పనివాళ్లు మనుషులు కారా? వాళ్లకు హెయిర్ కట్ చేస్తే సొమ్మేమైనా అరిగిపోతుందా? అని మండిపడుతోంది బాలీవుడ్ నటి సంధ్య మృదుల్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. నటి తల్లి తన ఇంట్లో పని చేసే ఓ యువతిని సెలూన్‌కు తీసుకెళ్లి జుట్టు కట్ చేయించాలనుకుంది. కానీ అందుకు ఒకటీరెండు సెలూన్లు అసలు అంగీకరించనేలేదట! డబ్బులు ఎక్కువిస్తామన్నా సరే ససేమీరా కుదరదని తేల్చి చెప్పేశాయట!
బెదిరించినా, బతిమాలినా..
ఈ విషయం విని సంధ్యకు ఒళ్లు మండిపోయింది. ఆ ఆక్రోశాన్నే తను సామాజిక మాధ్యమాల్లో వెళ్లగక్కింది. 'అమ్మ.. తన ఇంట్లో పనిమనిషికి మంచి హెయిర్ కట్ చేయించాలనుకుంది. దగ్గర్లో ఒక సెలూన్‌కు తీసుకెళ్లింది. కానీ వాళ్లు చేయమన్నారు. మరో సెలూన్‌కు వెళ్లగా వాళ్ల దగ్గరా అదే సమాధానం. ఎందుకు చేయరని ప్రశ్నించింది. కావాలంటే ఎక్కువ డబ్బులిస్తానని అభ్యర్థించింది. అయినప్పటికీ వాళ్లు కుదరదని వెనక్కు పంపించేశారు.
ఇంకా ఏ కాలంలో ఉన్నాం?
ఇదంతా చూసి ఆ పనిమనిషి మనసు నొచ్చుకుంది. చివరకు ఒక సెలూన్ వాళ్లు ఒప్పుకోవడంతో ఆమెకు హెయిర్ కట్ చేయించి తనను అమ్మ లంచ్‌కు తీసుకెళ్లింది. అసలు మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? పనివాళ్లు సెలూన్స్‌కు రాకూడదా? వాళ్లేమైనా అంటరానివాళ్లా? వాళ్లను లోపలకు రానివ్వకపోవడానికి వీరికేం హక్కుంది? నిజంగా ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇక్కడ తప్పు కేవలం సెలూన్లది, అందులో పనిచేసేవారిదే కాదు.. మనది కూడా!
ఇకనైనా మారండి
మనలో చాలామంది పనివాళ్లను అన్నిచోట్లా అడుగుపెట్టనివ్వరు, కనీసం లిఫ్ట్ కూడా ఎక్కనివ్వరు. ఇలాంటి నీచమైన కండీషన్స్ పెట్టే మనుషులు మారాల్సిన సమయం ఆసన్నమైందని నా అభిప్రాయం' అని ఆవేదన వ్యక్తం చేసింది. 'పనివాళ్లు మన ఇంటిని, మన కుటుంబాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటివారికి మనమిచ్చే గౌరవం ఇదా? హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్న 26 ఏళ్ల అమ్మాయిని ఇంత బాధపెట్టాలా? అని క్యాప్షన్ ఇచ్చింది. సంధ్య చివరగా తమిళంలో 'పరాశక్తి' సినిమాలో ఇందిరా గాంధీగా నటించింది.


