
ఫేమస్ అవడం ఈజీనా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే కొందరు ఎంత కష్టపడ్డాసరే పెద్దగా గుర్తింపు అందుకోరు. మరికొందరు ఏం చేయకపోయినా సరే ఇట్టే ఫేమస్ అవుతుంటారు. అయితే ఒకటి మాత్రం నిజం! వచ్చిన ఫేమ్‌ను కాపాడుకోవడం అంత ఈజీ అయితే కాదు. అందుకే ఇండస్ట్రీకి చాలామంది తారలు వస్తుంటారు, పోతుంటారు. సోషల్ మీడియాలోనూ అంతే.. సడన్‌గా కొందరు వైరలవుతుంటారు.. అంతలోనే కనుమరుగవుతుంటారు. అలా అప్పట్లో కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్ బాగా పాపులర్ అయ్యాడు.
పాత సామాన్లకు పల్లీలు
పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ (Bhuban Badyakar).. పాత సామాన్లు, పగిలిన వస్తువులకు పల్లీలు ఇస్తానంటూ వీధుల్లో తిరిగేవాడు. పాట రూపంలోనే పల్లీలు అమ్ముకున్నాడు. ఆ పాట సోషల్ మీడియాలో క్లిక్కవడంతో బాగానే డబ్బు సంపాదించాడు. ఇకపై పల్లీలు అమ్ముకోను, సింగర్‌గా కొనసాగుతా.. నా క్రేజ్ చూసి కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందని పోలీసులను ఆశ్రయించాడు. అతడి బిల్డప్ చూసి అందరూ అవాక్కయ్యారు.

కారు కొన్నాక యాక్సిడెంట్
కొందరు విమర్శించారు కూడా! దీంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. ఆర్టిస్ట్‌గా కొనసాగుతానని, అవకాశాల్లేనప్పుడు మళ్లీ పల్లీలు అమ్ముకోక ఇంకేం చేస్తానని మాట మార్చాడు. అప్పటికీ ఆగలేదు.. సంతోషం, డబ్బు రెండూ ఎక్కువైపోయేసరికి కారు కొన్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్ అయి కొద్దిరోజులు ఆస్పత్రిపాలయ్యాడు. తర్వాత అడిగినవారికల్లా అప్పులిచ్చుకుంటూ పోయి వసూలు చేయలేకపోయాడు.
కొంతకాలంగా కనిపించని సింగర్
చూస్తుండగానే సంపాదించినదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. చాలాకాలంగా మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య ఓ యూట్యూబర్ పుణ్యమా అని అతడెలా ఉన్నాడో తెలిసింది. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న భూబన్ అదే స్థానంలో ఇల్లు కట్టుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. వైరల్ సాంగ్ వల్ల నాకు బాగా సంపాదించాను. కానీ, ఆ పాట కాపీ రైట్స్ ఇప్పుడు నావి కావు, ఓ కంపెనీ సొంతం చేసుకుంది. అలా అని నా జీవితం అక్కడితో ఆగిపోలేదు.

జీవితం మెరుగైంది
జనాలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈవెంట్స్‌కు, రియాలిటీ షోలకు రమ్మని పిలుస్తున్నారు. నా జీవితం కాస్త మెరుగుపడింది. జనాలు నన్ను గౌరవిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భూబన్ గౌరవంగా బతుకుతున్నట్లు పేర్కొన్నాడు. అతడి ఇంట్లో అవార్డులతో పాటు భూబన్ పెయింటింగ్ ఉండటం విశేషం.
చదవండి: దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు!