
'ఆపరేషన్ సిందూర్' (Operation Sindhoor) పేరుతో సినిమా పోస్టర్ వచ్చేసింది. ఈ టైటిల్ కోసం బాలీవుడ్ బడా దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారు. అయితే, ఒక నిర్మాణ సంస్థ తమ బ్యానర్ పేరుతో ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని వారి స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడులు చేసింది. దీంతో ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇదే బ్యాక్‌డ్రాప్‌తో బాలీవుడ్‌లో సినిమా రానుంది.
‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం సినీ దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో జీ స్టూడియోస్, టీ-సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణసంస్థలు కూడా ఈ పేరు కోసం పోటీపడ్డాయి. అయితే, నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకం, ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కనుందని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటోన్న మహిళను చూపారు. ఉత్తమ్, నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రకటించారు. ఇందులో నటిస్తున్న నటీనటులను వారు ప్రకటించలేదు.
ఆపరేషన్ సిందూర్, మిషన్ సిందూర్, సిందూర్ : ది రివెంజ్‌అంటూ ఆపరేషన్ కోడ్‌నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్‌టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి టైటిల్ వచ్చిన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు.
టైటిల్ విషయంలో వెనక్కి తగ్గిన రిలయన్స్
ఈ పేరుతో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడటం చూసి నెటిజన్లు ఫైర్ అయ్యారు. సెన్సిటివ్ విషయాన్ని ఇలా వ్యాపారంగా మలుచుకుంటారా అంటూ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందూరు కూడా రాబందులతో సమానమని చెబుతున్నారు.