సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేమకథలు, యాక్షన్, థ్రిల్, పొలిటికల్, హారర్... ఇలా అన్నమాట. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆధ్యాత్మిక ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. భక్తి, హిందుత్వం, మైథలాజీ, ధర్మం ఆధారంగా రూపొందుతోన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ కూడా బాగా ఉంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ప్రేక్షకులకు ఆధ్యాత్మిక శోభ చూపించేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.
భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’, రవితేజ ‘ఇరుముడి’, మహేశ్‌బాబు ‘వారణాసి’, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’, నిఖిల్ ‘స్వయంభు’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ సినిమాలతో పాటు ‘మహావతార్ నరసింహా, వాయుపుత్ర’ వంటి యానిమేషన్ మూవీస్ కూడా రూపొందుతున్నాయి. ఆయా సినిమాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.
హనుమంతుడు తోడుగా...
ఆంజనేయస్వామికి హీరో చిరంజీవి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా హనుమంతుడి పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంటారాయన. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’లోనూ మరోసారి హనుమంతుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉండనున్నాయి. తొలి చిత్రం ‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, పురాణాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.
చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ కథతో రూపొందిన ‘విశ్వంభర’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ వద్ద 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు మేకర్స్. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ఓ హైలెట్‌గా నిలుస్తాయని టాక్. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే విలన్లను రఫ్ఫాడిస్తున్న చిరంజీవి వెనక నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ మూవీని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్, సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్. గత ఏడాది తన పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా చిరంజీవి స్వయంగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘‘చందమామ కథలా ‘విశ్వంభర’ ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్‌ని అందించేందుకు సమయం పడుతోంది. 2026 వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అంటూ చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే గ్రాఫిక్స్‌కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందట. ఈ కారణంగా ఈ మూవీ గురించి ఎలాంటి కొత్త అప్‌డేట్ ఇవ్వడం లేదట చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్లు ‘విశ్వంభర’ ఈ వేసవి ముగిసేలోపు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే మరోసారి వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ గురించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
అయ్యప్ప మాలధారిగా...
వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకెళుతుంటారు రవితేజ. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్‌లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ.
‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటాయి. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ అద్భుతంగా రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. ఈ సినిమా కోసం రవితేజ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘ఇరుముడి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
జై హనుమాన్
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ, అమృతా అయ్యర్ జోడీగా నటించారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై, పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించి, అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ‘హనుమాన్’కి కొనసాగింపుగా ‘జై హనుమా న్ ’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (‘కాంతారా’ మూవీ ఫేమ్) నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రాముడి విగ్రహాన్ని హత్తుకుని ఉన్న హనుమంతుడిగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలున్నాయి. పైగా ‘కాంతారా, కాంతారా చాప్టర్ 2’ మూవీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో టైటిల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ మరింత క్రేజ్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. ‘హనుమాన్’ మూవీలో తనదైన నటనతో మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్‌నగర్ టాక్.
శ్రీరాముడు–రుద్ర
‘బాహుబలి, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు మహేశ్‌బాబు. వారణాసి నేపథ్యంలో భక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు మునుపెన్నడూ చూడని విధంగా శ్రీరాముడు, రుద్ర అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణని జార్జియాతో పాటు పలు అంతర్జాతీయ ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు... ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో వారణాసిని సృష్టించారు. అచ్చం వారణాసిలా తీర్చిదిద్దిన సెట్‌లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఒక గొప్ప అనుభూతినిచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ విజువల్ వండర్‌ను చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. ఈ చిత్రం అందర్నీ గర్వపడేలా చేస్తుంది’ అని మహేశ్‌బాబు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఈ మూవీ భారతదేశంలోనే కాకుండా ‘గ్లోబ్‌ట్రోటర్, టైమ్‌ట్రోటర్’ అనే ట్యాగ్‌లై న్ లతో అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని సమాచారం. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’ విడుదల కానుంది. మహేశ్‌బాబు– రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీపై గ్లోబల్ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది.
స్వయంభు కోసం...
‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల కానుంది. నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రం ‘స్వయంభు’. ఇది పూర్తిగా పురాణ, భారతీయ యోధుల చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని స్టైలిష్, హిస్టారికల్ యాక్షన్ మైథలాజికల్‌గా రూపొందిస్తున్నారు. నిఖిల్ వేషధారణ, యాక్షన్ లుక్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి రేపాయి.
తన పాత్ర కోసం నిఖిల్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవడంతో పాటు ఇంటె న్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్‌ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందట. ఇండియాలోని టాప్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయని తెలిసింది. ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం కావాల్సినంత సమయం తీసుకొని, వరల్డ్ క్లాస్ ఔట్‌పుట్ అందించేందుకు మేకర్స్ పూర్తి కమిట్‌మెంట్‌తో పని చేస్తున్నారు. నిఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ‘స్వయంభు’ రూపొందుతోంది.
‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో, భయంతో అన్ని జాగ్రత్తలతో చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో నిఖిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
దశావతార ఆలయం నేపథ్యంలో...
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేశ్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భక్తి నేపథ్యంలో రూపొందుతోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అతను ఒంటరివాడు కాదు... అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఈ పోస్టర్‌లో ఇచ్చిన క్యాప్షన్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
అలాగే టైటిల్ టీజర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. శతాబ్దాల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఈ కథాంశం యాక్షన్, ఆధ్యాత్మికతలను మేళవిస్తుంది. సర్పదేవత పచ్చబొట్టుతో పాటు పవిత్రమైన విష్ణు నామాలు వంటి చిహ్నాలు కూడా టీజర్‌లో కనిపిస్తాయి. దుండగుల బారి నుంచి దశావతార ఆలయాన్ని హీరో ఎలా కాపాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న సాలిడ్ థ్రిల్లర్‌గా, భారతీయ ధర్మం, ఆచారాలపై ఆధారపడిన పౌరాణిక యాక్షన్ డ్రామాగా ‘హైందవ’ చిత్ర కథాంశం ఉండనుందట. ఈ మూవీలో ఓ ధార్మిక యోధుడి పాత్రలో కనిపించనున్నారట సాయి శ్రీనివాస్.
నాగబంధం
‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ అభిషేక్ నామా తెరకెక్కించారు.
మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్‌బాబు ‘నాగబంధం’ టీజర్‌ని విడుదల చేసి, ‘‘టీజర్ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. హిమాలయ శిఖరాల్లో దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం, కాలానికే అందని ఒక పురాతన శక్తి నేపథ్యంలో అల్లుకున్న సస్పె న్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘నాగబంధం’ని రూపొందించారని సమాచారం. ఇందులో విరాట్ కర్ణ శక్తిమంతమైన యోధుడిగా నటించారు. ఈ చిత్రంలో నాగబంధం, శివ తంత్ర విద్య, నాగబంధం ఆలయం వెనక ఉన్న గుప్తనిధులు వంటి అంశాలు కథలో హైలెట్ కానున్నాయట. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది.
గదాధారి హనుమాన్...
రవి కిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘‘మైథలాజికల్ జానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘గదాధారి హనుమాన్’.
ఈ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోష న్స్ను అద్భుతంగా పండించాం. ఈ మూవీ గ్లింప్స్, టీజర్‌లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్‌ఫుల్ అన్న దానిపై ఓ సీక్వె న్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని రవికిరణ్ తెలిపారు.
యానిమేషన్ కూడా...
ఇదిలా ఉంటే... రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటు ‘మహావతార్ నరసింహా’, ‘వాయుపుత్ర’ వంటి యానిమేటెడ్ సినిమాలు కూడా రానున్నాయి. అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహా’ యానిమేటెడ్ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. 2037 వరకు ఏడు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న యానిమేటెడ్ ఫిల్మ్ ‘వాయుపుత్ర’ పైనా మంచి అంచనాలున్నాయి.
రామాయణం
హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్షణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ, యశ్ మాన్‌స్టర్‌మైండ్ క్రియేష న్న్స్ సహకారంతో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, పరశురాముడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.
– డేరంగుల జగన్ మోహన్


