ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా ఆకట్టుకున్న సత్య.. హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'జెట్‌లీ'. వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దీనికి దర్శకుడు. ప్రమోషనల్ కంటెంట్‌తో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? కమెడియన్ సత్య.. హీరోగా హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. ఆ ఇద్దరు కూడా)
కథేంటి?
ప్రజాపతి(అజయ్) బ్యాంక్ స్కామ్ చేసి రూ.15,000 కోట్లతో దుబాయికి పారిపోతాడు. అతన్ని చంపడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ప్రాణాలని కాపాడకునేందుకు తనే లొంగిపోతాడు. ఏజెంట్ శివాని (రియా సింఘా) తన టీంతో కలిసి ప్రజాపతిని విమానంలో ఇండియాకు తీసుకురావడానికి బయలుదేరుతారు. అదే విమానాన్ని తన మనుషులతో హైజాక్ చేయించి పారిపోవాలని ప్రజాప్రతి ప్లాన్ వేస్తాడు. మరి ఇది సక్సెస్ అయ్యిందా? అదే విమానంలో ఉన్న వేదవ్యాస్(సత్య)ఎవరు? అంధ వైద్యుడిగా ఎందుకు నటించాడు? ప్రజాపతిని చంపడానికి ప్రయత్నించేది ఎవరు? హోం మంత్రి మేల్కోటే (సాయి శ్రీనివాస్)కి బ్యాంక్ స్కాంతో ఉన్న సంబంధమేంటి? హరిచంద్ర (శుభలేఖ సుధాకర్), వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?
ఇన్నాళ్లు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన సత్య.. హీరోగా సినిమా చేస్తున్నాడని ప్రకటించిన రోజు నుంచే 'జైట్లీ'పై అంచనాలు ఏర్పడ్డాయి. సత్య హీరో కాబట్టి హాయిగా రెండున్నర గంటలపాటు నవ్వుకోవచ్చు అని థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. కామెడీ ఏమో గానీ కనీసం చెప్పుకోవడానికి కథ కూడా లేని మూవీ ఇది. బ్యాంకు స్కామ్ మర్డర్‌తో కథని ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు.. కాసేపటికి అర్థంపర్థం లేని డైలాగులు సాగదీత సన్నివేశాలతో నీరసం తెప్పించాడు. కథ మొత్తం విమానంలోనే జరుగుతుంది.
ఫస్టాప్ అంతా ప్రజాపతి పాత్ర గురించి చూపించి తను దుబాయి నుంచి ఇండియాకి తిరిగి రావడం, ఫ్లైట్‌లో ఉండడం, ఫ్లైట్‌లో ఉన్న జనాలు, వాళ్ల పాత్రల గురించి చూపిస్తారు. సత్య తనని తాను మర్చిపోయినట్టు, తనపై దాడి జరిగినట్టు, అతను ఎవరో గుర్తుతెచ్చుకునే ప్రాసెస్ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా అక్కడక్కడ కామెడీ డైలాగ్స్‌తో, స్పూఫ్ సీన్ తో సాగుతుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఈ బ్యాంక్ స్కామ్ ఏంటి? సత్య అసలు ఎలా వచ్చాడు? సత్య ఎవరు? వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి? అని కథతో పాటు అక్కడక్కడ కామెడీ నడిపించారు. సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకులు భావించేలా ఉండడం మైనస్ పాయింట్. ఫస్టాఫ్ కొంతవరకు నవ్విస్తుంది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకోదు. కావాలని రాసుకున్న కొన్ని ట్విస్టులు పేలకపోగా, ఎబ్బెట్టుగా అనిపించాయి.

ఎవరెలా చేశారు?
లీడ్ రోల్ చేసిన సత్య.. తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్ కూడా కనిపించిన ప్రతిసారి నవ్వించాడు. హీరోయిన్ రియా సింఘా, అజయ్ కూడా పర్లేదనిపించారు. కాకపోతే స్టోరీలో సరైన కంటెంట్ లేకపోవడంతో పని జరగలేదు. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. ఉన్న రెండు పాటలు ఏమంత ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ కూడా వర్కౌట్ కాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి విమానంలో వాతావారణాన్ని బాగా సృష్టించారు. అవి రియలస్టిక్‌గా అనిపించాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'జెట్‌లీ'.. వర్కౌట్ కాలేదు!
(ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


