
ఎర్రచందనం స్మగ్లింగ్.. నీకేం తెలుసు? అని పుష్ప సినిమా చూసిన ప్రేక్షకుడ్ని అడిగితే?.. కల్కి సినిమా స్టోరీ లైన్ ఏమిటంటే ఆ సినిమా చూసిన వారిలో ఎంతమంది ప్రేక్షకులు ఠక్కున చెప్పగలరు? ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సన్నివేశాలకు మన ఇంటి చుట్టుపక్కల పరిస్థితులకు ఏమన్నా సంబంధం ఉందా? దేవర మూవీలో హీరోని చూస్తూ అతనితో మనకు తెలిసిన వారిని ఎవరినైనా పోల్చుకోగలమా? హిట్ 3లో చూపించిన డార్క్ వెబ్ గురించి తెలియడం అటుంటి అసలు ఆ పదం మనలో ఎందరు విని ఉంటాం?
ఛత్..ఇవన్నీ ఎందుకు బాస్... ఆ సినిమాలన్నీ జనం జేబులు కొల్లగొట్టి మనకు కలెక్షన్ల మూటలు కొట్టుకొచ్చాయి కదా. అది చాలు అంటోంది టాలీవుడ్. పాన్ ఇండియా పేరుతో ప్రజలకు పరిచయం లేని సంబంధం లేని అక్కర్లేని, రంగుల హంగుల విచిత్రాల్ని కళ్ల ముందుకు తెస్తోంది. అయితేనేం అవి హిట్ అవడం లేదా అంటే అవుతున్నాయి. బ్రహ్మాండంగా కలెక్షన్లు తెస్తున్నాయి. కానీ అదొక్కటే చాలా? ఏమీ అర్ధం కాకపోయినా జురాసిక్ పార్క్, అవతార్..వగైరా చిత్రాలు మన దగ్గర కూడా భారీ కలెక్షన్లు కురిపించాయి. అంతమాత్రాన అలాంటివే మనమూ తీయాలని అనుకుంటామా? విదేశీ చిత్రాలకు ఇక్కడ మనుషులతో, ఇక్కడి మనస్తత్వాలతో, ఇక్కడి పరిస్థితులతో పనిలేదు.. అవసరం లేదు. కానీ ఇక్కడి సినిమాలు ఇక్కడి మనుషులతో పెనవేసుకున్నాయి. ఇక్కడి ప్రజల కష్టంతో తయారవుతున్నాయి. వారి కష్టంతోనే దర్జాగా బ్రతుకుతున్నాయి. కాబట్టి జనం చూస్తున్నారు మేం తీస్తున్నాం అనేది ప్రాంతీయ సినిమాల వరకూ సరైన విధానం కాదు.
(చదవండి: భారత్‌పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!)
పెద్ద ఎన్టీయార్ తరం చూస్తే నాటి హీరోలు ఎన్ని రకాల సినిమాలు చూపించారు? దైవ భక్తి నుంచి దేశభక్తి దాకా బోధించేవి...అవినీతి అరికట్టమని అన్యాయాన్ని ఎదరించమని రక్త సంబంధాలకు విలువీయమని...రాజకీయాలను బాగు చేయమని...సందేశాలిచ్చేవి ఇలా సామాజిక అంశాలతో ముడిపడిన సినిమాలు ఎన్నో వచ్చాయి... మంచి చెడు రెండింటినీ జనానికి విడమరిచాయి. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి సినిమాలు సృష్టించాడు కాబట్టే ఎన్టీయార్ అనే వ్యక్తిని జనం తమ అన్నగా గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. పార్టీ పెట్టిన ఆర్నెళ్లలోనే సిఎంని చేసి నెత్తిన పెట్టుకున్నారు.
(చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!)
