హీరోగా పరిచయం అవుతున్న 'సై' ఫేం శ్రవణ్

‘సై, దూకుడు, శ్రీమంతుడు, బిందాస్, మగధీర, ఏక్ నిరంజన్’ తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఎదురీత’. బాలమురుగన్ దర్శకత్వం వహించారు. లియోనా లిషోయ్ హీరోయిన్‌గా నటించారు. బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కుమారుడిపై ఉన్న ప్రేమ ఎన్ని సమస్యలు తీసుకువచ్చింది అనేది మా సినిమా కథాంశం. ప్రతి తండ్రి, ప్రతి కుమారుడి హృదయాన్ని హత్తుకునేలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా సెన్సార్ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేసి, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.