‘తెల్లవారితే గురువారం’ మూవీ రివ్యూ

Thellavarithe Guruvaram Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : తెల్లవారితే గురువారం
జానర్ :  రొమాంటిక్‌ కామెడీ
నటీనటులు :  శ్రీ సింహా, చిత్ర శుక్ల, మిష నారంగ్, రాజీవ్ కనకాల, సత్య, వైవా హర్ష 
నిర్మాణ సంస్థ : వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ 
నిర్మాతలు :  రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకత్వం : మణికాంత్ జెల్లీ
సంగీతం : కాల భైరవ
ఎడిటర్‌: సత్య గిడులూరి
సినిమాటోగ్రఫీ : సురేశ్ ర‌గుతు
విడుదల తేది : మార్చి 27, 2021

రాజమౌళి కుటుంబం నుంచి ఇప్పటి వరకు టెక్నీషియన్స్ చాలా మంది వచ్చారు.  కానీ తొలిసారి నటుడిగా వచ్చి గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా. తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత  చాలా గ్యాప్‌ తీసుకున్న శ్రీసింహ.. ఇప్పుడు ‘తెల్లవారితే గురువారం’అనే వెరైటీ  టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మణికాంత్ గెల్ల తెరకెక్కించిన ఈ సినిమాను  వారాహి, లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.  ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లతో చిత్రంపై భారీ అంచనాలే నమోదయ్యాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడం..ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రావడంతో ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య శనివారం(మార్చి 27) విడుదలైన ‘తెల్లవారితే గురువారం’ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది. రాజ‌మౌళి కుటుంబం నుంచి వచ్చిన యంగ్‌ హీరోని ఆడియన్స్‌ ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. 

కథ
పెళ్లి ఈవెంట్‌తో కథ ప్రారంభమవుతుంది. వీరేంద్ర అలియాస్‌ వీరు(శ్రీసింహ), మధు (మిషా నారంగ్‌)లకు పెళ్లి జరుగుతుంటుంది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే ఈ పెళ్లి వీరుకు ఇష్టం ఉండదు. దానినికి కారణం డాక్టర్‌ కృష్ణవేణి(చిత్ర శుక్లా)ని వీరు ప్రేమించడం. దీంతో ఎలాగైనా ఈ పెళ్లిని క్యాన్సిల్‌ చేయాలని వీరు ప్రయత్నిస్తుంటాడు. తెల్లవారితే పెళ్లి అనగా.. వీరు ఇంట్లో నుంచి పారిపోవడానికి రెడీ అవుతాడు. అయితే మధ్యలో అతనికి పెళ్లి కూతురు మధు కూడా పారిపోతూ కనిపిస్తుంది. అసలు మధు ఎందుకు పారిపోయేందుకు ప్రయత్నించింది? ప్రేమించిన అమ్మాయి కోసం ఈ పెళ్లి క్యాన్సిల్‌ చేయించాలనుకున్న వీరు ప్రయత్నం ఫలించిందా? పారిపోయే క్రమంలో మధ, వీరుల జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి ? చివరకు వీరు, మధు పెళ్లి జరిగిందా ? లేదా? అనేదే మిగతా కథ.


నటీనటులు
‘మత్తు వదలరా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీసింహా.. డెబ్యూ మూవీతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. అందులో మంచి కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక రెండో సినిమా ‘తెల్లవారితే గురువారం’లో ఆయన నటన మరింత మెరుగుపడింది. వీరు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు.కన్ ఫ్యూజన్ కామెడీని తన హావభావాలతోనే బాగా పలికించే ప్రయత్నం చేశాడు. అమాయకంగా ఉంటూనే తనదైన శైలీలో కామెడీ పండించాడు.పెళ్లి అంటేనే భయపడే అమాయకపు అమ్మాయి మధు పాత్రలో మిషా నారంగ్‌ ఒదిగిపోయింది. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెరపై అందంగా కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే అపోహలు అపార్థాలతో విడిపోవడానికి కూడా సిద్ధపడే అమ్మాయి కృష్ణవేణి పాత్రలో చిత్ర శుక్లా జీవించేసింది. సరైన నిర్ణయం తీసుకోకుండా, అయోమయంలో పడి హీరోని ఇబ్బందులకు గురిచేసే పాత్ర ఆమెది. హీరో మేనమామ వెంకన్న పాత్రలో సత్య పండించిన కామెడీనే సినిమాకు ప్రధాన బలం. ఆయన కామెడీ టైమింగ్‌ థియేటర్‌లో నవ్వులు పూయిస్తుంది. రాజీవ్ కనకాల, వైవా హర్షతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. 


విశ్లేషణ
రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన చిత్రమిది. చిన్న చిన్న విషయాల్లో అనుమానించి విడిపోవడానికి సిద్దమయ్యే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే.. అతను పడే ఇబ్బందులు ఎలా ఉంటాయనే విషయాన్ని మంచి కామెడితో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మణికాంత్ జెల్లీ. అయితే, దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం బెడిసికొట్టింది. సినిమా అంతా స్లోగా నడిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుంది.


హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న లవ్‌ సీన్స్‌ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు. కానీ, ప్రధాన పాత్రల మధ్య వచ్చే కన్‌ఫ్యూజన్‌ కామెడీ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు కొంచెం టెన్షన్‌ కూడా పెడుతుంది. అలాగే అజయ్‌ మేక పిల్ల సీన్‌ కూడా సిల్లీగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సత్య కామెడీ. ఆయన కామెడీ టైమింగ్‌ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. ఆయన తెరపై కనిపించినంతసేపు ప్రేక్షకులు పగలబడి నవ్వడం ఖాయం. కాల భైరవ సంగీతం బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. కొన్ని కీలక సన్నివేశాలలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. ఎడిటర్‌ సత్య గిడులూరి తన కత్తెరకు బాగా పనిచెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేయాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.


 ప్లస్‌ పాయింట్స్‌
శ్రీసింహ, చిత్ర శుక్లా, మిష నారంగ్‌ నటన
సత్య పండించే కామెడీ
కాల భైరవ సంగీతం

మైనస్ పాయింట్స్ :
రొటీన్‌ స్టోరి
స్లో నెరేషన్స్
సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు
-అంజి శెట్టె

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top