
‘‘మన్నాత్’’ అనగా మనసా వాచా కోరుకున్నవన్నీ నిత్యం జరుగుతాయని వ్యక్తం చేసే ఆకాంక్ష. ‘‘జన్నత్’’ అనగా స్వర్గం అదే క్రమంలో వస్తుంది మన్నాత్ కూడా. ఇంతకీ ఈ మన్నాత్ అనే పదం మన దేశంలో ఇంత పాప్యులర్ కావడానికి కారణం ఏమిటో తెలుసా? అది బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇంటిపేరు కావడమే. ఇంటిపేరు అంటే మనం అనుకునేది కాదండోయ్.. సాధారణంగా ఇంటి పేరు అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? వంశపారం పర్యంగా మన పేరు కు ముందు వస్తున్న ఇనీషియల్ కదా. వాడుకలో ఎందుకని అలా మారిందో గానీ నిజానికి అది వంశం పేరు. చాలా మంది తమ నివాస భవనాలకు పెట్టుకునే పేర్లను కూడా ఇంటి పేరు అనే పేర్కొంటారు. తాము స్వంతం చేసుకున్న ఇంటికి పేర్లు పెట్టడం అనేది సాధారణ పౌరులతో పాటు సెలబ్రిటీలకు కూడా సాధారణమే.

గత 2001లో షారుఖ్ ఖాన్ ఒక ‘విల్లా వియెన్నా’ని కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా సెలబ్రిటీల ఇళ్లలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్నది మన్నాత్. అత్యంత ఖరీదైన సెలబ్రిటీ బంగ్లా అనే స్టేటస్ నుంచి మొదలై ఈ ఇంటి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది.

ఈ నేపధ్యంలో మరికొందరు తారలు పెట్టుకున్న ఇళ్ల పేర్లు పరిశీలిస్తే...బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి పేరు కూడా ఆయన లాగే బాగా పాప్యులర్. ఆయన ఇంటి పేరు ‘జల్సా’’‘‘జల్సా’’ అంటే ఆనందం సంబురాలకు ప్రసిద్ధి అనేది మనకు తెలిసిందే. జూహూలో ఉన్న ఈ బంగ్లా, బచ్చన్ అభిమానులకు నిత్య సందర్శనీయ ప్రదేశంగా మారింది.

అదే విధంగా మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఆయన భార్య సీనియర్ నటి కాజోల్ లు నివసించే ఇంటి పేరు భక్తి భావనలకు చిరునామాగా ఉంటుంది. వీరి ఇంటి పేరు‘శివ శక్తి’’ ఈ పేరులో శివుడి శక్తి తో పాటు దైవ భక్తి కూడా ప్రతిఫలిస్తుంది. అదే విధంగా రాజకీయ నేత, సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా నివసించే భవనం పేరు రామాయణ్.. తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా కలసి వచ్చేలా ఆయన ఇంటికి పేరు పెట్టారు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన 27 అంతస్థుల సౌధానికి అంటిల్లా అని నామకరణం చేశారు. బోలెడన్ని విలాసాలు, రహస్య సంపదలు ఉన్న 15వ శతాబ్ధపు ద్వీపం పేరట ఇది.

అలాగే బాలీవుడ్ యువ జంట రణబీర్ కపూర్ అలియాభట్‌లు తాజాగా అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. దీనికి కృష్ణరాజ్ బంగ్లా అంటూ పేరు పెట్టారు. తన నానమ్మ కృష్ణ కపూర్ తాతయ్య రాజ్ కపూర్ ల పేర్లు కలిసి వచ్చేలా అలా నామకరణం చేశారు.

ఇక మన టాలీవుడ్ స్టార్స్ సైతం తమ తమ ఇళ్లకు పేర్లు తమ అభిరుచులకు అనుగుణంగా పెడుతున్నారు అయితే ప్రస్తుతానికి అవి మరీ బాలీవుడ్ స్థాయిలో పాప్యులర్ కాకపోయినా, అన్ని విషయాల్లోనూ బాలీవుడ్‌ని అధిగమిస్తున్న మన టాలీవుడ్ స్టార్స్ ఇంటి పేరు పాప్యులారిటీలోనూ పోటీ పడతారేమో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి బ్లెస్సింగ్ అనే పదం ఉంటుంది. అలాగే ఇంటి లోపల ఉన్న విశాలమైన ఉద్యానవనం కు అల్లు గార్డెన్స్ అని పేరు పెట్టారు.
జూబ్లీహిల్స్‌లోని తన భవనానికి సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా పద్ధతిగా చాలా మంది తెలుగువారి ఇళ్లకు ఉండే పేరును తలపించేలా శ్రీ లక్ష్మీ నిలయం అనే పేరు పెట్టారు.
ఇక టాలీవుడ్ రౌడీ...విజయ్ దేవరకొండ మాత్రం ఇంటి పేరునీ తన వంశం పేరునీ ఒకటి చేసేశారు. ఆయన ఇంటికి దేవరకొండ హౌస్ అని పేరు పెట్టడం ద్వారా.