హీరోయిన్ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.
లక్కీ చార్మ్
ఇటీవల విజయ్ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్, అజిత్, సూర్యల కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తిరిగి పంచుకుంది.
విజయ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.
అజిత్: హీరో అజిత్ 'గుడ్‌బ్యాడ్ అగ్లీ' ద్వారా తన కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.
సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక.
అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్ అని కొనియాడుతున్నారు.


