Roundup-2021: కరోనా కాటేసినా కోలుకున్న టాలీవుడ్‌.. హిట్‌ మూవీస్‌ ఇవే

Roundup-2021: Special Story On Tollywood Film industry - Sakshi

గత ఏడాది 65 చిత్రాలతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది స్ట్రయిట్, డబ్బింగ్‌తో కలిపి దాదాపు 225 చిత్రాలతో ముగుస్తోంది. ఓటీటీ, కరోనా భయం కారణంగా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? రారా అనే సందేహాల మధ్య 2021 ఆరంభమైంది. అయితే వెండితెర అనుభూతిని పొందాలని కరోనా భయాన్ని పక్కనపెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. 50 శాతం సీటింగ్‌... నైట్‌ కర్ఫ్యూల ప్రభావం వసూళ్లపై పడినా ఆ తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీతో కొన్ని బ్లాక్‌బస్టర్లు ఇండస్ట్రీని మళ్లీ గాడిలో పెట్టాయి. నూతనోత్సాహంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేలా చేశాయి. 2021 రౌండప్‌ చూద్దాం.

2021 జనవరి 1న నాని ‘వి’, రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా..’, ఎమ్మెస్‌ రాజు తెరకెక్కించిన ‘డర్టీహరి’, (2020లో ఇవి ఓటీటీలో విడుదలయ్యాయి) థియేటర్స్‌లోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ నుంచి తేరుకుని అప్పుడప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో అసలు సిసలైన సందడి మొదలైంది మాత్రం సంక్రాంతి పండక్కే. రవితేజ ‘క్రాక్‌’, రామ్‌ ‘రెడ్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్‌’ సంక్రాంతికి విడుదలయ్యాయి. మిగతా రెండు చిత్రాలతో పోల్చితే ఈ సంక్రాంతి సినిమాల్లో ‘క్రాక్‌’ బాక్సాఫీసు దుమ్ము దులిపింది. ఆ తర్వాతి నెలలో వచ్చిన 23 చిత్రాల్లో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టిల తొలి చిత్రం ‘ఉప్పెన’ ఘనవిజయం అందుకుంది.

అలాగే ‘అల్లరి’ నరేశ్‌ ‘నాంది’ కూడా బాక్సాఫీస్‌ దగ్గర భేష్‌ అనిపించుకుంది. మార్చిలో వచ్చిన 20 చిత్రాల్లో శర్వానంద్‌ ‘శ్రీకారం’, శ్రీ విష్ణు ‘గాలి సంపత్‌’, నవీన్‌ పొలిశెట్టి ‘జాతి రత్నాలు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా..’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, ఆది సాయికుమార్‌ ‘శశి’, నితిన్‌ ‘రంగ్‌ దే’, రానా ‘అరణ్య’, శ్రీసింహా ‘తెల్లవారితే గురువారం’ వంటివి ఉన్నాయి. కాగా చిన్న చిత్రాల్లో ఘనవిజయం సాధించిన చిత్రంగా ‘జాతి రత్నాలు’ టాప్‌ ప్లేస్‌ను దక్కించుకుంది. సమ్మర్‌ అంటే ఇండస్ట్రీకి మంచి సీజన్‌. కానీ ఈ సీజన్‌ కరోనా భయంతో స్టార్ట్‌ కావడంతో థియేటర్స్‌లో పెద్దగా సినిమాలు రాలేదు. ఏప్రిల్‌ నెలలో విడుదలైన 12 చిత్రాల్లో గుర్తుంచుకోదగినవి నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’, పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’. ‘వైల్డ్‌ డాగ్‌’ ఫర్వాలేదనిపించుకుంది. ‘వకీల్‌ సాబ్‌’ మంచి వసూళ్లు రాబట్టాడు. కాగా, కరోనా విజృంభణతో మే, జూన్‌ నెలల్లో  థియేటర్లకు తాళం పడింది.

బ్రేక్‌ తర్వాత: లాక్‌ డౌన్‌ తర్వాత జూలై చివర్లో తెర సందడి ఆరంభమైంది. సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’, తేజా సజ్జా ‘ఇష్క్‌’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తర్వాతి నెలలో వచ్చిన చిత్రాల్లో కిరణ్‌ అబ్బవరం ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’, విశ్వక్‌ సేన్‌ ‘పాగల్‌’, శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ వంటివి ఆదరణ పొందాయి. సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ఫర్వాలేదనిపించుకుంది. బాక్సాఫీస్‌ ఓ మోస్తరు విజయాలతో సాగుతున్న నేపథ్యంలో సెప్టెంబరులో గోపీచంద్‌ ‘సీటీమార్‌’ మోత బలంగా వినిపించింది. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

ఇదే ఉత్సాహాన్ని అక్టోబరులో సాయిధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లిక్‌’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, రోషన్‌ ‘పెళ్లి సందడి’ కొనసాగించాయి. నవంబరులో దాదాపు 23 చిత్రాలు వచ్చినా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. ఇక డిసెంబరు ఆరంభమే ‘అఖండ’ చిత్రంతో బాక్సాఫీసును ఓ మోత మోగించారు బాలకృష్ణ. ఆ సక్సెస్‌ ఊపును అల్లు అర్జున్‌ ‘పుష్ప’, నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కొనసాగించాయి. ఈ నెలాఖర్లో అరడజనకు పైగా చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. వీటిలో రానా ‘1945’, శ్రీ విష్ణు ‘అర్జుణ ఫల్గుణ’, కీర్తీ సురేష్‌ ‘గుడ్‌లుక్‌ సఖి’ ప్రధానమైనవి. కానీ కొన్ని వాయిదా పడే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

డబ్బింగ్‌ బొమ్మ.. ఈ ఏడాది రిలీజైన 225 చిత్రాల్లో అనువాద చిత్రాలు 50 వరకూ ఉన్నాయి. ఈ డబ్బింగ్‌ బొమ్మల్లో హీరో విజయ్‌ ‘మాస్టర్‌’ ఫర్వాలేదనిపించుకుంది. అలాగే దర్శన్‌ ‘రాబర్ట్‌’, కార్తీ ‘సుల్తాన్‌’ , ఏఆర్‌ రెహమాన్‌ నిర్మించిన ‘99 సాంగ్స్‌’, సిద్ధార్థ్‌ ‘ఒరేయ్‌...బామ్మర్ది’, విజయ్‌ సేతుపతి ‘లాభం’, విజయ్‌ ఆంటోనీ ‘విజయ రాఘవన్‌’ విడుదలయ్యాయి. అయితే  కంగనా రనౌత్‌ ‘తలైవి’, శివ కార్తికేయన్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’లు ఆకట్టుకోగలిగాయి. పెద్ద చిత్రాల్లో రజనీకాంత్‌ ‘పెద్దన్న’, శివరాజ్‌కుమార్‌ ‘జె భజరంగీ’, మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’ చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. హాలీవుడ్‌ తెలుగు అనువాదాల్లో ‘గాడ్జిల్లా వర్సెస్‌ కింగ్‌ కాంగ్‌’, ‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌’ సూపర్‌ కలెక్షన్స్‌ను సాధించాయి. ఇంకా ‘డోంట్‌ బ్రీత్‌’, ‘జేమ్స్‌ బాండ్‌’ (నో టైమ్‌ టు డై), ‘ది కంజ్యూరింగ్‌’, ‘వెనోమ్, ‘రెసిడెంట్‌ ఈవిల్‌’ వంటి  సిరీస్‌ల్లోని తాజా చిత్రాలను ఇంగ్లిష్‌ మూవీ లవర్స్‌ చూశారు.

నెట్టింట్లోకి.. కరోనా ఎఫెక్ట్‌తో ఓటీటీలకు వీక్షకుల సంఖ్య పెరిగింది. ఈ కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు బాగానే విడుదలయ్యాయి. కానీ ప్రధానంగా చెప్పుకోదగ్గ  సినిమాలు మాత్రం కొన్నే. వెంకటేశ్‌ ‘నారప్ప’, ‘దృశ్యం 2’, తెలుగులోకి అనువాదమైన సూర్య ‘జై భీమ్‌’ మంచి ఆదరణ దక్కించుకున్నాయి.  నితిన్‌ ‘మ్యాస్ట్రో’ ఫర్వాలేదనిపించుకుంది. చిన్నవాటిలో ‘థ్యాంక్యూ బ్రదర్‌’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ‘సినిమా బండి’లకు ఆదరణ లభించింది. నాని ‘టక్‌ జగదీష్‌’, రాజ్‌ తరుణ్‌ ‘పవర్‌ ప్లే’, సంతోష్‌ శోభన్‌ ‘ఏక్‌ మినీ కథ’, శివానీ రాజశేఖర్‌ ‘అద్భుతం’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, సుహాస్‌ ‘ఫ్యామిలీ డ్రామా’, సత్య ‘వివాహభోజనంబు’, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శిల ‘అన్‌హార్డ్‌’, నవీన్‌చంద్ర ‘సూపర్‌ ఓవర్‌’, ‘చిల్‌ బ్రో’, సముద్రఖని ‘ఆకాశవాణి’, కార్తీక్‌రత్నం ‘అర్ధ శతాబ్దం’, రామ్స్‌ ‘పచ్చీస్‌’, బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివ్య చేసిన ‘క్యాబ్‌ స్టోరీస్‌’ వంటివి నెట్టింట్లోకి వచ్చాయి.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top