
బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. విజయవాడలో పుట్టిపెరిగిన తమన్నా..తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆ షో ద్వారానే యాంకర్ శ్రీముఖితో స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతుంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో తమన్నా కూడా ఉంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో రెండు వారాలు మాత్రమే కలిసి ఉన్న వీరిద్దరి మధ్య అంత స్నేహం ఎలా ఏర్పడింది? నా నిజాయితీకీ శ్రీముఖి ఫిదా అయిందని అంటోంది తమన్నా. తన జీవితంలో శ్రీముఖి లాంటి ఫ్రెండ్‌ని చూడలేదని, ఆమెలో తన కూతురిని చూసుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీముఖి తనకు చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చింది.
అందుకే నాతో స్నేహం
శ్రీముఖి ఎదుటివాళ్లను చదివేస్తుంది. వాళ్లు ఎలాంటివాళ్లు? పైకి ఎలా మాట్లాడతారు? లోపల ఎలా ఉంటారు? ఇవన్నీ ఈజీగా పసిగట్టగలదు. బిగ్‌బాస్ హౌస్‌లో మేం రెండు వారాలే కలిసి ఉన్నాం. నాలో ఉన్న నిజాయితీని మెచ్చి శ్రీముఖి స్నేహం చేసింది. ‘తమన్నా నమ్మితే.. ప్రాణాలను సైతం ఇస్తుంది’ అని తెలుసుకొని నాకు క్లోజ్ అయింది. నేను అంటే ఆమెకు చాలా నమ్మకం. శ్రీముఖి తల్లి నన్ను సొంత చెల్లిలా చూసుకుంటుంది. శ్రీముఖి, ఆమె తమ్ముడు ఇద్దరూ నాకు పిల్లలు లేని లోటు తీర్చారు. వారిద్దరు నా పిల్లలే అనుకుంటాను.
శ్రీముఖి దత్తత తీసుకుంది
నా బంధువులు, రక్త సంబంధీకులు అంతా దూరం పెడితే.. శ్రీముఖి నన్ను తన ఫ్యామిలీ మనిషిలా చూసుకుంది. నేను ఏ టైంలో ఏం ఆలోచిస్తాను? ఎం తినాలనుకుంటాను? ఇవన్నీ తెలుసుకొని తెప్పిస్తుంది. ఇలా ఎవరు అడుగుతారు? ఒకరకంగా చెప్పాలంటే నన్ను శ్రీముఖి దత్తత తీసుకుంది. కరోనా తర్వాత అన్ని షోస్ ఆగిపోయాయి. డబ్లుల్లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది.
శ్రీముఖి ఫోన్ చేసి..‘విజయవాడలో ఒంటరిగా ఏం చేస్తావు? హైదరాబాద్కి వచ్చేయ్. నేను సంపాదిస్తున్నాను కదా. నిన్ను చూసుకుంటాలే’ అని చెప్పింది. నా బర్త్డేని గ్రాండ్గా సెలెబ్రేట్ చేసింది. ఇల్లు కట్టుకుంటున్నా అంటే ఆర్థిక సహాయం చేసింది. ఈ విషయం బయటకు చెపొద్దు అంటూ ఇంటి కోసం కొంత డబ్బు ఇచ్చింది. నాకే కాదు ఇలాంటి సహాయం చాలా మందికి చేసింది. బయటకు చెప్పుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు. దటీజ్ శ్రీముఖి. ఆమె ఏంటో ఫ్రెండ్ సర్కిల్‌కి మాత్రమే తెలుసు’అంటూ తమన్నా ఎమోషనల్ అయింది.