
ప్రస్తుతం అన్ని భాషల్లోని సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణమయ్యాయి. ముఖ్యంగా లిప్‌కిస్ సీన్స్ అయితే దాదాపుగా సగం సినిమాల్లో అంతకన్నా ఎక్కువగా వెబ్‌సిరీస్‌లలో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మన భారతీయ సంప్రదాయ జీవనశైలి దృష్ట్యా ఇప్పటికీ ఆ తరహా దృశ్యాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునో లేక వ్యక్తిగతంగా అసౌకర్యంగా అనిపించో పలువురు సినీ తారలు తాము అలాంటి దృశ్యాలు, ముఖ్యంగా లిప్ కిస్ సన్నివేశాల్లో నటించమనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా దక్షిణాది నటుడు విశాల్ కూడా చేరారు. ఇటీవలే తన పెళ్లి నిశ్చితార్ధం చేసుకున్న ఈ హీరో ఇకపై తెర ముద్దులకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.
అలా ఆన్ స్క్రీన్ కిస్‌లకు దూరంగా ఉండే నటుల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయన ఎప్పటినుంచో లిప్‌కిస్ సీన్ల కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటువంటి సన్నివేశాలు తనకు అసౌకర్యకరం అనిపిస్తాయనీ, తన అభిమానులు కూడా కుటుంబంతో కలిసి చూడలేరని అంటున్నాడు.
అదే విధంగా తొలినాళ్ల నుంచీ షారూఖ్ ఖాన్ కూడా అదే బాటలో ఉన్నాడు. అయితే జబ్ తక్ హై జాన్ , జీరో సినిమాల్లో మాత్రం దర్శక నిర్మాతల కోరిక మేరకు తప్పనిసరై చేయాల్సి వచ్చిందని చెప్పాడు.
ఇక మళయాళ స్టార్ ఉన్నీ ముఖుందన్ కూడా ఆన్ స్క్రీన్ కిస్సింగ్‌కు విముఖమే. ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం వల్ల అలాంటి స్క్రిప్ట్స్ ఆయన దగ్గరకు రావు. ప్రేమ ప్రదర్శనకు కిస్ తప్పనిసరి కాదంటున్న ఆయన; కుటుంబ ప్రేక్షకులందరు చూడగలిగే చిత్రాలు మాత్రమే చేస్తానంటున్నాడు. అయితే మార్కో పేరుతో ఈ హీరో భయంకరమైన హింసను చూపించడంతో కుటుంబ సమేతంగా వచ్చిన వారు ధియేటర్లు వదిలి వెళ్లిపోవడం గమనార్హం.
నటి జెనీలియాలాగే ఆమె భర్త నటుడైన రితేశ్ దేశ్‌ముఖ్ సైతం ముద్దంటే చేదే అంటున్నాడు. మన హీరోల్లో శర్వానంద్‌ది కూడా ఇదే పంథా అయితే మహా సముద్రం వంటి ఒకటి రెండు సినిమాల్లో మాత్రం కొంచెం పక్కకి జరిగినట్టు కనిపిస్తుంది.
తెలుగులో అల్లు అర్జున్, మహేష్ బాబులతో లిప్ టు లిప్ టచ్ చేసిన కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి అనంతరం పెదాలపై ముద్దులకు నో అని చెప్పేసింది. అలాగే మహానటి సినిమా ద్వారా సాధించిన క్లీన్ ఇమేజ్‌ను కాపాడుకుంటూ కీర్తి సురేష్ కూడా వాటికి దూరంగానే ఉంటోంది. ఒక తెలుగు చిత్రంలో కధ ప్రకారం లిప్–కిస్ సన్నివేశం ఉందని చెప్పడంతో ఆమె ఆ సినిమా అవకాశాన్ని కాదనుకుంది.
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా నో కిస్సింగ్ ప్లీజ్ అంటున్నారు. దాదాపు 18ఏళ్ల పాటు లిప్ కిస్‌లకు, మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉన్న తమన్నా ఇప్పుడు ఆ రెండింటికీ సై అంటున్నారు. దక్షిణాది హీరో హీరోయిన్లు ఇంకా ఈ ముద్దు సీన్ల విషయంలో ముదిరిపోయినట్టు కనిపించడం లేదు గానీ బాలీవుడ్ మాత్రం ఓ రేంజ్‌లో ముదిరిపోయింది.
ఈ సందర్భంగా ఈ కిస్సింగ్ సీన్లకు సంబంధించి హీరో హీరోయిన్లు అందరూ ఒకెత్తయితే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఒక్కడే ఒకెత్తుగా చెప్పాలి. సినిమాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచీ తెరపై ముద్దుల పంట పండిస్తున్న ఈయన సీరియల్ కిస్సర్ కిరీటం అందుకున్న ఏకైక భారతీయ నటుడిగా నిలిచాడు. ముద్దులు పెట్టి పెట్టి ముఖం మొత్తిందో లేక కొత్తగా వచ్చిన భార్య తిట్టిందో గానీ ఈ హీరో ఇక లిప్ కిస్‌లకు నో అంటూ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది.
ఓ ఏడేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత కాలం క్రితం వరకూ కఠినంగానే అమలు చేసిన ఇమ్రాన్ ఆ తర్వాత తన నిర్ణయానికి కొన్ని సవరణలు చేశాడు. ‘‘కండలు చూపించని సల్మాన్‌ను ముద్దులు కురిపించని ఇమ్రాన్‌ను ప్రేక్షకులు జీర్ణించుకోలేరు’’ అంటూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆయన... తన భార్య కోరిక మేరకు ఎడా పెడా ఆ సీన్లు చేయనని. తప్పనిసరైతేనే ఓకే అంటానంటున్నాడు.