
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన హారర్ మిస్టరీ మూవీ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సాహు గారపాటి మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే మా ‘కిష్కింధపురి’ చిత్రం మాత్రం వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్, దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్, రేడియోతో దెయ్యానికి ఉన్న కనెక్షన్ ఇవన్నీ మా సినిమాలో కొత్తగా ఉంటాయి. ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటివరకు రాలేదు. కొన్ని షాకింగ్, సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయి.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌గారి ప్రెజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలోని పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమా కథ అనుకున్నప్పుడే అనుపమను హీరోయిన్‌గా అనుకున్నాం. అనుపమ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం నెల రోజులు కష్టపడి, దాదాపు రూ. 2 కోట్లతో ఓ రేడియో స్టేషన్ సెట్ వేశాం. సినిమాలోని కీలక సన్నివేశాలు ఇక్కడే జరుగుతాయి. తొలి భాగం వినోదాత్మకంగా, సెకండాఫ్‌లో సీరియస్ హారర్ ఫిల్మ్‌గా టర్న్ అవుతుంది.
‘కిష్కింధపురి’ అనే ఊర్లో జరిగే కథ కనుక ‘కిష్కింధపురి’ అని టైటిల్ పెట్టడం జరిగింది. మా సినిమా థియేటర్స్‌లో ఆడియన్స్‌ను తప్పక ఎంగేజ్ చేస్తుంది. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాన్– థియేట్రికల్ రైట్స్ విషయంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు.
ఓటీటీ డీల్స్ కుదరని కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి. సినిమాల రిలీజ్ డేట్స్ ప్రభావితం అవుతున్నాయి. చూస్తుంటే ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయినట్లుంది. ఇక సినీ కార్మికుల సమ్మె ప్రభావం మా బ్యానర్‌లో (ఈ సినిమాకు సుస్మితా కొణిదెల మరో నిర్మాత) నిర్మిస్తున్న చిరంజీవిగారి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై పడింది. కానీ ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తాం. కాకపోతే అక్టోబరులో షూటింగ్ పూర్తి చేయాలనుకున్నాం. కానీ నవంబరు కల్లా పూర్తి చేస్తాం. ఓ పదిహేను రోజులు తేడా అంతే’’ అని అన్నారు.