విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu Movie). సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్‌పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్‌ని కొందరు పేరున్న హీరోలకు వినిపించాం. కథలో హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత తమ ఇమేజ్‌కు ఇబ్బంది అవుతుందంటూ నో చెప్పారు. కొత్త అబ్బాయితో వెళితే ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్‌ను తీసుకున్నాం. మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సాగే ఈ సినిమాలో ఎక్కడా అభ్యంతరకరమైన డైలాగ్స్ లేవు. మా సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది.
కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయి. నాలుగేళ్ల క్రితం అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మా కుటుంబ సభ్యులకే చూపించలేకపోయేవాడిని. ఇప్పుడు మా అబ్బాయిలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడగలుగుతున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో ‘సంతానప్రాప్తిరస్తు 2’ చేయాలనుకుంటున్నాం.
మన నేటివ్ సినిమాల్లో కంటెంట్ బాగుంటే అదే గ్లోబల్ స్థాయికి వెళ్తుంది. పాఇండియా అవుతుంది. కరోనా తర్వాత ఓటీటీ డీల్స్ విషయంలో మార్పులు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల పేమెంట్స్ తగ్గిస్తున్నారు. భవిష్యత్‌లో నా దర్శకత్వంలో మళ్లీ సినిమా ఉండొచ్చు. కొత్త ఫిల్మ్‌మేకర్స్ మా మధుర ఆడియో పాటలను వినియోగించుకుంటే నేను డబ్బులు చార్జ్ చేయడం లేదు’’ అని అన్నారు. నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ–‘‘ఐటీ రంగం నుంచి వచ్చిన నేను ‘సంతాన ప్రాప్తిరస్తు’ తో నిర్మాతగా పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.


