లెక్క తగ్గేదే లే! నవంబరులోనూ సినిమాల సందడి | Upcoming Telugu Movies Updates in November 2025 | Sakshi
Sakshi News home page

లెక్క తగ్గేదే లే! నవంబరులోనూ సినిమాల సందడి

Oct 26 2025 3:59 AM | Updated on Oct 26 2025 3:59 AM

Upcoming Telugu Movies Updates in November 2025

అక్టోబరు నెలలో చిన్నా పెద్దా కలుపుకుని దాదాపు డజను సినిమాలకు పైగానే విడుదలయ్యాయి. ఫైనల్లీ ‘మాస్‌ జాతర, ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమాల విడుదల (అక్టోబరు 31)తో ఈ నెల ముగుస్తుంది. ఆ తర్వాత మొదలయ్యే నవంబరులోనూ ‘లెక్క తగ్గేదే లే’ అంటూ... సినిమాల సందడి జోరుగా ఉండబోతోంది. ‘జటాధర, కాంత, ఆంధ్ర కింగ్‌ తాలూకా, ది గర్ల్‌ ఫ్రెండ్‌’ వంటి పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా పలు బాలీవుడ్, హాలీవుడ్‌ మూవీస్‌ కూడా ఆడియన్స్‌ ముందుకు రానున్నాయి. 
ఆ సినిమాలేంటో చూద్దాం...

యాక్షన్‌ డ్రామా...  
మలయాళ స్టార్‌ హీరోల్లో ఒకరైన మోహన్‌లాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన తాజా పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్‌ లంకేష్, నయన సారిక ముఖ్య పాత్రలు  పోషించారు. నందకిశోర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్‌ ఎస్‌. వ్యాస్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్‌. కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్‌ మాథుర్, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌. వ్యాస్, ప్రవీర్‌ సింగ్, విశాల్‌ గుర్నాని, జూహి పరేఖ్‌ మెహతా నిర్మించారు. 

తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం నవంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  తెలుగు, మలయాళ భాషల్లోనే కాదు... హిందీ, కన్నడలోనూ ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ‘‘హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘వృషభ’లో అద్భుతమైన విజువల్స్‌ ఉంటాయి. బంధాలు, త్యాగాల కలయికగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా కనెక్ట్‌ అవుతుంది. అలాగే చక్కని అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

సరికొత్త ప్రేమకథ  
ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియన్‌ మూవీ ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. ఈ సినిమాలో రష్మికకి జోడీగా దీక్షిత్‌ శెట్టి నటించారు. నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ మూవీ నిర్మించారు.

ఈ సినిమా నవంబరు 7న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కాబోతోంది. ‘‘సరికొత్త ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. ఈ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీని తనదైన శైలిలో చక్కగా తెరకెక్కించారు రాహుల్‌ రవీంద్రన్‌. రష్మికా మందన్నా, దీక్షిత్‌ శెట్టిల జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ అందించిన సంగీతం మా మూవీకి ప్లస్‌ అవుతుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్‌.  

సూపర్‌ నేచురల్‌ బ్యాక్‌డ్రాప్‌లో...  
సుధీర్‌ బాబు హీరోగా రూపొందిన పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘జటాధర’. ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్‌ కనకాల, ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్, రవిప్రకాశ్, ఇందిరా కృష్ణన్, రోహిత్‌ పాఠక్‌ తదితరులు ఇతర పాత్రలు  పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్‌ కుమార్‌ బన్సాల్, శివన్‌ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్‌ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సుధీర్‌ బాబు పాత్ర కొత్తగా ఉండనుంది.

బాలీవుడ్‌ నటి సోనాక్షీ సిన్హా ధన పిశాచి అనే పవర్‌ఫుల్‌ రోల్‌ చేశారు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ‘‘సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జటాధర’. అద్భుతమైన కథ, భావోద్వేగాలతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమా కోసం సుధీర్‌ బాబు ఎంతో కష్టపడ్డారు. రాయిస్, జైన్, సామ్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే విడుదల కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సినీ ప్రయాణంలో ‘జటాధర’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

మైథలాజికల్‌ థ్రిల్లర్‌  
రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిరంజీవ’. ఈ సినిమాకి ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కుషిత హీరోయిన్ గా నటించగా, శ్రీరంజని, అమిత్‌ భార్గవ్, గడ్డం నవీన్, ఇమ్మాన్యుయేల్, టేస్టీ తేజ కీలక పాత్రధారులు. స్ట్రీమ్‌ లైన్‌ ప్రోడక్షన్‌ బ్యానర్‌పై రాహుల్‌ యాదవ్, సుహాసిని నిర్మించారు. ఈ మూవీని నేరుగా ఆహా ఓటీటీలో నవంబరు 7న రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. 

దసరా పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌లో ‘నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్‌ ఏంటో తెలుసా?.. అంబులెన్స్ డ్రైవర్‌.. ’ వంటి డైలాగ్స్‌ ఆసక్తిగా ఉన్నాయి. ‘‘మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘చిరంజీవ’. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో రాజ్‌ తరుణ్‌ కనిపించనున్నారు. తనకి సూపర్‌ పవర్స్‌తో పాటు ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసే పవర్‌ ఉంటుంది. ఈ పవర్స్‌ వల్ల శివ ఎలా లాభపడ్డాడు? ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు? వంటి విషయాలు మా చిత్రంలో ఆసక్తిగా ఉంటాయి’’అని మేకర్స్‌ తెలిపారు. 
  
