ఇలానే తయారైంది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రేక్షకులకే చిరాకు తెప్పిస్తున్నారు. దీనికి కారణమేంటి? పరిష్కారం లేదా?

(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అంటే ప్రతిఒక్కరూ కమిట్‌మెంట్‌లా ఫీలయ్యేవారు. ఒకవేళ చెప్పిన తేదీకి రిలీజ్ చేయకపోతే నెగిటివ్ సెంటిమెంట్‌లా భావించేవారు. కానీ ఇప్పుడు వాయిదాలు అనేవి చాలా సాధారణం అయిపోయాయి. టెక్నికల్ అంశాల వల్ల ఇలా చేస్తున్నామని దాదాపు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కరోనా టైంలో షూటింగ్స్ సరిగా నడవక ఈ వాయిదాల పర్వం మొదలైంది. తర్వాత కరోనా వెళ్లిపోయింది గానీ వాయిదాలు మాత్రం అలానే ఉండిపోయాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ సరైన్ ప్లానింగ్ లేకపోవడంతో షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం తదితర అంశాలు విడుదల తేదీలని పదేపదే మార్చేందుకు కారణమవుతున్నాయి. కొన్ని సినిమాలైతే అంతా సిద్ధమైపోయినా సరే ఎందుకో వాయిదా వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

గతం గురించి అక్కర్లేదు. టాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితి ఓసారి చూసుకుంటే.. రామ్ చరణ్ 'పెద్ది'ని తొలుత మార్చి 27న రిలీజ్ చేస్తామని అన్నారు. ఆపై ఏప్రిల్ 30 అన్నారు. ఇప్పుడేమో జూన్‌లో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రాన్ని తొలుత మే 01న రిలీజ్ అని ప్రకటించారు. 'పెద్ది' కారణంగా జూన్ 26కి వాయిదా వేశారు. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీని లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం వెల్లడించారు. తీరా చూస్తే ఏకంగా ఏడాది వాయిదా వేసి వచ్చే జూన్ అని పోస్టర్ వదిలారు. కన్నడ డబ్బింగ్ చిత్రం 'టాక్సిక్' అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

సరే పైన చెప్పినవన్నీ స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ షెడ్యూల్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల ఆలస్యమైందిలే అనుకోవచ్చు. కానీ సమంత లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'ని మే 15 నుంచి జూన్ 4కి మార్చారని టాక్ వినిపిస్తోంది. నిఖిల్ చేసిన పీరియాడిక్ మూవీ 'స్వయంభు' అయితే ఫిబ్రవరి నుంచి అప్పుడు ఇప్పుడు అని చెబుతున్నారు గానీ రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నారు. నాని 'ప్యారడైజ్' అయితే తొలుత మార్చి అన్నారు. తర్వాత ఆగస్టు అన్నారు. ఇప్పుడసలు ఈ ఏడాది రాకపోవచ్చని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అయితే అనుకున్న బడ్జెట్ దాటేసిందని, షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిందని అంటున్నారు. ఎప్పుడో విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: సత్య 'జెట్‌లీ' సినిమా రివ్యూ)

ఇలా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పోతే సదరు సినిమాలపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిపోతుంది. థియేటర్‌కి వెళ్లి చూసిన తర్వాత నచ్చితే పర్లేదు. ఒకవేళ అలా కాకపోతే మాత్రం ఇంతోటి దానికి ఇన్ని వాయిదాలు వేశారా అని ముఖం మీదే అనేస్తారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇది కేవలం ఆ ఒక్క సినిమాపైనే ప్రభావం చూపడం కాదు. మొత్తం టాలీవుడ్ వ్యవస్థ నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అదే జరిగితే తెలుగు ప్రేక్షకుడు ఇంకా థియేటర్‌కి దూరమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.

మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉండొచ్చు. స్టార్ హీరోల చిత్రాల్ని ప్రకటించేటప్పుడు ఆర్భాటంగా డేట్స్ కూడా ప్రకటించేయకుండా ఔట్‌పుట్ రెడీ అయిన దానిబట్టి విడుదల తేదీపై క్లారిటీ ఇస్తే బెటర్. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement