Sakshi Special Interview With Acharya Team Chiranjeevi, Koratala Siva - Sakshi
Sakshi News home page

Chiranjeevi: ఆచార్యలో ఫస్టాఫ్‌ హీరో నేను, సెకండాఫ్‌ హీరో చరణ్‌

Published Sun, Apr 24 2022 8:14 AM

Sakshi Special Interview With Acharya Team Chiranjeevi, Koratala Shiva

చిరంజీవి ఇంకా అర్ధాకలితోనే ఉన్నారు.. ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు ఉన్న సెలబ్రిటీకి ఆకలా? మెత్తటి పరుపులు ఉన్న స్టార్‌కి నిద్ర లేని రాత్రులా? ఎందుకు? నటన మీద ఉన్న ఆకలి అది.. వృత్తి మీద ఉన్న ప్రేమ అది.. అందుకే మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు మెగాస్టార్‌. ‘ఆచార్య’ రిలీజ్‌ సందర్భంగా ‘సాక్షి’కి చిరంజీవి ఇచ్చిన ‘ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ’ విశేషాలు.

► ‘ఆచార్య’ మీ సినిమాలా ఉంటుందా? లేక మీ చెర్రీ (రామ్‌చరణ్‌) సినిమాలానా?
చిరంజీవి: నాలానో, రామ్‌చరణ్‌లానో ఉండదు.. కొరటాల శివగారి సినిమాలా ఉంటుంది. ఓ మంచి సందేశాత్మక కథకు మాస్‌ కమర్షియల్‌ అంశాలన్నీ కలిపి ప్రేక్షకుల మన్ననలు పొందేలా తన స్టైల్‌లో తీశారు. ఒక వైవిధ్యమైన నేపథ్యానికి సమకాలీన విషయాలను తీసుకున్నారాయన. నేను, చరణ్‌ ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి మా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవి పూర్తిగా ఇచ్చే ప్రయత్నం చేశారు శివగారు. ఆయన్నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలు కూడా ఉంటాయి.

► 150 సినిమాలకు పైగా చేసిన మీరు ఎన్నో కథలు విన్నారు. ఇప్పుడు ‘ఆచార్య’ కథ విన్నప్పుడు ఏమనిపించింది?
ఎవరైనా కథ వింటారు. కానీ, నేను కథను వినను.. చూస్తాను. అంటే.. ఇలా ఉంటుంది అని విజువలైజ్‌ చేసుకుంటాను. అలా కథని చూస్తున్నప్పుడు మనసుని, ఎమోషన్స్‌ని టచ్‌ చేస్తే చాలు.. వెంటనే ఓకే చెప్పేస్తాను. నా సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలన్నీ కథ విన్నప్పుడే ఓకే చెప్పినవి తప్ప రెండు మూడుసార్లు విని, రికార్డు చేసుకుని మళ్లీ అవగాహన చేసుకుని ఓకే చెప్పలేదు. స్పాంటేనియస్‌గా నా మనసు స్పందిస్తే వెంటనే ‘యస్‌’ చెప్పేస్తాను. ‘ఆచార్య’కి నాకు, కొరటాలకి మధ్య ఒకే ఒక మీటింగ్‌ జరిగింది. కథ వినగానే మంచి అనుభూతి వచ్చింది.. చేద్దామని చెప్పాను.

► ఈ సినిమాలో మీరు, చరణ్‌ ఉండటం డబుల్‌ ధమాకా. మీ ఇద్దరి పాత్రలనూ దర్శకుడు బ్యాలెన్స్‌ చేయగలిగారా?
మా ఇద్దర్నీ బ్యాలెన్స్‌ చేయడం కోసం శివ గారు ఏమీ చేయలేదు. కథకు అనుకూలంగానే మా పాత్రలు మలిచారు. అంతేకానీ బ్యాలెన్స్‌ గురించి ఆలోచించలేదు.

► నిజానికి చరణ్‌ది చిన్న పాత్ర అనీ, ఆ తర్వాత పెంచారనీ వార్తలు వచ్చాయి.. మరి నిజమేంటి?
చరణ్‌ది చిన్న పాత్ర అని ఎందుకు అనుకున్నారో తెలియదు. కానీ ఫస్ట్‌ నుంచీ తనది ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టరే.. తర్వాత పెంచలేదు. చెప్పాలంటే ఫస్టాఫ్‌ హీరో నేను.. సెకండాఫ్‌ హీరో చరణ్‌. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇచ్చే ఫినిషింగ్‌ హృద్యంగా ఉంటుంది.. గుండె కదిలేలా ఉంటుంది. నేనీ సినిమాకి ‘యస్‌’ చెప్పడానికి అదే ప్రధాన కారణం. అది క్లయిమాక్స్‌కి ముందు చూస్తారు. సెకండాఫ్‌లో 50 శాతం చరణ్‌ ఉంటాడు.. మిగతా 50 శాతం ఇద్దరం కలిసి ఉంటాం. అందుకే డబుల్‌ ధమాకా అనేది కరెక్ట్‌ మాట.

► ‘భలే భలే బంజారా..’ పాటలో ‘తగ్గు...’ అని చరణ్‌ని అన్నారు?
ఇప్పుడందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ యుఫోరియాలో ఉన్నారు. ‘నాటు నాటు’ పాటలో కుర్రాళ్లు (రామ్‌చరణ్‌–ఎన్టీఆర్‌) వీరకొట్టుడు కొట్టేశారు.. ‘ఓ మై గాడ్‌’ అనిపిస్తుంది. అందుకని ‘ఆచార్య’లోనూ చరణ్‌ నుంచి డ్యాన్స్‌లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారని, ఆ రకంగా చరణ్‌ ఉంటే నేను తేలిపోతానని తగ్గు అన్నాను (నవ్వుతూ). ‘నేను ఎంత ప్రయత్నించినా ఆ స్టైల్, మూమెంట్స్‌తో మీరు కొట్టేస్తారు డాడీ’ అని చరణ్‌ అన్నాడు.

► ‘ఆచార్య’లో ఇటు భక్తి అటు నక్సలిజమ్‌ని ఎలా మ్యాచ్‌ చేయగలిగారు?
అదే శివ మ్యాజిక్‌. ఆయన మ్యాజిక్‌తో ‘ఆచార్య’ని అద్భుతంగా మలిచారు. మా సినిమా డ్రమటిక్‌ డైలాగ్స్‌తో ఫుల్‌ మాస్‌లా ఉండొచ్చు కానీ ఆయనలా కూడా... అంటే నిండు గోదావరిలో హాయిగా పడవ ప్రయాణంలా ఉంటుంది. కానీ నది కింద కరెంటు హెవీగా ఉంటుంది. ఆ కరెంట్‌ అన్నది ఈ సినిమాలో కమర్షియల్‌గా కనిపిస్తుంది.

► ‘భలే భలే బంజారా..’ పాట తీస్తున్నప్పుడు మీ అమ్మ (అంజనాదేవి), చరణ్‌ అమ్మ (సురేఖ) సెట్స్‌లో ఉన్నారు. మీ సతీమణిని ఇంప్రెస్‌ చేయాలని స్టెప్పులు వేశారా? లేక మీ అమ్మగారిని ఆనందపరచాలనా?
తమ బిడ్డలు బాగా చేశారనిపించుకోవాలనే అందమైన పోటీ ప్రతి తల్లి ప్రేమలో ఉంటుంది. మా అబ్బాయి బాగా చేశాడని మా అమ్మ అంటే.. లేదు మా అబ్బాయే బాగా చేశాడని సురేఖ.. ఇలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరి ప్రెజెన్స్‌లో మేమిద్దరం షూటింగ్‌ చేయడం అనేది మాకు మంచి అనుభూతి.

► మామూలుగా రాజమౌళి తనతో సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోలు వేరే సినిమా చేసేందుకు ఒప్పుకోరు.. మరి ఒకవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్న చరణ్‌కి ‘ఆచార్య’ చేయడానికి అనుమతి ఎలా లభించింది?
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రారంభమైనప్పుడే ‘ఆచార్య’ కూడా దాదాపు ప్రారంభమైంది. ముందు నా పాత్ర, ఇతర సన్నివేశాలన్నీ పూర్తి చే సి, క్లైమాక్స్‌ తీసేటప్పుడు చరణ్‌ వస్తే సరిపోతుందని కొరటాల అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో వైవిధ్యమైన గెటప్పులు ఉన్నాయి కాబట్టి మధ్యలో చరణ్‌ని బయటికి వదల్లేను అని రాజమౌళి అన్నారు. కానీ కరోనా వల్ల, షూటింగ్‌కి ఎక్కువ సమయం పట్టడం వల్ల రాజమౌళి ఒక్కటి ఆలోచించారు.

‘‘ఆచార్య’లోని సిద్ధ పాత్రను ఏ హీరో అయినా చేయొచ్చేమో కానీ నువ్వు (రామ్‌చరణ్‌) చేస్తే వచ్చే అందం, నిండుదనం వేరుగా ఉంటాయి. పైగా కొరటాలగారు కూడా అడిగారు కాబట్టి నువ్వు ‘ఆచార్య’ చెయ్‌. నేను అడ్జెస్ట్‌ చేసుకుంటాను’’ అన్నారు రాజమౌళి. సిద్ధ పాత్ర చరణ్‌ చేస్తేనే అందం వస్తుంది.. తనే ఎందుకు చేయాలి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ పాత్రలో ఇంకో హీరోని ఊహించుకోలేం. అంటే నటన పరంగా కాదు... మాకున్న బంధం పరంగా కూడా ఆ సినిమా చేయాలి.

► బంధం అంటున్నారంటే సినిమాలోనూ తండ్రీకొడుకులుగా కనిపిస్తారా?
ఈ సినిమాలో మాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు. కానీ, ఆ అనుభూతి వస్తుంది. అదే కొరటాల మ్యాజిక్‌. ‘ఆచార్య’లో నేను కానీ, చరణ్‌ కానీ.. ఏ ఒక్కరు లేకున్నా వర్కవుట్‌ కాదు.

► కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుసగా నాలుగైదు సినిమాలు చేసినట్లు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది?
(నవ్వేస్తూ)... ఎనర్జీ అనేది ప్యాషన్‌ నుంచి వస్తుంది. నా నరనరాల్లో, అణువణువు సినిమా పట్ల ప్యాషన్‌ ఉంది. ఆ ఇష్టం జీవితకాలం ఉంటుంది.. అది మధ్యలో పోయేది కాదు. నేను ఎప్పుడు మేకప్‌ వేసుకున్నా, కెమెరా ముందు నిలబడినా, నా ముఖంపై ఆ లైట్లు పడినా ఎనర్జీ అనేది అలా పెల్లుబికి వస్తుంది.

► ఈ మధ్య బ్యాక్‌ టు బ్యాక్‌ షూటింగ్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంటున్నారు.. పైగా దాదాపు 40 గంటలు నిద్ర లేకుండా షూటింగ్‌ చేశారట..
యస్‌... ఈ మధ్య ఓ రెండు సినిమాల షూటింగ్‌ని వెంట వెంటనే చేశాను. ముంబైలో సల్మాన్‌ ఖాన్‌తో ‘లూసిఫర్‌’ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌లో పాల్గొని, మరో సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాను. ‘గాడ్‌ ఫాదర్‌’కి ఒక మేకోవర్, ఇంకో సినిమాకి ఇంకో మేకోవర్‌. పుణె నుంచి వచ్చీ రాగానే ఈ సినిమాకి తగ్గట్టుగా రెడీ అయ్యాను.. షూటింగ్‌కి వెళుతూ ‘అమ్మా.. వెళ్లొస్తాను’ అని అమ్మకు చెప్పాను. ‘ఎందుకు నాన్నా... ఇంత కష్టపడతావు?’ అని అమ్మ అన్నారు.

ఒకప్పుడు  నేను బ్యాక్‌ టు బ్యాక్‌ షూటింగ్‌ చేస్తే.. ‘ఇంత కష్టపడాలా?’ అని అమ్మ అనేవారు. ‘అమ్మా.. ఇంత కష్టపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? కష్టపడాలనే మనస్తత్వం ఉన్నా కూడా మనకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కావాలి కదమ్మా’ అనేవాడిని. ఇప్పుడు కూడా అంతే  కష్టపడుతున్నానని ఆమె ఫీలింగ్‌. ఇప్పుడు అమ్మతో ‘యంగ్‌స్టర్స్‌తో పోటీ పడేలా నాకు వెంట వెంటనే మంచి సబ్జెక్ట్స్‌ వస్తున్నాయి. ఎంత కష్టపడి చేస్తే నేను అంత హుషారైపోతాను. ద బెస్ట్‌ ఇస్తుంటాను. నీ ఆశీర్వాదాలు కావాలమ్మా నాకు. అయ్యో.. నా బిడ్డ అని జాలి పడకు’ అంటుంటాను.

‘నేను బాధపడితే నీ ఉత్సాహం తగ్గిపోతుంది అంటున్నావు కాబట్టి నీ కోసం అయితే నేను పైకి అనను రా.. కానీ లోపల ఫీల్‌ అవుతాను... జాగ్రత్త నాన్న..’ అని అమ్మ అన్నారు. అమ్మల మనసు అంతే.. ఇక ‘గాడ్‌ఫాదర్‌’ షూటింగ్‌  హుషారుగా చేస్తున్నాను కానీ  నా కళ్లు పొడిబారిపోతున్నాయి. అప్పటికి 40 గంటల్లో నిద్రపోలేదు. ట్రావెలింగ్‌.. షూటింగ్‌తో సరిపోయింది. నా కళ్లు పొడిబారడం చూసి, యూనిట్‌లో అందరికీ గడచిన 40 గంటల్లో నేను నిద్రపోలేదని తెలిసింది.. ఆశ్చర్యపోయారు. అయితే నిద్ర పోతే పోయింది కానీ షూటింగ్‌ తాలూకు ఎంజాయ్‌మెంట్‌ మాత్రం ఫుల్లుగా దక్కింది.

► అమ్మ బాధ చెప్పారు... మరి మీ సతీమణి ఏం అన్నారు?
రేఖ కూడా అమ్మలానే అంటుంది. ‘ఏంటండీ ఇప్పుడూ ఇంత కష్టపడాలా... ఇంత బిజీనా’ అని రేఖ అంటే..  ‘రేఖా... నా నుదుటిపై చెమటి బిందువులు మెరవకపోతే నీ మెడలో ఏదీ మెరవదూ’ అన్నాను (నవ్వులు...).  ఇక అప్పటినుంచి అవి (నగలు) పెట్టుకున్నప్పుడల్లా మీ చెమటను ముట్టుకున్నట్లు ఉంటుంది నాకు’ అని రేఖ అంటుంటుంది. ఈ మధ్య కూడా నగలు పెట్టుకున్నప్పుడు ఇలానే అని నవ్వింది.

► యాక్చువల్లీ కెరీర్‌ ఆరంభంలో అవకాశాలు దక్కకపోతే నిద్రలేని రాత్రులు ఉంటాయి.. అయితే స్టార్‌డమ్‌ వచ్చాక మీ ‘ప్లాటర్‌ ఫుల్‌’ అనే పరిస్థితుల్లోనూ నిద్ర త్యాగం చేసి, సినిమాలు చేస్తున్నారు..
ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం అనే కిక్‌ ఉంది చూశారు... అది మామూలుగా ఉండదు. సినిమాల్లో అవకాశం వస్తే చాలు.. ఏ త్యాగం చేయడానికైనా సిద్ధం అన్నట్లుగా చాలామంది ఉన్నారు. డబ్బులు కూడా వద్దు.. వెండితెరపై మా బొమ్మ పడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. నా అభిప్రాయం ఏంటంటే ‘ప్లాటర్‌ ఫుల్‌’ అయ్యాక కూడా కష్టపడాలనే ఆ ఆకలిని జీవితాంతం ఉంచుకోవాలి. అప్పుడే వందశాతం ఉద్యోగానికి న్యాయం చేసినవాళ్లం అవుతావు. కడుపు నిండిన వ్యవహారంలా జాబ్‌ చేస్తే అన్యాయం చేసినవాళ్లం అవుతాం.

అలా అన్యాయం చేసేవాళ్లకు నేను ఒకే ఒక సలహా ఇస్తా... ‘పని చేయవద్దు. విరమించుకో..’. ఎవరికోసం చేస్తున్నావ్‌. కడుపు నిండిపోయింది. బ్యాంకు బ్యాలెన్స్‌ నిండిపోయింది కదా అని ఒక క్రమశిక్షణ లేకుండా లేట్‌గా రావడంతో పాటు నిర్లక్ష్య వైఖరితో పని చేయడం వల్ల బాగా తీయాలన్న డైరెక్టర్‌ ఉత్సాహం నీరుగారిపోతుంది. అందుకే ఎప్పుడూ అర్ధాకలితోనే ఉండాలి. సినిమా పరంగా, నటన పరంగా వస్తే నేను ఎప్పటికీ అర్ధాకలితోనే ఉంటాను. ‘ఆచార్య’ షూటింగ్‌ అప్పుడు నేను ఒక్కరోజు కూడా సెట్స్‌కు ఆలస్యంగా వెళ్లలేదు.

కొరటాల శివ: ఒకరోజు ‘ఆచార్య’ షూటింగ్‌ని ఉదయం ఎనిమిది గంటలకు సెట్‌ చేశాం. ‘దారిలో ఉన్నాను.. ట్రాఫిక్‌ వల్ల కాస్త లేట్‌ అయ్యేలా ఉంది. వేరే షాట్‌ పెట్టుకుంటారా?’ అని చిరంజీవిగారు ఫోన్‌ చేశారు. అయితే మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ 7 గంటల 45 నిమిషాలకే సెట్స్‌లోకి వచ్చారు
చిరంజీవి: ట్రాఫిక్‌ క్లియర్‌ అయింది... వచ్చేశాను.. (నవ్వులు..)

► షూటింగ్‌ లొకేషన్లో చిన్న ఆర్టిస్టులతో సరదాగా మాట్లాడుతున్నారట... కనీసం మీ ‘కార్‌వ్యాన్‌’లో కూడా కూర్చోవడంలేదట..
యాక్టర్స్‌గా మన కంఫర్ట్‌ కోసం కార్‌వ్యాన్‌ ఉండాలి. ఆ సౌకర్యాలను వినియోగించుకోవాలి. కానీ ఐసొలేట్‌ అయిపోవడానికి వాడకూడదు. షూటింగ్‌ గ్యాప్‌లో మనసు విప్పి మాట్లాడితే తోటివారికి దగ్గర కావొచ్చు. అందరికీ దగ్గర కావడానికి టీ బ్రేక్, భోజన సమయం మంచి అవకాశాలు. షాట్‌ గ్యాప్‌లో ఆర్టిస్టులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సెట్స్‌లో మంచి వాతావరణం ఉంటుంది. జబర్దస్త్‌ యాక్టర్స్‌ నాతో మాట్లాడటానికి కొంచెం సిగ్గు, కొంచెం భయంతో ఉంటారు. కానీ సెట్స్‌లో నేనే వారితో మాట్లాడితే వారి మనసు సంతోషపడుతుంది. అలా సెట్స్‌లో ఒక పాజిటివ్‌ వైబ్‌ రావడానికి  నా వంతు కృషి చేస్తుంటాను.

సెట్స్‌లో మేమంతా ఉత్సాహంగా ఉంటే డైరెక్టర్స్‌కు బాగుంటుంది. అంతేకానీ ఓ ఐదు నిమిషాల షాట్‌ గ్యాప్‌లో కూడా హీరో కార్‌వేన్‌లోకి వెళ్లిపోతే మళ్లీ ఆ హీరో షాట్‌లోకి రావడానికి మరో పది నిమిషాల సమయం పడుతుంది. ఇలా ఒకరోజులో చాలాసార్లు పది నిమిషాలు వృథా అయిపోకూడదు. అదే హీరో అలర్ట్‌గా ఉన్నాడంటే లొకేషన్‌లో అందరూ అలర్ట్‌గా ఉంటారు. చరణ్‌ అయితే సెట్‌లోనే ఓ టెంట్‌ వేసుకుని లొకేషన్‌లో అందరితో కలిసిపోయి ఉంటాడు. ఇంటి వంటకాలను అందరికీ రుచి చూపిస్తాడు. నేను, కొరటాల, తిరు (కెమెరామేన్‌) బ్రేక్‌పాస్ట్‌ అయితే మా ఇంటి నుంచే లాగించేవాళ్లం. తిరు అయితే.. సార్‌.. ఇంతలా టిఫిన్‌ చేస్తే.. నాకు ఫస్ట్‌ షాట్‌కే నిద్ర వస్తుంది అనేవారు (ఫుల్‌ నవ్వులు..) మా సినిమా షూటింగ్‌లు వేడుకల్లా జరుగుతుంటాయి.

► ‘ఆచార్య’లో పాన్‌ ఇండియా స్టార్‌ (చరణ్‌)తో చేశారు.. నిజానికి ఇప్పుడు పాన్‌ ఇండియా అంటున్నారు కానీ..  గతంలో మీరు హిందీలో ‘ఆజ్‌ కా గూండారాజ్‌’ వంటి సినిమాలు చేసి, అప్పట్లోనే పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు కదా.. ఏమంటారు?
అంతేగా.. (నవ్వుతూ). అప్పట్లో నేను హిందీలో చాలా సినిమాలు చేశాను. అయితే ఒకప్పుడు ఇండియాలో తెలుగు అనే ఒక ప్రాంతీయ భాషా సినిమా ఉందని మన పక్కనే ఉన్న ముంబై వాళ్లకు కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమా వచ్చేవరకూ ఆ పరిస్థితి ఉంది. ‘క్లాసిక్‌ సినిమా, అద్భుతంగా ఉంది. ఇది తెలుగు సినిమానా?’ అనుకునేదాకా ‘శంకరాభరణం’ తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా మరుగున పడిపోయింది. 80వ దశకంలో ఎప్పుడు చూసినా సరే మద్రాసు సినిమాలు అనేవారు.. మహా అయితే తమిళ సినిమాల గురించి చెప్పుకునేవారు.

మలయాళ సినిమా వారు అవార్డులు తెచ్చుకున్నారు తప్ప కన్నడ, తెలుగు సినిమాలకు గుర్తింపే లేని రోజులను చూశాను. చాలా బాధపడ్డాను. ఇప్పుడు రాజమౌళి ఈ హద్దులు, సరిహద్దులను చెరిపేశాడు. సినిమాల పరంగా రాజమౌళి తెలుగుకి ఒక గర్వకారణంలా గౌరవం, గుర్తింపు తీసుకొచ్చాడు. అతని మూలంగా తెలుగులో ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలు, కన్నడలో ప్రశాంత్‌ నీల్‌ తీసిన ‘కేజీఎఫ్‌’.. వీటి మూలంగా వాళ్ల అస్తిత్వం చెక్‌ చేసుకునే పరిస్థితిని బాలీవుడ్‌కి కల్పించారు ఈ దర్శకులు. ఆ తర్వాత అందరూ మనవైపు దృష్టి సారించారు. ఇవి ప్రాంతీయ భాషా చిత్రాలు కాదు.. మనమందరం ఇండియన్స్‌.. ఇది ఇండియన్‌ సినిమా అనే కీర్తిని తీసుకొచ్చినందుకు రాజమౌళికి హ్యాట్సాఫ్‌.

► తండ్రీ కొడుకు పోటాపోటీగా నటించి ఉంటారు.. అలాగే ఎక్కువమంది జూనియర్‌ ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు ఎక్కువ టేక్స్‌ తీసుకునే పరిస్థితి ఉండేదేమో..
కొరటాల శివ: టేక్స్‌ అనేవి చిరంజీవి సార్‌కు ఉండవు. ఒక్కోసారి సార్‌ పక్కవారి కోసం మళ్లీ చేస్తారు. ఓ షాట్‌లో ఓ జూనియర్‌ ఆర్టిస్టు తప్పు చేసినా సరే ఓ దర్శకుడిగా నాకు కంగారు వచ్చేది. ఆ జూనియర్‌ ఆర్టిస్టు దగ్గరకు మేము పరిగెత్తాలి. కానీ ఈలోపే చిరంజీవి సార్‌ ఆ ఆర్టిస్టుని దగ్గరకు తీసుకుని ‘నువ్వు ఇలా చేస్తే.. మనం ఇద్దరం సింక్‌లో ఉంటాం’ అని చెప్పేవారు. అంటే.. సార్‌ వారి కోసమే వన్‌ మోర్‌ టేక్‌ చేసే పరిస్థితి. సినిమా పట్ల చిరంజీవిగారికి ఉన్న ప్రేమ అద్భుతం.

చిరంజీవి: ఓ పెద్ద ఫ్రేమ్‌లో మనం ఉన్నప్పుడు ఓ చిన్న తప్పు జరిగినా అది పంటి కింద రాయిలా అనిపిస్తుంది. ‘అయినా.. ఆ చిన్న తప్పును ఎవరు గమనిస్తారండీ.. చాదస్తం’ అని కొందరు అంటారు. కానీ.. ప్రతి ఫ్రేమూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అని డైరెక్టర్లు టేక్‌ ఓకే చెప్పవచ్చు. కానీ హీరోగా నేనే దర్శకుడి ఇబ్బందిని అర్థం చేసుకుని చొరవ తీసుకుని మళ్లీ చేస్తా అంటాను. అప్పుడు డైరెక్టర్స్‌ కూడా హ్యాపీగా ఫీలవుతారు.

► ఏపీలో టికెట్ల ధరల గురించి ఏమంటారు?
టికెట్ల ధరల విషయంపై ప్రభుత్వం స్పష్టమైన గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. ఆ గైడ్‌లైన్స్‌ వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది.  సినిమా బడ్జెట్‌ని బట్టి టికెట్‌ ధరల పెంపుపై వెసులుబాటు అనేది ఉంటుంది. కచ్చితంగా ‘ఆచార్య’ సినిమాకు ఏదో ఒక వెసులుబాటు ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. జగన్‌గారు (ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి) ఏ గైడ్‌లైన్స్‌ అయితే ప్రతిపాదించి జీవోగా ఇచ్చారో దాని ప్రకారం అన్ని రకాల సినిమాలకు న్యాయం జరుగుతుంది. ఆ ప్రకారం ఆయన ఇచ్చిన ప్రోత్సాహానికి మరోసారి ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే.. ఏపీలో 20శాతం షూటింగ్స్‌ చేయాలనే నిబంధనని ప్రభుత్వం పెట్టకముందే మేము మారేడుమిల్లి అడవుల్లో దాదాపు 25 శాతం షూటింగ్‌ చేశాం.

చదవండి 👉 నడిచే నేల, పీల్చే గాలి మీద వారి సంతకం ఉంటుంది, వారి త్యాగాలను మరవద్దు

► భవిష్యత్‌లో రాజకీయాల్లో ఇన్‌వాల్వ్‌ అవుతారని చాలామంది ఆలోచన.. దీనిపై?
అస్సలు ఇన్‌వాల్వ్‌ కాను.. ఆ డౌట్‌ అక్కర్లేదు.

► వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే విషయం గురించి?
సినిమా షూటింగ్‌లకు, సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాలుగా చాలా అనుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన లొకేషన్స్‌ వైజాగ్‌లో ఉన్నాయి. ఎలాగైతే అప్పట్లో చెన్నైలో ఉన్న పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిందో, ఇప్పుడు హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతూనే, సినీ పరిశ్రమకు మరో శాఖగా వైజాగ్‌లో కూడా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫిల్మ్‌ మేకర్స్‌ ఉన్నారు. ఔత్సాహిక కళాకారులు ఉన్నారు. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల సంఖ్య పెరుగుతోంది. ఆర్టిస్టులు అటూ ఇటూ వెళ్తారు. 20 శాతం షూటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లో జరగాలన్న ప్రభుత్వ ప్రతిపాదన మంచి విషయం. దీనివల్ల చాలా మందికి ఉపాధి, ప్రోత్సాహం లభిస్తాయి.

► మీ కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నప్పుడు సెట్స్‌లో ఎలా చేయాలి? అని ఇంట్లో చరణ్, మీరు మాట్లాడుకునేవారా? చరణ్‌కి సలహాలిచ్చారా?
ఇంటికి వెళ్లాక ఇక ఇంట్లో సినిమా అనే మాట వినపడదు. నేనే కాదు.. పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్‌.. సినిమాల గురించి మాట్లాడుకోం. సినిమా అన్నది సెట్స్‌ వరకే. అది మా వృత్తి. దాన్ని మేం ఇంట్లోకి తీసుకురాము. కానీ ఆ సినిమా హిట్‌ అయితే సెలబ్రేషన్స్‌ మాత్రం ఇంట్లో ఉంటాయి. ఇక సలహాలిచ్చే విషయం గురించి చెప్పాలంటే.. నేను ఏ రోజూ ఎవరికీ నటన విషయంలో సలహా ఇవ్వను. సీన్‌లో సింక్‌ కోసం తప్పిస్తే.. ఇలా చేయమని ఎవరికీ సలహా ఇవ్వను. చరణ్‌కు కూడా ఇవ్వను. ఎందుకంటే ఇలా చేయాలని నేను సలహా ఇస్తే వాళ్ల నటన నేను చెప్పినట్లుగా ఉంటుంది కానీ వాళ్లు చేసినట్లుగా ఉండదు. నటన అనేది మన సహజమైన ప్రవర్తన. ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. ఒకరి ఒరిజినాలిటీతో కూడిన ఆర్గానిక్‌ ఫీల్‌ పోకుండా ఉండాలంటే వేరొకరు ఒకరికి నటన పరంగా సలహాలు ఇవ్వకూడదన్నది నా సలహా.

► ‘ఆచార్య’ సినిమాకు మహేశ్‌బాబు వాయిస్‌ ఇవ్వడం గురించి..
ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇండస్ట్రీలో రావాలి. సరే... ఇలాంటి మంచి వాతావరణం కోసం నువ్వు ఏం చేశావ్‌ అని నన్నడిగితే... ‘కొన్ని సినిమాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాను. కొన్ని ఈవెంట్స్‌కు నన్ను అతిథిగా రమ్మన్నప్పుడు వెంటనే అంగీకరించాను. నాకు ఫోన్‌ చేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న ఎస్‌ఎమ్‌ఎస్‌ ఇచ్చినా చాలు. రెస్పాండ్‌ అవుతాను. కొందరు మా ఇంటికే వచ్చి పోస్టర్లు రిలీజ్‌ చేయించుకుంటారు. నాకు టైమ్‌ దొరికితే  హెల్ప్‌ చేస్తాను. ఒక సినిమా గురించి ఇంట్లోనే ఓ బైట్‌ ఇవ్వడం, ఫస్ట్‌ లుక్‌ను లాంచ్‌ చేయడం, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ‘ఓ పిట్టకథ’, రీసెంట్‌గా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌..’ ఇలా చాలా సినిమాల ఫంక్షన్స్‌కు వెళ్లాను. ఇలా ప్రోత్సహించడం నా బాధ్యత అనుకుంటాను. ఏదో రకంగా హెల్ప్‌ చేస్తాను. అందరూ ఫాలో అవుతారని నా ఒపీనియన్‌.

► మీరు ఇండస్ట్రీ పెద్ద అనేది కూడా ఒక టాపిక్‌.. దీని గురించి ఏమంటారు?
‘ఇండస్ట్రీ పెద్ద’ అనే మాటను నేను ఎంటర్‌టైన్‌ చేయను. నేనే కాదు.. ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీ పట్ల తమ వంతు బాధ్యత వహించి తీరాలి. ఇండస్ట్రీ నుంచి ఎంతో కొంత మనం పొందుతున్నప్పుడు ఎంతో కొంత ఇవ్వడం కూడా ఉండాలి. ఇండస్ట్రీకి ఏం వచ్చినా సరే భుజం కాసేలానో, చేయూత ఇచ్చేలానో, ఆపన్నహస్తం అందించేలానో ఉంటాను.. అది నా బాధ్యత. దానికి పెద్ద అనే ఒక పదవి అవసరం లేదు. ఆయా సమయాలు, పరిస్థితులు, ఆయా సెక్టార్‌లను బట్టి ప్రతివారూ ఆ బాధ్యత వహించాలి. అది ఏ ఒక్కరో తీసుకునే బాధ్యత కాదు. నా వంతు బాధ్యతగా ఇండస్ట్రీకి ఏ అవసరం వచ్చినా నేను వందశాతం సపోర్ట్‌ చేస్తా, ముందుకు వస్తాను.

► ఆచార్య గురించి ఫైనల్‌గా..?
అన్ని వర్గాల వారికి నచ్చే పసందైన విందు ‘ఆచార్య’ సినిమా.

– డి.జి. భవాని

చదవండి 👉🏼 ఇండియాకు వచ్చిన విల్‌స్మిత్‌.. అతన్ని కలవడమేనా కారణం ?

‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్‌ డేట్‌.. వచ్చేది అప్పుడే

Advertisement
 
Advertisement
 
Advertisement