ఆ తర్వాత డ్యాన్సులు, ఫైట్లకు పెద్ద పీట వేసిన చిరంజీవి తరం కూడా జనరంజక సినిమాలనే అది కూడా జనజీవన స్రవంతికి దూరం కాకుండానే అందించింది. తొలిదశలో చేసిన అభిలాష, స్వయంకృషి, ఛాలెంజ్‌ల నుంచి రాజకీయాలకు ముందు చేసిన ఠాగూర్,స్టాలిన్... దాకా మన సమాజంతో ముడిపడిన కధాంశాలతో చేశాడు కాబట్టే చిరంజీవి ఒక పార్టీ పెట్టి 19 సీట్లు, 70లక్షల ఓట్లు దక్కించుకోగలిగాడు.
అయితే ఇక్కడ సినిమా నటులు అందరూ రాజకీయాల్లోకి రావాలని ఈ విషయాలు చెప్పడం లేదు. వారి వృత్తికి, ఎంచుకున్న రంగానికి, చేసే పనికి ప్రజలతో మమేకమైతే అది ఎంతగా ప్రజల్లో వారిపై ఆదరణ పెంచుతుందో సోదాహరణగా చెప్పడమే ఉద్ధేశ్యం. ప్రజల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపే శక్తి సినిమాలకి ఉంది అనడం నిస్సందేహం. అలాంటి సినిమాలను ప్రజల దైనందిన జీవితాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా తెరకెక్కించడం అంటే వారి జేబులు కొల్లగొట్టడం తో తప్ప వారి కష్టనష్టాలతో తమకేమీ సంబంధం లేదని నిస్సిగ్గుగా తేల్చి చెప్పడమే.
(చదవండి : ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక)
అంటే జనం కోసం సినిమా తీసి మమ్మల్ని డబ్బులు పోగొట్టుకోమంటావా? అని నిర్మాతలు, ఫ్లాప్ సినిమాలతో ఫ్యాన్స్‌ని దూరం చేసుకోమంటావా? అని ప్రశ్నించే హీరోలు ఉంటారు. అయితే సందేశాత్మక చిత్రాలకు కలెక్షన్లు రావనేది అర్ధసత్యం మాత్రమే. వాటిలోనూ హిట్స్, ఫ్లాప్స్ అవుతుంటాయి. గేమ్ ఛేంజర్ లాగా అవాస్తవిక చిత్రణతో తీస్తే ఫ్లాప్‌లు అదే ‘కోర్ట్’ లాగా వాస్తవ పరిస్థితులకు అద్దం పడితే కలెక్షన్లు వస్తాయని తెలుస్తూనే ఉంది.
అలాగని భారీ చిత్రాలు కాల్పనిక కధాంశాలు వద్దనడం లేదు అవి కూడా తీయవచ్చు, సదరు గ్రాఫిక్ ఆధారిత చిత్రాలతో అంతర్జాతీయంగా మన సినిమాల పేరు ప్రతిష్టలు పెంచవచ్చు. కానీ అవి మాత్రమే తీయాలని అనుకోకూడదు. ప్రజలతో సంబంధం ఉన్నవి కూడా తీయాలి. వారి కష్టనష్టాలకు ఊరటనిచ్చేవి, వారి రేపటికి బాటలు పరిచేవి, వారి బాగుకి దిక్సూచిగా నిలిచేవి కూడా చేయాలి. కనీసం రెండేళ్లకు ఒకటైనా లో బడ్జెట్‌లో అయినా సామాజిక అంశాలతో సినిమా చేస్తామని పెద్ద హీరోలు తమకు తాము మాట ఇచ్చుకోవాలి. తమకెన్నో ఇచ్చిన సమాజం రుణం తీర్చుకోవాలి. అలా కాదు..అవన్నీ చిన్న హీరోలకు వదిలేస్తాం...మేం మాత్రం ఇలాగే వీడియో గేమ్స్ తరహా చిత్రాలు చేసుకుంటూ ప్రజల కళ్లు విప్పార్చుకునేలా చేస్తూ డబ్బు చేసుకుంటాం...అంటే..ఖచ్చితంగా అది అన్యాయమే, సామాజిక బాధ్యత లేకపోవడమే.. అప్పుడు పెద్ద హీరోల దగ్గర డబ్బులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు..కానీ ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. అలా లేనప్పుడు పేరుకి పెద్ద హీరో అయినా చివరకు జీరోగానే మిగులుతాడు.