
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ నెల 18న ఓటీటీకి వచ్చిన ఈ సిరీస్ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ వెబ్ సిరీస్‌లో తనను తప్పుగా చూపించారంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సిరీస్లోని ఓ ఎపిసోడ్లో ఆర్యన్‌ను డ్రగ్ కేసులో అరెస్టు చేసిన అధికారి సమీర్ వాంఖడేతో పోలిక ఉందని నెటిజన్లు కామెంట్స్ చేయడంతో ఈ వివాదానికి దారితీసింది.
దీంతో తనను ఉద్దేశపూర్వకంగానే తప్పుగా చూపించారని మాజీ అధికారి సమీర్ వాంఖడే ఆరోపిస్తూ.. షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో పాటు నెట్‌ఫ్లిక్స్‌పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రెండు కోట్ల రూపాయల పరిహారం కోరుతూ పిటిషన్ వేశారు. ఇందులో తనపై దురుద్దేశంతోనే తప్పుగా చిత్రీకరించారని సమీర్ వాంఖడే ఆరోపించారు. ఇలాంటి వాటితో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ రూ. 2 కోట్ల పరిహారాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని పిటిషన్లో ప్రతిపాదించారు.
కాగా.. గతంలో సమీర్ వాంఖడే ముంబై తీరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ను అరెస్టు చేశారు. ఆ సమయంలో సమీర్ వాంఖడే ఈ కేసును డీల్ చేశారు. ఈ కేసులో ఆర్యన్ను దాదాపు నెల రోజులు జైలులో ఉంచారు. ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఆ తర్వాత 2023లో ఈ కేసులో ఉన్న వారి నుంచి రూ.25 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Sameer Wankhede, former NCB Mumbai zonal director, has filed a defamation suit in the Delhi High Court against Red Chillies Entertainment Pvt. Ltd., owned by actor Shah Rukh Khan and Gauri Khan, global streaming platform Netflix, and others. He alleges that their series “Ba**ds…
— ANI (@ANI) September 25, 2025