తమిళ నటుడు ఆరవ్ (Aarav) నిర్మాతగా మారారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ కాదల్ కణ్మణి చిత్రం ద్వారా ఆరవ్ నటుడిగా పరిచయం అయ్యారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఆ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు మిత్రుడిగా నటించారు. ఆ తరువాత సైతాన్, విడాముయర్చి (పట్టుదల) వంటి కొన్ని చిత్రాల్లో నటించిన ఈయన మార్కెట్ రాజా, ఎంబీబీఎస్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని మరింత పాపులర్ అయిన ఆరవ్ ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. ఆరవ్ స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
దీని గురించి తెలియజేస్తూ.. పలు ఏళ్లుగా ప్రేక్షకుల ప్రేమ, అంగీకారం లభించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. అందమైన సినీ పరిశ్రమలో తననూ ఒక భాగంగా మార్చిందన్నారు. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడానికి ఆరవ్ స్టూడియోస్ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. మంచి కథలను చెప్పాలనే తపన, ఆసక్తి నుంచి ఈ సంస్థ పుట్టిందన్నారు. ఈ విజువల్స్, క్రియేటివ్ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ చెప్పని సహజమైన కథలతో చిత్రాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. భగవంతుడి ఆశీస్సులు, సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి కథా చిత్రాలను నిర్మిస్తాననే నమ్మకంతో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆరవ్ తెలిపారు.
చదవండి: మహేశ్‌తో సందీప్ సినిమా?


