
ఇమ్రాన్ హష్మీ, సుజిత్, పవన్ కల్యాణ్, డీవీవీ దానయ్య
‘‘ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారని నాకు తెలియదు. ‘ఖుషి’ చిత్రం సమయంలో ఈ జోష్ చూశాను. అలాంటి జోష్ మళ్లీ ‘ఓజీ’కి వచ్చింది. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా మీరు (ఫ్యాన్స్) నన్ను వదల్లేదనిపిస్తోంది.. మీరు కదా నాకు భవిష్యత్ ఇచ్చింది’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, ప్రియాంకా మోహన్ జోడీగా నటించిన చిత్రం ‘ఓజీ’. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.
ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ–‘‘సుజిత్ నా అభిమాని. ‘జానీ’ మూవీ చూసి నాతో సినిమా తీయాలనుకున్నాడు. ‘సాహో’ సినిమా తర్వాత సుజిత్‌తో సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పి, నాకు పరిచయం చేశారు. తను కథని ముక్కలు ముక్కలుగా చెప్పినా సినిమా తీసేటప్పుడు తన సత్తా తెలిసింది. ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్... నాట్ పవన్ కల్యాణ్. వారిలో మొదటి క్రెడిట్ సుజిత్‌ది. రెండో క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ది. ‘నేను డిప్యూటీ సీఎం అని ఈ రోజు మరచిపోయాను.
మీరు ఊహించుకోండి.. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. నేను సినిమా ప్రేమికుణ్ణి. సినిమా చేసేటప్పుడు దాని ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. రాజకీయాలు చేసేటప్పుడు అదే ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. సుజిత్ టీమ్ చాలా అద్భుతమైనది. ఇలాంటి టీమ్ నేను దర్శకత్వం వహించే టప్పుడు నాకూ ఉండి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాణ్ని కాదేమో? ట్రైలర్ పూర్తిగా సిద్ధం కాలేదంటే కుదరదు. మా వాళ్లకి (ఫ్యాన్స్) ఈ రోజు ఎంతో కొంత చూపించాల్సిందే.
నాకు తెలుసు కదా... అమితాబ్ బచ్చన్ గారి కోసం నేను చిన్నప్పుడు ఎలా కొట్టుకునేవాణ్ణో. ఆయన సినిమాకి టిక్కెట్ దొరక్కపోతే చంపేద్దాం అనిపించేది. ‘ఓజీ’ చిత్రం అందర్నీ రంజింపజేసేలా ఉంటుంది’’ అని చె΄్పారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, వై. రవిశంకర్, రచయిత కోన వెంకట్, ప్రియాంక మోహన్, సంగీత దర్శకుడు తమన్, నటులు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ మాట్లాడారు.