
– ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి ముసాలియా
‘‘సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి, మసాయి మారా తాలూకు విశాలమైన మైదానం... ఇలా కెన్యాలోని ప్రకృతి అందాలు 120 దేశాల్లో విడుదల కానున్న ప్రతిష్ఠాత్మక చిత్రంలో కనువిందు చేయనున్నందుకు హ్యాపీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ (వంద కోట్లు)కి పైగా ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువ అవుతుందనే అంచనాలు ఉన్నాయి’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి ముసాలియా డబ్లు్య ముడవాడి.
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూ పొందుతున్న భారీ చిత్రం గురించే ముసాలియా ఈ విధంగా పేర్కొన్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ షూటింగ్‌ని ఎక్కువ శాతం కెన్యాలో చిత్రీకరించాలని రాజమౌళి అనుకున్నారట. టీమ్‌తో కలిసి అక్కడి లొకేషన్స్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ముసాలియాని కలిశారు రాజమౌళి. ఆ ఫొటోలను ముసాలియా తన ‘ఎక్స్’లో షేర్ చేసి, అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ‘‘ప్రపంచంలోని గొప్ప ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరైన రాజమౌళి సినిమా కోసం కెన్యా ఓ వేదిక అయింది.
మంచి విజన్ ఉన్న గొప్ప భారతీయ దర్శకుడు ఆయన. చక్కని స్క్రీన్‌ప్లే రైటర్, కథకుడు కూడా. ఆయన కథలు ఖండాంతర ప్రేక్షకుల ఊహలను ఆవిష్కరించాయి. రెండు దశాబ్దాల కెరీర్‌లో రాజమౌళి శక్తిమంతమైన కథనాలు, దృశ్యాలు, సాంస్కృతికతలను తన కథల్లో చొప్పించారు. 120 మందితో కూడిన ఆయన టీమ్ ఈస్ట్ ఆఫ్రికాలో విస్తృతంగా పర్యటించాక కెన్యాని ఎంచుకుంది. ప్రాథమిక చిత్రీకరణకు గమ్యస్థానంగా మా దేశాన్ని ఎంచుకోవడం ఇక్కడి అందం, ఆతిథ్యం గురించి ప్రపంచ వేదికకు చెప్పినట్లుగా భావిస్తున్నాం.
‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి29’ (వర్కింగ్ టైటిల్) సినిమా లెన్స్ ద్వారా మా దేశాన్ని చూపించనుండటం కెన్యాకి గర్వకారణం’’ అని ముసాలియా డబ్లు్య ముడవాడి పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో గ్లోబల్ రేంజ్‌లో కేఎల్ నారాయణ ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి29’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చో్ప్రాఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇంకా పలువురు భారతీయ నటీనటులతో పాటు హాలీవుడ్ నటీనటులు నటించనున్నారు. అలాగే హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెద్ద అప్‌డేట్‌ని నవంబరులో ఇవ్వనున్నామని ఇటీవల మహేశ్‌బాబు బర్త్‌డే (ఆగస్ట్ 9) సందర్భంగా రాజమౌళి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.