
సగటు మనిషికి చేతి గడియారం అంటే సమయాన్ని తెలుసుకునే ఒక అవసరమైన వస్తువు మాత్రమే కావచ్చు. కానీ సెలబ్రిటీలకు, ఇది ఒక స్టైల్ స్టేట్‌మెంట్, పెట్టుబడి, స్టేటస్ సింబల్... అంతేకాదు అన్నింటికీ మించి ఒక కళా ఖండం కూడా. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్లు వ్యాపార దిగ్గజాల వరకు, భారతదేశంలోని అత్యంత ప్రముఖు వ్యక్తులలో కొందరు లగ్జరీ కార్లు లేదా బహుళ అంతస్తుల భవనాల కంటే ఎక్కువ ఖరీదు పెట్టి కేవలం చేతి గడియారాలను కలిగి ఉన్నారంటే.. అర్ధమవుతుంది విలాసం అనేది ఏ స్థాయిలో పెరిగిందో...ఒక్కసారి ఖరీదైన చేతివాచీలు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితా చూద్దామా...

అత్యంత ఖరీదైన వాచీ ఎవరిదంటే...
నెం1 సినిమా తారల్ని సైతం ఇంటి ముంగిట డ్యాన్స్ చేయించేంత డబ్బు, పలుకుబడి ఉన్న భారతదేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వాచీ అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సంక్లిష్టమైన గడియారాలలో ఒకటైన పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ స్కై మూన్ టూర్‌బిల్లాన్ ను అనంత్ అంబానీ కలిగి ఉన్నాడు. ఆ చేతి వాచీ విలువఏకంగా రూ. 70.48 కోట్లు , ఇది డబుల్ డయల్స్ తో ఖగోళ విధులను సైతం అందిస్తుంది, ఇది చేతివాచీల తయారీ శాస్త్రమైన హోరాలజీలో ఒక గొప్ప కళాఖండంగా ఖ్యాతి పొందింది.

కండల వీరుడూ...కాస్ట్‌లీ వాచ్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం రూ. 64.43 కోట్లు విలువైన పటేక్ ఫిలిప్ అక్వానాట్ హౌట్ జోయిలెరీ రెయిన్ బో జెమ్‌స్టోన్స్, డైమండ్స్ వాచ్‌ను ధరిస్తాడు. విలువైన రాళ్లతో కూడిన అద్భుతమైన ఇంద్రధనస్సుతో, ఈ చేతివాచీ అతని ఆడంబరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

పాండ్యా... వాచ్ ఇట్...
ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పిచ్ మీద బ్యాట్‌తో తన ఆటతీరుకు మాత్రమే కాదు బయట తన విలాసవంతమైన జీవనశైలికి కూడా అంతే ప్రసిద్ధి చెందాడు. అతని పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ బ్లూ డైమండ్ బాగెట్స్ చేతి వాచీ దర ఏకంగా రూ. 43.83 కోట్లు వజ్రాల ధగధగలతో ఇది మైదానంలో అతని బ్యాటింగ్ మెరుపుల్ని తలపిస్తుంది.
రిచ్ దా...బాద్‌షా...
భారతదేశపు ర్యాప్ స్టార్ బాద్షా ‘‘రిచర్డ్ మిల్లె ఆర్‌ఎమ్‌ఫైవ్3–01 టూర్‌బిల్లాన్ పాబ్లో మాక్ డోనఫ్’’ లిమిటెడ్ ఎడిషన్ ను కలిగి ఉన్నాడు. ఇది అడ్వాన్స్‌డ్ డిజైన్స్ తో ఈ రూ. 24.85 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ వాచ్ అతని సంగీతం లాగే మహా బోల్డ్‌గా ఉంటుంది.

యంగ్ టైగర్...వాచ్ కా షేర్...
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ‘‘రిచర్డ్ మిల్లె ఆర్‌ఎమ్ 40–01 మెక్‌లారెన్ స్పీడ్‌టైల్ ఆటోమేటిక్ టూర్‌బిల్లాన్ ’’ను కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 8.93 కోట్లు. రేసింగ్–ప్రేరేపిత డిజైన్ కలిగిన ఈ వాచీ ఆయన పవర్ ప్యాక్డ్, శక్తివంతమైన పెర్మార్మెన్స్‌కు సరిగ్గా నప్పుతుంది.
→ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ పెర్పెచువల్ క్యాలెండర్ క్రోనోగ్రాఫ్ క్లాసిక్ వాచీని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ధరిస్తాడు. ఆయన దీని కోసం రూ. 6.48 కోట్లు ఖర్చు చేశాడు
→ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ రంగురంగుల రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ కాస్మోగ్రాఫ్ డేటోనా రెయిన్ బో వాచీని వినియోగిస్తాడు. దీని ధర రూ. 4.36 కోట్లు ఇది రోలెక్స్ అత్యంత అద్భుతమైన పీస్‌లలో ఒకటి.
→ మరో ప్రముఖ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ: రిచర్డ్ మిల్లె ఆర్‌ఎమ్65–01 వాచీని వాడతాడు. దీని ధర రూ. 4.36 కోట్లు.
→ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవెరోస్ వాచ్ ఖరీదు రూ. 4.25 కోట్లు.
→ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్: జాకబ్ – కో. ఆస్ట్రోనోమియా సోలార్ కాన్సెటలేషన్స్ వాచీని వినియోగిస్తున్నాడు. దీని ధర రూ. 3.05 కోట్లు.
→ గాయకుడు, నటుడు యో యో హనీ సింగ్ రిచర్డ్ మిల్లె ఆర్‌ఎమ్ 011 ఫెలిపే మాస్సా వాచీతో కనిపిస్తాడు. ఈ వాచీ ఖరీదు రూ. 2.18 కోట్లు.
→ అంబానీల కుటుంబానికి చెందిన ఆకాష్ అంబానీ రిచర్డ్ మిల్లె ఆర్‌ఎమ్67–02 బ్రాండ్‌ని ధరిస్తాడు. ఈ వాచీ విలువ రూ. 2.51 కోట్లు.