సినిమాల్లో కామెడీ, డ్యాన్సులే కాదు యాక్షన్ సీన్లు కూడా ఉంటాయి. ఈ ఫైట్ సీన్ల కోసం హీరో, విలన్లు కొన్నిసార్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి షూట్ చేస్తుంటారు. అలాంటి ఓ సంఘటనను విలన్ అభిమన్యు సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈయన తెలుగులో రక్తచరిత్ర, గబ్బర్‌సింగ్, పండగ చేస్కో, అమర్ అక్బర్ ఆంటోని, ఓజీ వంటి చిత్రాల్లో నటించాడు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు.
కేరళలో ఫైట్ సీన్
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళంలో నా మొదటి సినిమా విజయ్ హీరోగా నటించిన వేలాయుధం (2011). ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ కోసం మేము ఆరు గంటలపాటు ప్రయాణించి కేరళలోని కోయంబత్తూరు వెళ్లాం. అక్కడ చిన్న హోటల్‌లో బస చేశాం. అక్కడినుంచి సుమారు గంటన్నరపాటు ప్రయాణిస్తే ఒక చిన్న రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడే మా షూటింగ్.. అప్పటికే ఒక రైలును రెడీ చేసి పెట్టారు.
కదిలే రైలుపై..
ఆరు రోజులపాటు ఫైట్ సీన్ షూట్ జరిగింది. ఏడో రోజు రైలుపై ఎక్కి పోట్లాడుకునే సీన్ చిత్రీకరించాలి. రైలు పట్టాలపై ఆగి ఉన్నప్పుడు దానిపై ఎక్కి విజయ్, నేను రిహార్సల్స్ చేశాం. కెమెరా ఆన్ చేయగానే రైలు కదులుతుందన్నారు. నాకు భయమేసింది. కదిలే ట్రైన్‌పై మనమెలా ఫైట్ చేయగలమని అడిగాను. అందుకతడు.. మనం పోట్లాడుకోం, ఒకరినొకరు కాపాడుకుంటాం అని బదులిచ్చాడు. చూస్తుండగానే రైలు వేగం పుంజుకుంది.
గుండె ఆగిపోయినంత పని!
70-80 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. మా ఇద్దరితోపాటు కెమెరామెన్ ఒక్కడే ఉన్నాడు. ఇంతలో ఎదురుగా బ్రిడ్జి కనిపించింది. అప్పుడు నా గుండె అరచేతిలోకి వచ్చింది. పొరపాటున కాలు జారితే 2500 అడుగుల లోయలో పడి చనిపోవడం ఖాయం. కాలు జారి పడేటప్పుడు మరో మనిషి చేయి పట్టుకుని లాగుతాం.. అప్పుడు విజయ్ ప్రాణాలకు కూడా ప్రమాదమే.. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు. విజయవంతంగా షూట్ పూర్తి చేశాం.
ఆయన భయం లేకుండా..
కానీ, నాకు వారం రోజులపాటు సరిగా నిద్రపట్టలేదు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అన్న ఊహే నా వెన్నులో వణుకు పుట్టించింది. అదే సమయంలో విజయ్ వంటి స్టార్ హీరో ఏమాత్రం భయం లేకుండా, సేఫ్టీ చర్యలు తీసుకోకుండా ధైర్యంగా ఉంటే నేనెందుకు ఇంతలా వణికిపోతున్నాను అనిపించింది. ఏదేమైనా ఆరోజు చావు అంచుల నుంచి మేమిద్దరం తప్పించుకున్నాం అని అభిమన్యు సింగ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆ అవమానం వల్లే..: బండ్ల గణేశ్


