ఏప్రిల్‌: కొత్త సినిమాలివే గురూ..

Telugu Upcoming Movies Release Dates In April - Sakshi

ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడానికే సినిమా. వినోదానికి ప్రతిఫలంగా నాలుగు కాసులు వస్తాయి కనుకనే ఏటా వేలాది సినిమాలు రిలీజవుతుంటాయి. అందులో కొన్ని హిట్‌ ట్రాక్‌ ఎక్కితే, మరికొన్ని మాత్రం ఏకంగా బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొడతాయి. కానీ గతేడాది మాత్రం కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల థియేటర్లో బొమ్మ ఆడక సగటు ప్రేక్షకుడికి వినోదం కరువైంది. తర్వాత థియేటర్లు రీఓపెన్‌ అయినా కరోనా టెన్షన్‌తో జనాలు సినిమాలను ఆదరిస్తారో లేదో అన్న ఆందోళన వ్యక్తమైంది.

కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేశారు సినీప్రియులు. కంటెంట్‌ బాగుంటే భయాలన్నీ పక్కనపెట్టి థియేటర్‌కు కదిలివస్తామని చెప్తున్నారు. చెప్పినట్లుగానే ఇప్పటివరకు పలు సినిమాలను ఆదరించారు. అభిమానించారు. దీంతో నిర్మాతలు కూడా తమతమ సినిమాలను ఓటీటీల్లో కాకుండా థియేటర్లలోనే రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండగ ఉన్న ఏప్రిల్‌ నెలలో ఏయే సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయో చూసేద్దాం..

మన్మథుడు 2 ఫ్లాప్‌ కావడంతో కొంత నిరాశలో ఉన్నాడు టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున. దీంతో ఈసారి లవ్‌స్టోరీ కాకుండా క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా ఎంచుకున్నాడు. సాల్మన్‌ డైరెక్షన్‌లో ఆయన చేస్తున్న వైల్డ్‌డాగ్‌ మూవీ ఏప్రిల్‌ 2న థియేటర్లలో విడుదల కానుంది.

ఏప్రిల్‌ 2న మరో స్టార్‌ హీరో సినిమా రిలీజ్‌ కాబోతోంది. తమిళ హీరో కార్తీ నటించిన సుల్తాన్‌ అదే రోజు తెలుగులోనూ విడుదలవుతోంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా వకీల్‌సాబ్‌. ఈ చిత్రం ఏప్రిల్‌ 9న రిలీజ్‌ అవుతోంది.

ఆ తర్వాత వారం రోజులకే అంటే ఏప్రిల్‌ 16న నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన లవ్‌స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సత్యదేవ్‌, మిల్కీబ్యూటీ తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం చిత్రం ఏప్రిల్‌ 14న థియేటర్లలోకి రానుంది.

నేచురల్‌ స్టార్‌ నాని టక్‌ జగదీష్‌ ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం ఏప్రిల్‌ 30న సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

అలాగే విజయ్‌ సేతుపతి, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా పేరుతో ఏప్రిల్‌ 2న రిలీజ్‌ అవుతోంది. ఇక కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన యువరత్న ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. సునీల్‌ డిటెక్టివ్‌గా నటించిన కనబడుట లేదు ఏప్రిల్‌ 16న థియేటర్లలో సందడి చేయనుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ తలైవి సినిమా ఏప్రిల్‌ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఇందులో సంచలన నటి కంగనా రనౌత్‌ నటించింది.

చదవండి: టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ రివ్యూ.. 8 హిట్‌ సినిమాలు ఇవే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top