
టాలీవుడ్‌లో ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె నడుస్తోంది. తమ జీతాలు 30 శాతం వరకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అటు నిర్మాతలు ఇటు వర్కర్స్ ఎవరూ తగ్గట్లేదు. అయితే ఈ వివాదంలో నిర్మాత విశ్వప్రసాద్ తీరుపై ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందనే దశలో విశ్వప్రసాద్ తమపై కేసులు వేయడం దారుణం అని మండిపడ్డారు. సినీ కార్మికులు అందరూ విశ్వప్రసాద్ తీరుపై చాలా కోపంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?)
ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తనకు రూ.కోటిన్నర నష్టం వచ్చిందని, దీన్ని ఫెడరేషన్ సభ్యులు భరించాలని టీజీ విశ్వప్రసాద్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎక్కడ కూడా వారిని డిస్ట్రబ్ చేయలేదు, డిమాండ్ చేయలేదు కానీ తమపై పని కట్టుకుని కేసులు వేయడం బాధాకరం అని అన్నారు. విశ్వప్రసాద్ సినిమాలు తీస్తున్నారు కానీ సరైన ప్లానింగ్ లేదని, ఆయన వేసిన కేసుల్ని తమ లీగల్ టీమ్ చూసుకుంటుందని పేర్కొన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఛాంబర్ వరకు కార్మికులు అందరం ధర్నా చేస్తాం అని తెలిపారు.
(ఇదీ చదవండి: మొన్న నేషనల్ అవార్డ్.. ఇప్పుడు తెలుగు సింగర్ రోహిత్ నిశ్చితార్థం)