
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్‌లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా ఓ మాల్‌లో నిర్వహించిన మూవీ ప్రమోషన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడియన్స్‌ను ఉద్దేశించి ఎమోషనల్‌గా మాట్లాడారు.
మా సినిమా అవార్డులు అక్కర్లేదని.. డబ్బులు వస్తే చాలని అన్నారు. మలయాళ సినిమాలు ఇక్కడ హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ కావాలన్నారు. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయాలని డైరెక్టర్ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. మీరు ట్వీట్ చేస్తే కనీసం కొంతమంది ప్రేక్షకులైనా మా మూవీ చూస్తారని దర్శకుడు అన్నారు.
ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ..'ప్రతి కథ హీరో చుట్టే తిరగాలని లేదు. అనుపమ కూడా పెద్ద స్టార్. నా సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. మా సినిమాకు అవార్డులు వద్దు. డబ్బులు కావాలి. కచ్చితంగా ఈ చిత్రంపై నాకు నమ్మకముంది. ఇక్కడ లేడీ ఓరియంటెడ్ కాదు.. మెన్ ఓరియంటెండ్ కాదు.. ఇది కేవలం సినిమా అంతే. మన దగ్గర మలయాళ చిత్రాలు హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమాలు అక్కడ బ్లాక్‌బస్టర్ కొట్టాలి. అందుకే మలయాళ నటులను పెట్టాను. సినిమా బాగుంటేనే చూడండి. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్. మీవల్ల ఎంతోమంది మా చిత్రం చూస్తారు.' అని ఆడియన్స్‌ను కోరారు. కాగా.. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది.