
పిల్లలు అనే కాన్సెప్టే.. అన్ని అనర్థాలకు కారణం
పిల్లల్ని పెంచడం కంటే టైం వేస్ట్ పని ఇంకోటి లేదు
50 ఏళ్లు దాటినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నాడు నటుడు హర్ష వర్ధన్. అమృతం సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైన ఈయన ఇటీవల 'కోర్ట్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీని బయటపెట్టడంతో పాటు పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఏడేళ్ల ప్రేమ..
హర్షవర్ధన్ (Actor Harsha Vardhan) మాట్లాడుతూ.. వివాహబంధానికి నేను పెద్ద అభిమానిని. కానీ ఓ అమ్మాయి వల్ల లవ్ ఫెయిలై పెళ్లి జోలికి వెళ్లాలనుకోవడం లేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్నాం. ఎన్నడూ ఐ లవ్యూలు చెప్పుకోలేదు. పిల్లల్ని కనకుండా అనాథాశ్రమం నుంచి ముగ్గురు, నలుగుర్ని దత్తత తీసుకోవాలనుకున్నాం.
సడన్‌గా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది
ఆ అమ్మాయికి ఇలాంటి ఆలోచనలు రావడం చూసి ఆశ్చర్యమేసింది. ఇంతకంటే మంచి జోడీ ఇంకెక్కడ దొరుకుతుంది? అనిపించింది. అయితే సడన్‌గా ఓరోజు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంది. నేను స్టేజీపై ఒక అవార్డు తీసుకుంటున్న సమయంలో తన పెళ్లయిపోయిందని తెలిసింది. నిజానికి రెండు నెలలుగా తన వైపు నుంచి నాకు ఫోన్ రాలేదు. పని బిజీలో పడిపోయి ఆ సంగతే మర్చిపోయాను. నేను తనకు టైం ఇవ్వకపోవడం వల్లే నన్ను వదిలేసి ఉండొచ్చు.
తను వెళ్లిపోవడం వల్లే మంచి జీవితం దొరికిందేమో!
కానీ నాతో ఒక్కమాటయినా చెప్పాలి కదా.. చెప్పలేదు. చాలా బాధపడ్డాను. రెండు మూడు రోజులు మందు తాగి అర్జున్‌రెడ్డిలా మారిపోయాను. అయినా నేనక్కర్లేదు అనుకున్న మనిషి నాకూ అక్కర్లేదు కదా అని రియలైజ్ అయ్యాను. వెంటనే ఆ బాధ నుంచి బయటకు వచ్చేశాను. తను వెళ్లకపోతే నాకు ఇంత మంచి జీవితం దొరికేది కాదేమో! ఎందుకంటే నేను సినిమాల్లోకి రావడం తనకిష్టం లేదు. ఏది జరిగినా మన మంచికే జరిగిందనుకున్నాను.
పిల్లల్ని పెంచడం.. ఇదో టైం వేస్ట్ పని
15 ఏళ్ల క్రితంవరకు పిల్లల్ని దత్తత తీసుకుంటే బాగుండనుకున్నాను. కానీ తర్వాత దీనికంటే టైం వేస్ట్ పని ఇంకోటి లేదనిపించింది. పిల్లలు అనే కాన్సెప్టే.. అన్ని అనర్థాలకు దారి తీస్తుంది. ఇలా మా నాన్నగారు అనుకుని ఉండుంటే నేను పుట్టేవాడినే కాదనుకోండి. పెళ్లి- పిల్లలు అంటే కాంప్రమైజ్ అయి బతకాలి. అడ్జస్ట్ అవ్వాలి.. అవి నా వల్ల కాదు. ఈ బంధాలు బాంధవ్యాలు వద్దు. అందుకే పెళ్లి అనే ఆలోచననే విరమించుకున్నాను అని హర్షవర్దన్ చెప్పుకొచ్చాడు.
సినిమా
హర్షవర్ధన్.. 3, మనం, చిన్నదాన నీకోసం, గురు, తిక్క చిత్రాలకు డైలాగ్స్ రాశాడు. గుండె జారి గల్లంతయ్యిందే మూవీకి రచయితగా పని చేశాడు. మామా మశ్చీంద్ర చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. నటుడిగా.. పౌర్ణమి, 3, జోష్, లీడర్, గీతాంజలి, ఆగడు, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, అంటే సుందరానికి, హిట్: 2, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, సరిపోదా శనివారం వంటి పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నాడు.
చదవండి: సడన్‌గా శోభితను తీసేసి ఆమె స్థానంలో కుక్కతో షూటింగ్