‘సింగ్‌ గీతం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Sing Geetham Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘సింగ్‌ గీతం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Jun 12 2026 2:29 PM | Updated on Jun 12 2026 3:31 PM

Sing Geetham Movie Review And Rating In Telugu

టైటిల్‌: సింగ్‌ గీతం
నటీనటులు: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ త‌దిత‌రులు
నిర్మాణ సంస్థ: వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమా
నిర్మాత: నాగ్‌ అశ్విన్‌
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
విడుదల తేది: జూన్‌ 12, 2026

ట్రెండ్‌కి భిన్నంగా ఆలోచించే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అన్ని జానర్లో సినిమా తీయడమేకాదు.. అందులో కొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. ఆదిత్య 369, విచిత్ర సోదరులు, భైరవద్వీపం, మైఖెల్ మ‌ద‌న కామ రాజు.. ఇలా అప్పట్లోనే ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించాడు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్‌ చేతపట్టి ‘సింగ్‌ గీతం’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా మరో కొత్త ప్రయోగమే. మాటలనే పాటగా మార్చి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మరి 94 ఏళ్లు యువకుడు తీసిన చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
కుబేర పురం అనే ఒక ఫిక్షనల్‌ విలేజ్‌ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. ఆ ఊరంతా బంగారమే ఉంటుంది. దాన్ని దోచుకోవడానికి రేణూ (షాలిని కొండేపూడి), ఆమె తండ్రి మైగింగ్‌ సాగిస్తుంటారు. ఆ మైనింగ్‌ను ఓ విధేశీ వ్యాపారాస్తుడికి అమ్మేయడానికి ప్లాన్‌ చేస్తారు. అదే సమయంలో త‌న తండ్రి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన భూములు అక్క‌డ ఉన్నాయ‌ని  తెలుసుకుని వ‌స్తాడు ప్ర‌తాప్ (అయాన్‌) ఆ ఊరికి వస్తాడు. తన భూమిలో బంగారు గ‌నులున్నాయని తెలుసుకొని రేణూతో చేతులు కలుపుతాడు. బంగారాన్ని దోచుకోవడానికి ఆ ఊర్లో ఉన్న ఆఖరి చెట్టుని కూడా నరికేస్తారు. ఆ చెట్టుని తన తల్లిలా భావించి గౌరి(అహల్య) వద్దని అడ్డుకున్నా ఆ చెట్టుని తొలగిస్తారు. దీంతో ఆ ఊరి దేవుడు కుబేరుడికి కోపం వ‌స్తుంది. ఆ ఊరికి ఓ శాపం ఇస్తాడు. ఎవ‌రి నోట్లోంచి మాటే రాదు. కేవ‌లం పాట మాత్ర‌మే వ‌స్తుంది. ఏం మాట్లాడాల‌న్నా పాట రూపంలోనే మాట్లాడుకోవాల్సివ‌స్తుంది. అంతేకాదు నిజాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. మరి ఈ పాటల వల్ల, వాళ్లు చెబుతున్న నిజాల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
మాటలు లేకుండా పాటలతో సినిమా చేయడం.. వినడానికి ఇప్పటికీ విచిత్రంగా ఉంది కదా? కానీ 40 ఏళ్ల కిందటే సింగీత శ్రీనివాసరావు ఈ ఆలోచన చేశాడు. ఇలాంటివి పేపర్‌పై రాసుకోవడానికి బాగుంటాయి. కానీ ఆచరణలో పెట్టడమే చాలా కష్టం. ప్రతి మాట.. ఎమోషన్‌ని పాట రూపంలో చెప్పడం అంత ఈజీ కాదు. కానీ సింగీతం అది చేసి చూపించాడు. 40 ఏళ్ల కింద రాసుకున్న కథ అయినప్పటికీ..నేటికీ నవ్యత లోపించలేదు. నేటితరానికి ఇవ్వాల్సిన మంచి సందేశం ఈ కథలో ఉంది. ప్రకృతి ఎంత గొప్పదో చెబుతూనే.. మనిషి అత్యాశతో పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో ఇందులో చూపించాడు. 

అయితే ఈ సినిమా మొత్తం పాటలే ఉన్నాయా? మాటలు లేవా? అంటే ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి తొలి 20 నిమిషాలు మూములుగానే కథనం సాగుతుంది. సాధారణ సినిమాల్లోలాగే మాటలు ఉంటాయి. ప్రతాప్‌ కుబేర‌పురం రావడం.. ఆ ఊరి ప్రజల పరిచయం.. మైనింగ్‌ మాఫియా నేపథ్యం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఎప్పుడైనే ఊరికి శాపం తగులుతుందో అప్పటి నుంచి మాటలు కాస్త పాటలుగా మారుతాయి.

‘ఏమయ్యింది.. ఏమ‌య్యింది..’ అంటూ ఊరంతా పాడుకోవ‌డం నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. పాట వరకు సరదాగే సాగినా.. ఆ తర్వాత మాటలు కూడా పాటలుగా రావడం బోరింగ్‌గా అనిపిస్తుంది. దానికి తోడు ఆయా సన్నివేశాలన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప ఎక్కడ సహజంగా అనిపించదు. ఇంటర్వెల్‌ వరకు ఇలానే సాగుతుంది. ఇక సెండాఫ్‌లో మాత్రం దర్శకుడు కథపై ఫోకస్‌ పెట్టాడు. ద్వితియార్థంలో బలమైన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ప్రతాప్‌ మారిపోవడం.. ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకోవడం, ఈ తర్వాత నడిచే డ్రామా ఆకట్టుకుంటుంది. ప్రీక్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు సింగీతం మరోసారి తన మార్క్‌ చూపించాడు. ఇక చివరిలో విజయ్‌ దేవరొకండ ఎంట్రీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. పార్ట్‌ 2 ఉంటుందన్నట్లుగా విజయ్‌ ఈ గెస్ట్ ఎప్పీరియ‌న్స్ ఉంది. మరి సీక్వెల్‌ ఉంటుందా లేదా? అనేది చూడాలి. 

ఎవరెలా చేశారంటే..
సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినవారంతా కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. చెట్టులో తల్లిని చూసుకునే గౌరి పాత్రలో అహల్య ఒదిగిపోయింది. అయితే ఆమె డబ్బింగ్‌ మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉండే ప్రతాప్‌ పాత్రలో అయాన్‌, రేణూ పాత్రలో షాలిని తమదైన సహజ నటనతో మెప్పించారు. రాహుల్ ర‌వీంద్ర‌న్‌, నివేదా పేతురాజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు వాళ్ల పాత్రలే చాలా కీలకం. సీనియర్‌ నటి తులసికి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. అతిథి పాత్రలు చేసిన అనుదీప్‌, విజయ్‌ దేవరకొండతో పాటు మిగిలినవారు కూడా తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా మొత్తం పాటలే ఉంటాయి. మాటలను కూడా పాటలుగా ట్యూన్‌  చేసిన తీరు బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆయన కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ చిత్రంగా నిలుస్తుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బాగోలేదు. ఊరుతో పాటు సినిమాలో వేసిన ప్రతి సెట్‌.. ఆర్టిఫియల్‌గానే కనిపిస్తాయి తప్ప..ఎక్కడ కూడా సహజంగా కనిపించవు. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Rating:
Advertisement
 
Advertisement
Advertisement