Rashmika Mandanna: పరిస్థితి మరింత దిగజారింది: రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌

Rashmika Mandanna Shares a Emotional Note Over Hatred Trolls - Sakshi

‘నేషనల్‌ క్రష్‌’ రష్మిక మందన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. అయితే అదే తీరుతో ఆమె సోషల్‌ మీడియా వేదికగా తరచూ ట్రోల్స్‌ కూడా ఎదుర్కొంటోంది. రష్మి ఫ్యాన్‌డమ్‌ ఎంతుందో.. నెగిటివిటీ కూడా అంతే స్థాయిలో ఉంది. మూవీ, అవార్డు ఫంక్షన్స్‌లో ఆమె తీరుపై నెటిజన్లు తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఓవరాక్షన్‌ చేస్తోందంటూ ఆమెను దారుణంగా ట్రోల్‌ చేస్తుంటారు. అంతేకాదు పలు అంశాలపై ఆమె స్పందించే తీరుపై కూడా అసహనం వ్యక్తం చేస్తుంటారు.

చదవండి: విక్రమ్‌కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్‌’కు గోల్డెన్‌ వీసా

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తనపై వచ్చే నెగిటివిటీపై తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. వివరణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని, నటిగా ఎదగడానికి అవి తనకు ఉపయోగమంటూ తన పోస్ట్‌లో పేర్కొంది. అదే విధంగా నిజమైన ద్వేషం వల్ల లాభం ఏంటని ఈ సందర్భంగా ట్రోలర్స్‌ను ఆమె ప్రశ్నించింది. ‘ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని ఇప్పుడు మీతో పంచుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. నటిగా కెరీర్‌ మొదలైన నాటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాను. సోషల్‌మీడియాలో తరచూ నాపై వచ్చే ట్రోల్స్‌, నెగెటివిటీ చాలా బాధపెడుతున్నాయి. అయితే నేను ఎంచుకున్న జీవితం అలాంటిది.

ఇక్కడ అందరికి నేను నచ్చనని, అలాగే ప్రతి ఒక్కరి ప్రేమను పొందాలనుకోకూడదని అర్థమైంది. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం మాత్రమే నాకు తెలుసు. నేనూ.. మీరు గర్వించే విధంగా పనిచేసేందుకే శ్రమిస్తున్నా. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా’ అని రాసుకొచ్చింది. అయితే ‘నేను మాట్లాడని విషయాల గురించి కూడా నన్ను హేళన చేస్తున్నారు. వాటిని చూసి నా గుండె బద్ధలైంది. పలు ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన కొన్ని మాటలను నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించా. ఇంటర్నెట్‌లో వస్తున్న తప్పుడు సమాచారం వల్ల నాకు మాత్రమే కాదు నా సహచరులను కూడా ఇబ్బంది పెడుతోంది. విమర్శలను పట్టించుకోకూడదని అనుకుంటున్నాను. కానీ, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది.

చదవండి: అప్పటి వరకు అల్లు శిరీష్‌ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్‌

సోషల్‌మీడియా నెగెటివిటీ గురించి మాట్లాడి నేను ఎవరిమీదనో విజయం సాధించానని అనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరిపై నాకు ప్రేమాభిమానం ఉంది. ఇప్పటి వరకూ నేను పనిచేసిన నటీనటుల నుంచి ఎన్నో విషయాల్లో ప్రేరణ పొందా. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే ఇంతటి గుర్తింపు తెచ్చుకున్నా’ ఆమె రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె పోస్ట్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎంతో వేదనతో ఆమె చేసిన పోస్ట్‌ సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, హన్సిక, వెంకి కుడుముల తదితరులను రష్మిక మద్దతుగా నిలిచారు. ‘మా అభిమానం నీకు ఎప్పుడూ ఉంటుంది. ద్వేషం చూపించే వారిని పట్టించుకోవద్దు’ అంటూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top