
బాలీవుడ్ నటి తనిష్టా చటర్జీ (Tannishtha Chatterjee) క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించింది. ఇదే వ్యాధి కారణంగా తండ్రిని కోల్పోయిన ఆమె ఇప్పుడదే మహమ్మారితో పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన జర్నీని సోషల్ మీడియాలో పంచుకుంది. గత 8 నెలలు ఎంతో కష్టంగా సాగాయి. క్యాన్సర్‌తో తండ్రిని కోల్పోయాను. ఇప్పుడదే మహమ్మారి నాకూ వచ్చింది. ఒలిగో మెటాస్టాటిక్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు 8 నెలల క్రితం తేలింది.
ఇద్దరికి నేనే ఆధారం
నా బాధ చెప్పుకోవడానికి ఈ పోస్ట్ చేయడం లేదు. ప్రేమ, ఆత్మస్థైర్యం గురించి మాట్లాడేందుకు పోస్ట్ చేశాను. నాపై 70 ఏళ్ల తల్లి ఆధారపడి ఉంది. నాకు తొమ్మిదేళ్ల కూతురుంది(తనిష్టాకు పెళ్లవలేదు, పాపను దత్తత తీసుకుంది). ఇద్దరికీ అన్నీ నేనే! వారిని చూసుకోవాల్సిన నేను క్యాన్సర్‌తో పోరాడుతున్నా.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇటువంటి కష్టసమయంలో వారి ప్రేమే నాకు సాంత్వననిస్తోంది. ఒంటరితనం దరిచేరనీయకుండా నా కుటుంబసభ్యులు, స్నేహితులు ఎల్లప్పుడూ నన్ను అంటిపెట్టుకునే ఉంటున్నారు. నా పెదాలపై చిరునవ్వును చెరిగిపోనివ్వడం లేదు.
ఏదీ రీప్లేస్ చేయలేదు
ప్రపంచమంతా ఏఐ, రోబోలంటూ పరుగులు తీస్తోంది. కానీ నన్ను కాపాడుతున్న మానవుల ప్రేమను ఏదీ రీప్లేస్ చేయలేదు. వారి కరుణ, ప్రేమ, ఉనికి.. మానవత్వం.. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ఉంది అంటూ తన స్నేహితులను ట్యాగ్ చేసింది. ఓ ఫోటోను కూడా జత చేసింది. అందులో నటి దివ్య దత్త, లారా దత్తా, విద్యా బాలన్, షబానా అజ్మీ, కొంకణ సేన్ శర్మ తదితరులున్నారు.
సినిమా
తనిష్టా చటర్జీ.. రోడ్- మూవీ, దేఖ్ ఇండియన్ సర్కస్, గులాబ్ గ్యాంగ్, సన్‌రైజ్, ఐ లవ్ న్యూఇయర్, పార్చ్‌డ్, డాక్టర్ రక్మంభాయి, ఝల్కి, జోరమ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. బీబర్ అనే బెంగాలీ మూవీ, బ్రిక్ లేన్ అనే హాలీవుడ్ చిత్రంలోనూ యాక్ట్ చేసింది. చివరగా ద స్టోరీటెల్లర్ చిత్రంలో కనిపించింది. ఓటీటీలో కార్టెల్, మోడ్రన్ లవ్ ముంబై, స్కూప్ సిరీస్‌లలో మెరిసింది.
చదవండి: ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్