
కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రుతిహాసన్కు తొలి విజయం దక్కింది టాలీవుడ్లోనే. తెలుగులో తన మూడో చిత్రంగా వచ్చిన 'గబ్బర్ సింగ్' ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. అయితే, ఈ సినిమాకు ముందు అమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడింది. ఛాన్సులు రావేమో అనుకుంటున్న సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ నుంచి పిలుపు రావడం ఆపై భారీ హిట్ అందుకోవడం జరిగిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనను ఐరన్ లెగ్ అని మాట్లాడిన వారందరూ ఆ సమయంలో ఒక విషయాన్ని గుర్తించలేదని శ్రుతిహాసన్ చెప్పారు.
'తెలుగు పరిశ్రమలో నేను నటించిన మొదటి రెండు చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో నాపై ఐరన్ లెగ్ ట్యాగ్ వేశారు. కానీ, ఆ రెండు చిత్రాల్లో నేను నటించింది ఒకే హీరోతోనే అనే విషయాన్ని అప్పుడు ప్రజలు గుర్తించలేదు. నన్ను మాత్రం ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలాంటప్పుడు ఐరన్ లెగ్ అని హెళన చేయడం ఎందుకు..? నావి ఐరన్ లెగ్స్, గోల్డెన్ లెగ్స్ కాదు... నా కాళ్లు నాకు వదిలేయండి. అలా ఎవరినీ హెళన చేస్తూ విమర్శలు చేయకండి' అంటూ శ్రుతిహాసన్ పేర్కొంది.
శ్రుతిహాసన్ తెలుగులో వరుసగా 'సిద్ధార్థ్'తో అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో నటించారు. అయితే, అవి భారీ డిజాస్టర్గా మిగిలిపోయాయి. ఆ తర్వాతి ఏడాదిలోనే గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి ఆమె లైఫ్ మారిపోయింది. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్, రజనీకాంత్ సినిమా 'కూలీ'లో శ్రుతిహాసన్ కీలకపాత్రలో కనిపించనుంది. ఆగస్ట్ 14న విడుదల కానున్న ఈ చిత్రంపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు.