
ప్రేమలో ఇన్వెస్ట్ చేస్తే ఏమీ మిగలదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ షోరే (Ranvir Shorey). చిన్నప్పటి నుంచి తనకు ప్రేమ కలిసిరావడం లేదని చెప్తున్నాడు. కానీ తాను బంబుల్ అనే ఓ డేటింగ్ యాప్‌లో ఉన్నట్లు తెలిపాడు. రణ్‌వీర్ ఇంకా మాట్లాడుతూ.. స్త్రీపురుషుల మధ్య దూరం పెరిగింది. మాజీ ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న భార్య.. కుటుంబసభ్యుల అండదండలతో భార్య ప్రాణాలు తీసిన భర్త.. ఇలాంటి వార్తలే తరచూ కనిపిస్తున్నాయి.
ప్రేమలో ఇన్వెస్ట్?
నాకైతే చిన్నప్పటినుంచి ఈ ప్రేమలు కలిసిరావడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ను బట్టి ప్రేమలో పడేందుకు ఇది సరైన సమయం కాదేమో అనిపిస్తోంది. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు డబ్బు పెట్టరు. ప్రేమ విషయంలోనూ అంతే.. ఇప్పుడు మార్కెట్ బాగోలేదు. కాబట్టి లవ్‌లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రోజులెలా ఉన్నాయంటే.. నా మాజీ ప్రియుడు కూడా నా కుటుంబ సభ్యుడే అని భార్య ఎదురుతిరిగి చెప్తోంది.
మార్కెట్ బాగోలేదు
ఆమె అన్నదాంట్లో తప్పేముందని పదిమంది తనకు వత్తాసు పలుకుతున్నారు. దీన్నే డౌన్ మార్కెట్ అంటున్నాను. ఇలాంటి సమయంలో ప్రేమ జోలికి పోకుండా.. బుద్ధిగా ఇంట్లో ఉండి బాడీ బిల్డింగ్‌పై ఫోకస్ చేస్తే మీకే మంచిది అని సలహా ఇచ్చాడు. కాగా రణ్‌వీర్ షోరే.. గతంలో పూజా భట్‌ను ప్రేమించాడు. కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు.
పెళ్లి
2010లో నటి కొంకణసేన్ శర్మను పెళ్లాడాడు. వీరికి కుమారుడు హరూన్ సంతానం. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2015లో విడిపోయారు. 2020లో విడాకులు తీసుకున్నారు. రణ్‌వీర్ చివరగా బిండియాకే బాహుబలి అనే సిరీస్‌లో కనిపించాడు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్‌లోనూ పాల్గొన్నాడు.