నవ్వుల్‌ నవ్వుల్‌ 
‘మసూద’ (2022) సినిమాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తిరువీర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’. రాహుల్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించారు. 7 పి.ఎం ప్రోడక్షన్స్, పప్పెట్‌ షో ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్‌ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. 

డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల విడుదల చేసిన ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ మూవీ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘ఈ మూవీ టీజర్‌ చూడగానే సినిమా చూడాలనిపిస్తోంది. ఇలాంటి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు నిర్మించడానికి ధైర్యం, ΄్యాషన్‌ ఉండాలి’’ అంటూ శేఖర్‌ కమ్ముల చెప్పడంతో ఈ సినిమాపై మంచి బజ్‌ నెలకొంది. ‘‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ కథ వింటున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మా సినిమా  ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ కథ నచ్చడంతో పప్పెట్‌ షో అనే బ్యానర్‌ని స్థాపించి, పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యాను’’ అని తిరువీర్‌ పేర్కొనడం విశేషం.  

పీరియాడికల్‌ డ్రామా 
‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్ర ఖని కీలక పాత్ర  పోషించారు. స్పిరిట్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్, ప్రశాంత్‌ ΄÷ట్లూరి, జోమ్‌ వర్గీస్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్‌ కానుంది.

‘‘పీరియాడికల్‌ డ్రామాగా రూపొందిన చిత్రం ‘కాంత’. 1950 చెన్నై నేపథ్యంతో పాటు గోల్డెన్‌ ఏజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రమిది. అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఝను చంతర్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ, వింటేజ్‌ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.  

వినోదాల సంతాన  ప్రాప్తిరస్తు 
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన  ప్రాప్తిరస్తు’. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, తరుణ్‌ భాస్కర్, శ్రీలక్ష్మి, అభినవ్‌ గోమటం, మురళీధర్‌ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్‌ కుమార్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్‌ కీలక పాత్రలు  పోషించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్‌ అవుతోంది.

‘‘మ్యూజికల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘సంతాన  ప్రాప్తిరస్తు’. ఒక సమకాలీన అంశాన్ని కథలో చూపిస్తూ వినోదాత్మకంగా తీశాడు సంజీవ్‌ రెడ్డి. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలోని వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కల్యాణి ఓరుగంటి పాత్రలో చాందినీ చౌదరి ఆకట్టుకోనున్నారు. రచయిత షేక్‌ దావూద్‌ జి. అందించిన స్క్రీన్‌ ప్లే మా చిత్రానికి అదనపు ఆకర్షణ. సునీల్‌ కశ్యప్‌ సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.  

వీరాభిమాని సందడి   
రామ్‌  పోతినేని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ ΄÷లిశెట్టి’ మూవీ ఫేమ్‌ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం ఫేమ్‌ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. ఈ మూవీలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ, తులసి రామ్‌ ఇతర పాత్రలు  పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సూర్య కుమార్‌ అనే ఆన్‌ స్క్రీన్‌ సూపర్‌ హీరో పాత్రలో నటిస్తున్నారు ఉపేంద్ర. ఆయన వీరాభిమానిగా రామ్‌ కనిపించనున్నారు.

వివేక్‌– మెర్విన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పాటలకు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం కోసం రామ్‌ స్వయంగా ఓ పాట పాడటం విశేషం. ‘‘ఈ చిత్రంలో సూపర్‌ స్టార్‌ సూర్య కుమార్‌ (ఉపేంద్ర) వీరాభిమాని సాగర్‌గా రామ్‌ నటిస్తున్నారు. ఆయన నటన సూపర్బ్‌గా ఉంటుంది. ప్రతి హీరో అభిమాని... రామ్‌ పాత్రలో తమను తాము చూసుకుంటారు. భాగ్యశ్రీ అందం, అభినయం ఈ చిత్రానికి ప్లస్‌. తొలి చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ ΄÷లిశెట్టి’తో పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్‌ మహేశ్‌బాబు ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ అనే మరో మంచి కథతో రాబోతున్నాడు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.

పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు నవంబరులో విడుదలకు ముస్తాబయ్యే అవకాశాలున్నాయి.  

టాలీవుడ్‌లోనే కాదు... బాలీవుడ్‌లో, హాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇమ్రాన్‌ హష్మి, యామీ గౌతమ్‌ జోడీగా నటించి ‘హక్‌’ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. అలాగే ‘ప్రిడేటర్‌: బాడ్‌ల్యాండ్స్‌’ అనే హాలీవుడ్‌ మూవీ కూడా అదే రోజు రిలీజ్‌ అవుతోంది. ఇక అజయ్‌ దేవగన్, ఆర్‌. మాధవన్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్‌ మూవీ ‘దే దే ΄్యార్‌ దే 2’  నవంబరు 14న విడుదల కానుంది. అదే విధంగా అమితాబ్‌ బచ్చన్, ఫర్హాన్‌ అక్తర్, రాశీ ఖన్నా లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘120 బహదూర్‌’ అనే హిందీ చిత్రం, ‘వికెడ్‌ 2’ అనే హాలీవుడ్‌ మూవీ నవంబరు 21న రిలీజ్‌ అవుతున్నాయి. అలాగే ధనుష్, కృతీ సనన్‌ జోడీగా నటించిన హిందీ చిత్రం ‘తేరే ఇష్క్‌ మే’, ‘జూటోపియా 2’ అనే హాలీవుడ్‌ మూవీ నవంబరు 28న విడుదలకు ముస్తాబయ్యాయి. వీటితో పాటు మరికొన్ని మూవీస్‌ కూడా రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.  – డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement