ఒకప్పుడు తన అందంతో, హావభావాలతో, అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈమె తెలుగులో చిరంజీవి సరసన 'ఆపద్బాంధవుడు' చిత్రంలో నటించింది. అవురా అమ్మకు చెల్ల పాటలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి అమెరికా వెళ్లిపోయింది.
30 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
అక్కడ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేసి ఎంతోమందికి నాట్యం నేర్పించింది. దాదాపు 30 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న ఈ నటి కొన్ని నెలల క్రితమే భారత్‌కు తిరిగి వచ్చేసింది. తనకు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుందన్న కోరికను మీనాక్షి శేషాద్రి ఆమె సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. 'నన్ను అభిమానిస్తున్న అందరికీ నమస్కారం.. మీ ప్రేమానురాగాలకు, మీరు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. 30 ఏళ్ల తర్వాత నా కర్మభూమికి తిరిగొచ్చేశాను.
అలాంటి పాత్రలు చేయాలనుంది
ఇప్పుడు ముంబైలో ఉంటున్నాను. సానుకూల దృక్పథం, ఆశ, ప్యాషన్‌తో మరోసారి చలనచిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్నాను. చిన్న, పెద్ద, ప్రధాన పాత్ర అని తేడా లేకుండా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. సినిమాలతో పాటు ఓటీటీ షోలు, వెబ్‌సిరీస్‌లైనా చేసేందుకు రెడీగా ఉన్నాను. చాలెంజింగ్ రోల్స్ చేయాలనుంది. నేను భారత్ తిరిగి వచ్చాక అనేక ఆఫర్లు వచ్చాయి.
ఏదో నిరూపించుకోవాలని కాదు
కానీ అందులో కొన్ని ఏమంత ఎగ్జయిటింగ్‌గా లేవు. మరికొన్నేమో ముందుకు కదల్లేవు. అయినా సరే ఎటువంటి టీమ్, ఏజెన్సీ లేకుండా నేనే అంతా మేనేజ్ చేసుకుంటున్నాను. నేను ఏదో నిరూపించుకోవడానికి రీఎంట్రీ ఇవ్వడం లేదు. నా కుటుంబసభ్యుల ఎంకరేజ్‌మెంట్ వల్లే ఇక్కడున్నాను. నాకు సంతోషాన్నిచ్చేదే సినిమా.. అందుకే మళ్లీ ఇండస్ట్రీలో భాగం అవాలని కోరుకుంటున్నాను' అని నటి చెప్పుకొచ్చింది.
కెరీర్
మీనాక్షి శేషాద్రి హిందీలో.. హీరో, పైసా యే పైసా, దిల్‌వాలా, స్వాతి, జుర్మ్, దామిని, గంగా జమున సరస్వతి వంటి అనేక చిత్రాల్లో నటించింది. చివరగా స్వామి వివేకానంద (1998) బయోపిక్‌లో కనిపించింది. ఆ తర్వాత ఘాయల్: వన్స్ ఎగైన్ మూవీలో ఫ్లాష్‌బ్యాక్‌లో తళుక్కుమని మెరిసింది. మరి మీనాక్షి ఇప్పుడెలాంటి సినిమాలు ఎంపిక చేసుకుంటుందో చూడాలి!
చదవండి: కదిలే రైలుపై నేను, విజయ్.. ఆరోజు చనిపోయేవాళ్లం: విలన్


