‘కర’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Kara Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Kara Review: ధనుష్‌ ‘కర’ మూవీ ఎలా ఉందంటే..?

Apr 30 2026 3:21 PM | Updated on Apr 30 2026 4:19 PM

Kara Movie Review And Rating In Telugu

తమిళ హీరో ధనుష్‌కి టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే నేరుగా తెలుగులో సార్‌, కుబేర లాంటి సినిమాలు చేసి అలరించాడు. అంతేకాదు ఆయన నటించిన తమిళ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్‌ అవుతుంటాయి. ఆ మధ్య ఇండ్లీ కొట్టుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మల్టీ టాలెంటెడ్‌ నటుడు..ఇప్పుడు ‘కర’తో వచ్చాడు. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్  ఈ చిత్రాన్ని తెలుగు రిలీజ్‌ చేశాయి. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్‌  కర(ధనుష్‌) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర  డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని  స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్‌మెంట్‌కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్‌(సూరజ్‌ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్‌ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్‌లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్‌ పెట్టుకోవాలనుకుంటారు.

 లోన్‌ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్‌ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి  చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ  భరతన్‌ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్‌(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
తండ్రి-కొడుకుల ఎమోషన్‌తో కూడిన రాబిన్‌వుడ్‌ కథ ఇది. అంటే హీరో దొంగ..కానీ మంచి కోసం దొంగతనం చేస్తుంటాడు. కిక్‌ సినిమాలో రవితేజ కోటీశ్వర్లు, రాజకీయ నాయకుల దగ్గర డబ్బులను కొట్టేస్తే..  ఇక్కడ ధనుష్‌ బ్యాంకుల్లోని డబ్బును మాత్రమే కొట్టేస్తాడు. అది కూడా ఒక్క బ్యాంకులోని డబ్బులు మాత్రమే. దానికీ ఓ కారణం ఉంటుంది. అదేంటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. 

దర్శకుడు విఘ్నేష్ రాజా ఎంచుకున్న పాయింట్‌ రాబిన్‌వుడ్‌ కథలను గుర్తు చేసినా.. దాని చుట్టు అల్లుకున్న భావోద్వేగ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. అంతేకాదు బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా చదువురాని రైతులను వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనేది బాగా చూపించారు. 

హీరో ఎమ్మెల్యే ఇంట్లో చివరి దొంగతనం చేసే యాక్షన్‌ సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది.  అతను పోలీసులకు దొరకడం.. డీఎస్పీ భరతన్‌ నుంచి తప్పించుకొని పారిపోవడం.. ఇదంతా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే  కథ 6 నెలల ముందుకు జరిగిన తర్వాత కొంత నెమ్మదిగా సాగుతుంది. హీరోహీరోయిన్లు కలిసి హోటల్‌ పెట్టాలనుకోవడం.. ఈ క్రమంలో హీరో సొంతూరుకి తిరిగిరావడం.. తండ్రి-కొడుకుల బాండింగ్‌..ఇదంతా కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంక్ చోరీ ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ద్వితియార్థం ఆసక్తికరంగా సాగుతుంది. వరుస బ్యాంకు రాబరీలు..  డీఎస్పీ ఇన్వెస్టిగేషన్‌..మరోవైపు బ్యాంకు మేనేజర్‌ ఇచ్చే ట్విస్టు..ఇవన్నీ  ఉత్కంఠభరితంగా సాగుతాయి.  హీరో దొంగతనం కోసం బ్యాంకుకు వెళ్లిన ప్రతిసారి..ఎలా బయటపడతాడా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఎక్కడ బోర్‌ కొట్టకుండా బలమైన స్క్రీన్‌ప్లేతో సెకండాఫ్‌ కథను రాసుకున్నారు. రైతు కష్టాలతో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్‌తో కథను ముగించిన తీరు బాగుంది. 

ఎవరెలా చేశారంటే..
ధనుష్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. తనదైన సహజ నటనతో కరస్వామి పాత్రకు ఆయన వందశాతం న్యాయం చేశాడు.  ఒక్కమాటలో చెప్పాలంటే.. ధనుష్‌ వన్‌ మ్యాన్‌ షో ఇది.  మమిత బైజు తెరపై కనిపించేంది కాసేపే అయినా.. చక్కగా నటించింది. హీరో తండ్రి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. డీఎస్పీ భరతన్‌గా సూరజ్ వెంజర్మూడు, బ్యాంకు మేనేజర్‌గా జయరాంతో పాటు , కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. 

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలతో పాటు తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. తేని ఈశ్వర్  సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్‌ బాగా కుదిరింది. తెరపై తెలుగు సినిమానే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.  ఎడిటింగ్‌ పర్వాలేదు. ఇషారి కె గణేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement